న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఝలక్ ఇచ్చింది. తాను గాయంతో బాధపడుతున్న కారణంగా తన 74 కేజీల విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలంటూ కోరిన విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెలలో రోమ్ వేదికగా జరిగే ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు.
అయితే ఈ టోర్నీకి రోజుల వ్యవధిలో సుశీల్ గాయపడటంతో... తన విభాగంలో జరిగే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ‘ట్రయల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. సుశీల్ గాయపడితే మేమేం చేయగలం. 74 కేజీల విభాగంలో అర్హత సాధించిన రెజ్లర్ల ప్రదర్శనను ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్స్‌లో పరిశీలిస్తాం.
ఈ విభాగంలో సుశీల్ కంటే మెరుగైన రెజ్లర్ లేరనిపిస్తే... మార్చిలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అతనికి తప్పక అవకాశం ఇస్తాం’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుశీల్ ‘నేను రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాను. నేను గాయంతో బాధపడుతున్న సంగతి వారికి (డబ్ల్యూఎఫ్‌ఐ) తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు.’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment