
'మూడు ఈడెన్‌లూ సరిపోవు'
బాబోయ్.. ఏంటీ ఫోన్లు.. మూడు ఈడెన్‌గార్డెన్స్ ఉన్నా ఈ తాకిడికి తట్టుకోలేం, టిక్కెట్లు ఇవ్వడం మా వల్ల కాదు.. బెంగాల్ క్రికెట్ సంఘంలోని ఓ సీనియర్ అధికారి గురువారం వ్యక్తం చేసిన బాధ ఇది.
కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి :
బాబోయ్.. ఏంటీ ఫోన్లు.. మూడు ఈడెన్‌గార్డెన్స్ ఉన్నా ఈ తాకిడికి తట్టుకోలేం, టిక్కెట్లు ఇవ్వడం మా వల్ల కాదు.. బెంగాల్ క్రికెట్ సంఘంలోని ఓ సీనియర్ అధికారి గురువారం వ్యక్తం చేసిన మాటలు ఇవి. మామూలుగానే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే టిక్కెట్ల కోసం క్యూలు కడతారు. ఇక ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఊరుకుంటారా..! కానీ ఈసారి ఐసీసీ భారత మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లాటరీ ద్వారా అమ్మింది. దీంతో స్థానికంగా క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుతం నగరాన్ని క్రికెట్ వేడి బలంగా తాకింది. ఎలాగైనా పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను చూడాలని ఎంత డబ్బైనా పెట్టి టిక్కెట్లు కొనాలని అభిమానులు తిరుగుతున్నారు.
వీరావేశపరులు
కోల్‌కతా అభిమానులకు ఆవేశం ఎక్కువ. 1966లో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగలా మొదలైన రగడ ఇప్పటికీ అడపాదడపా సాగుతూనే ఉంది. 1996లో ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఈడెన్‌లో అభిమానులు చేసిన రచ్చ ఐసీసీ ఇప్పటికీ మరచిపోలేదు. 1999లో ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సచిన్ అవుటయ్యాక మైదానంలో సీసాలు విసిరి అంతా ఆగం చేశారు. దీంతో స్వయంగా సచిన్ వెళ్లి అభిమానులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇలాంటి వేదికలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే సహజంగానే భారత క్రికెటర్లపై ఒత్తిడి పెరగడం సహజం.
పాక్‌కు కలిసొచ్చిన వేదిక
ప్రపంచకప్‌ల చరిత్రలో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. అదే సమయంలో ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్‌పై గెలవలేదు. ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ టి20లు జరగలేదు. కానీ నాలుగు వన్డేలు ఆడితే అన్నీ పాకిస్తాన్ గెలిచింది. ఇక తాజాగా ఈసారి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఇదే వేదికలో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. తమ దేశం నుంచి నేరుగా ఇక్కడికే వచ్చిన పాక్ జట్టు దాదాపుగా ఈ పరిస్థితులకు అలవాటు పడిపోయింది.
అటు భారత్ కూడా టోర్నీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఇక్కడే ఆడింది. బలమైన వెస్టిండీస్‌ను ఆ మ్యాచ్‌లో ధోనిసేన చిత్తు చేసింది. ఈ వేదిక మీద అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ చెలరేగి ఆడతాడు. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి తరువాత భారత జట్టు ఇక ప్రతి మ్యాచ్‌లోనూ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కోల్‌కతా వచ్చింది.