సెయింట్ పీటర్స్‌బర్గ్: పాపం... మొరాకో! ఇరాన్‌తో గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను చక్కగా మొదలు పెట్టింది. పాస్‌లు, దాడులతో ప్రత్యర్థిని ఆసాంతం ఇరుకునపెట్టింది. 19వ, 30వ నిమిషాల్లో గోల్ కొట్టినంత పని చేసింది. అనేక అవకాశాలు సృష్టించుకుంది. రెండు భాగాల్లోనూ 60 శాతం పైగా ఆధిపత్యం కనబర్చింది. కానీ, ఏం లాభం..? 77వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అజీజ్ బుహాదూజ్... ఇంజూరీ సమయంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’ ఆ జట్టు కొంపముంచింది. ఆపసోపాలు పడుతూ లేస్తూ, పట్టు చిక్కక ఏమాత్రం ఆశావహంగా కనిపించని ఇరాన్‌కు ఊహించని కానుక ఇచ్చింది.
90+5 నిమిషంలో వంపులు తిరుగుతూ ఎడమవైపు నుంచి వచ్చిన క్రాస్‌ఫ్రీ కిక్‌ను తప్పించే యత్నంలో స్ట్రయికర్ అజీజ్ బుహాదూజ్ తమ గోల్ పోస్ట్‌లోకే కొట్టుకున్నాడు. ఈ అనూహ్య పరిణామంతో మొరాకో గోల్ కీపర్ మోనిర్ ఎల్ కజోయ్ నిస్సహాయంగా మిగిలిపోగా... తాము చేయని గోల్‌తో విజయం దక్కిన ఇరాన్ ఆటగాళ్లు ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. ప్రపంచకప్‌లో 13 మ్యాచ్‌లాడిన ఇరాన్‌కు ఇది కేవలం రెండో గెలుపు మాత్రమే కావడం గమనార్హం. 2010 తర్వాత ఓ ఆసియా జట్టు విజయం సాధించడమూ ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌కు ముందు ఇరాన్‌కు లభించిన ఏకైక విజయం 1998 వరల్డ్ కప్‌లో అమెరికాపై 2–1తో దక్కింది.
► 42 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన సెల్ఫ్‌గోల్స్ సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment