
ఒమన్‌పై టీమిండియా విజయం
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
నత్త నడకన సాగుతున్న ఒమన్ బ్యాటింగ్
189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. ఈ జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నారు. గెలుపు కోసం ఆడుతున్నట్లు కనబడటం లేదు. 14 ఓవర్లు ముగిసే సమయానికి వారి స్కోర్ 100/1గా ఉంది. హమ్మద్ మీర్జా (24), ఆమిర్ కలీమ్ (39) క్రీజ్‌లో ఉన్నారు.
ఆచితూచి ఆడుతున్న ఒమన్
189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 27/0గా ఉంది. ఓపెనర్లు కలీమ్ (13), జతిందర్ సింగ్ (13) ఆచితూచి ఆడుతున్నారు.
ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది. భారత మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసి విఫలమైంది. హార్దిక్ పాండ్యా (1), శివమ్ దూబే (5) ప్రమోషన్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు.
సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు బ్యాటింగ్‌కు దిగలేదు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
సంజూ హాఫ్ సెంచరీ
సంజూ శాంసన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రామనంది బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ మార్కును చేరుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/5గా ఉంది. సంజూకు జతగా తిలక్ వర్మ (27) క్రీజ్‌లో ఉన్నాడు.
సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
13.2వ ఓవర్- టీమిండియా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కలీమ్ బౌలింగ్‌లో శివమ్ దూబే (5) ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు (45) జతగా తిలక వర్మ క్రీజ్‌లోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
11.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆమిర్ కలీమ్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (26) ఔటయ్యాడు. అక్షర్ అంతకముందు బంతికి సిక్సర్ బాది జోరు మీదున్నట్లు కనిపించాడు. సంజూ శాంసన్‌కు (38) జతగా శివమ్ దూబే క్రీజ్‌లోకి వచ్చాడు.
సెంచరీ పూర్తి చేసిన టీమిండియా
టీమిండియా 10 ఓవర్లలో 100 పరుగుల మార్కును (3 వికెట్లు కోల్పోయి) తాకింది. సంజూ శాంసన్ (37), అక్షర్ పటేల్ (10) క్రీజ్‌లో ఉన్నారు.
మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
జితేన్ రామనంది వేసిన 8వ ఓవర్‌లో టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. తొలి బంతికి అభిషేక్ శర్మ (38) వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మూడో బంతికి హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/3గా ఉంది. సంజూ శాంసన్ (27), అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నారు.
అభిషేక్ జోరు
రెండో ఓవర్‌లోనే శుభ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన సహజ శైలిలో జోరు కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి అతను 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. అభిషేక్‌కు జతగా క్రీజ్‌లో ఉన్న సంజూ శాంసన్ (14 బంతుల్లో 13; సిక్స్) నిదానంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 60/1గా ఉంది.
టీమిండియాకు ఆదిలోనే షాక్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ మూడో బంతికే భారత్ శుభ్‌మన్ గిల్ (5) వికెట్ కోల్పోయింది. గిల్‌ను షా ఫైసల్ అనే బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్‌కు (0) జతగా సంజూ శాంసన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 1.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 6/1గా ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్ 2025లో ఇవాళ (సెప్టెంబర్ 19) నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఇదివరకే సూపర్-4కు చేరిన భారత్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఒమన్‌తో తలపడుతుంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. స్టార్ పేసర్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను బరిలోకి దించింది.
తుది జట్లు..
భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్
ఒమన్: అమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (c), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (WK), షా ఫైసల్, జిక్రియ ఇస్లాం, ఆర్యన్ బిస్ట్, మొహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామనంది