
వన్డే ప్రపంచ కప్ ఆరంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఐసీసీ–ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్ధమయ్యాయి. టోర్నీలో రేపు తొలి మ్యాచ్ జరగనుండగా, నేడు (బుధవారం) వేడుకలు జరుగుతాయి. లండన్‌లోని ప్రఖ్యాత ‘మాల్’ రోడ్ దీనికి వేదిక కానుంది. ఈ రోడ్‌కు అతి సమీపంలోనే ఉన్న చారిత్రక బకింగ్‌హామ్ ప్యాలెస్ నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తారు. క్రికెట్, సంగీతం, వినోదం కలగలిసి సంబరాలు ఉంటాయి. ఇందులోని ప్రదర్శనల గురించి పూర్తి వివరాలు వెల్లడించకపోయినా... సుమారు గంటసేపు కార్యక్రమం సాగుతుందని సమాచారం. ఇందులో పాల్గొనేందుకు 4 వేల మంది అభిమానులను బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు. ఈ వేడుకలకు ప్రస్తుతం వరల్డ్ కప్‌లో ఆడుతున్న ఆటగాళ్లెవరూ హాజరు కావడం లేదు. మాజీ ఆటగాళ్లు, మరికొందరు ప్రత్యేక అతిథులు ఇందులో పాల్గొంటారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా నిర్వహిస్తామని టోర్నీ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తీ హామీ ఇచ్చారు. 1999 వరల్డ్ కప్ ఆరంభోత్సవ కార్యక్రమం వర్షంతో పాటు ప్రధాని ప్రసంగం సమయంలో మైక్ సరిగా పని చేయకపోవడం, పేలని టపాసులతో అంతా రసాభాసగా సాగింది!