సాహాకు కోహ్లి మద్దతు
బెంగళూరు: వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. జట్టు కోసం ఏమైనా చేయడానికి అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.
అంచనాలను సాహా అందుకున్నాడా అని కోహ్లిని ప్రశ్నించగా... 'అతడు హార్డ్ వర్కింగ్ క్రికెటర్. జట్టు ఏది కావాలంటే అది చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అతడు తెలివైన వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి బ్యాట్స్ మన్ కూడా. అతడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డు చాలా బాగుంది. ఒత్తిడిలోనూ అతడు వందలకొద్ది పరుగులు చేశాడ'ని సమాధానమిచ్చాడు.
కీపింగ్ లో ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న సాహా, బ్యాటింగ్ లో మరింత రాణించాల్సిన అవసరముందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అతడి నుంచి భారీ స్కోర్లు, మరిన్ని పరుగులు ఆశిస్తున్నట్టు చెప్పాడు. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ కు అతడు సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ఆడగలిగే సత్తా సాహాకు ఉందన్నాడు. బ్యాటింగ్ లోనూ ఆత్మవిశ్వాసం కనబరుస్తాడని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు.