మాంచెస్టర్ : ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ నుంచి మాజీ చాంపియన్ వెస్టిండీస్ నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ఏకపక్ష పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా సెమీస్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. టీమిండియా నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మహ్మద్ షమీ(4/16) విండీస్ పతనాన్ని శాసించగా.. బుమ్రా(2/9), చహల్(2/39)లు రాణించారు. విండీస్ ఆటగాళ్లలో సునీల్ అంబ్రొస్(31), నికోలస్ పూరన్(28)లు మినహా ఎవరూ రాణించలేకపోయారు. బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కనీసం పోరాడకుండానే..
విండీస్ విధ్వంసకర ఆటగాళ్ల ముందు టీమిండియా సాధారణ స్కోర్ నిర్దేశించిందని తొలుత అందరూ భావించారు. అయితే ఆ భావనను టీమిండియా బౌలర్లు ఆరంభంలోనే తొలిగించారు. కచ్చితమైన టెక్నిక్, లైన్ అండ్ లెంగ్త్‌తో విండీస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. తొలుత క్రిస్ గేల్(6)ను ఔట్ చేసి విండీస్ వికెట్ల పతనాన్ని ప్రారంభించిన టీమిండియా బౌలర్లు.. వీలుచిక్కినప్పుడల్లా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచారు. హోప్(5), హెట్‌మెయిర్(18), హోల్డర్(6), బ్రాత్‌వైట్(1)లు పూర్తిగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఆరుగురు విండీస్ బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు.
అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ(72; 82 బంతుల్లో 8 ఫోర్లు), మహేంద్ర సింగ్ ధోని 56 నాటౌట్; 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలకు తోడు కేఎల్ రాహుల్(48; 64 బంతుల్లో 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(46; 38 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఓపెనర్లు తడబడ్డారు. రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. రోహిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య వెళ్లిన బంతి కీపర్ చేతుల్లో పడింది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో సమీక్ష వెళ్లిన విండీస్ ఫలితం సాధించింది. ఆ తర్వాత రాహుల్–కోహ్లి జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. వీరు రెండో వికెట్‌కు 69 పరుగులు జతచేశారు. అర్ధసెంచరీ వైపు వెళుతున్న రాహుల్‌ను హోల్డర్ వెనక్కి పంపాడు.
ఆపై విజయ్ శంకర్(14) మూడు ఫోర్లు సాధించి ఊపులో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. కేదార్ జాదవ్(7) సైతం విఫలమయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీ, ధోని జోడీ వికెట్ కాపాడుకుంటూ ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించింది. ఓవర్లు కరుగుతుండడం, ధోని తడబడుతుండడంతో జోరు పెంచేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. హోల్డర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ధోనికి జతకలసిన హార్దిక్ ఆది నుంచే దూకుడు కనబర్చాడు. 38 బంతుల్లోనే 46 పరుగులు చేసి వెనుదిరిగాడు. ధోని–హార్దిక్ జోడీ ఆరో వికెట్‌కు 70 పరుగులు భాగస్వామ్యం ఏర్పరిచింది. చివరి ఓవర్‌లో ధోని 16 పరుగులు( 2 సిక్సర్లు, 1 ఫోర్) సాధించడంతో భారత్ స్కోరు 268కి చేరింది. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు సాధించగా, కాట్రెల్, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment