wicketkeeper
-
ఒక్క శతకంతో ఐదు రికార్డులు..
లాహోర్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అజేయమైన సెంచరీతో కదం తొక్కిన పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్(104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6), అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న రిజ్వాన్.. పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మట్లలో (వన్డే, టెస్టు, టీ20ల్లో) శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్‌ను న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లమ్ మాత్రమే సాధించాడు. మెక్కల్లమ్ టెస్ట్‌ల్లో 5, వన్డేల్లో 3, టీ20ల్లో ఒక శతకం నమోదు చేయగా, రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన ఐదో వికెట్ కీపర్‌గా రిజ్వాన్ నిలిచాడు. మెక్కల్లమ్, అహ్మద్ షాజాద్, మోర్న్ వాన్ విక్, లెస్లీ డన్బార్ తరువాత రిజ్వాన్ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే కావడం విశేషం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాక్ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు అహ్మద్ షాజాద్ మత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. మొత్తానికి రిజ్వాన్ ఒక్క సెంచరీతో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పాక్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది. -
‘పాలబుగ్గల’ పార్థివ్ రిటైర్
న్యూఢిల్లీ: సుమారు 18 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ పిచ్‌పై ఒక 17 ఏళ్ల కుర్రాడితో వికెట్ కీపర్‌గా అరంగేట్రం చేయించినప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గంటన్నర పాటు నిలబడి మ్యాచ్‌ను ‘డ్రా’వైపు మళ్లించిన అతని పట్టుదలను చూసి ప్రత్యర్థులు కూడా అభినందించకుండా ఉండలేకపోయారు. తర్వాతి రోజుల్లో భారత క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడే పార్థివ్ పటేల్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ బుధవారం ప్రకటించాడు. తన కెరీర్లో అండగా నిలిచిన బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ సంఘానికి అతను కృతజ్ఞతలు తెలిపాడు. 2018 జనవరిలో చివరిసారిగా భారత జట్టుకు (దక్షిణాఫ్రికాపై) ప్రాతినిధ్యం వహించిన పార్థివ్... ఈ ఏడాది ఆరంభంలో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఆఖరిగా మైదానంలోకి దిగాడు. కీపర్‌గా ప్రతిభ, చక్కటి బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నా... ధోని హవా కారణంగా ఎక్కువ కాలం జాతీయ జట్టుకు పార్థివ్ దూరం కావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ధోని తప్పుకోవడం వల్లో, సాహా గాయాల వల్లో కొన్ని అవకాశాలు వచ్చాయి. టీనేజర్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన అతను 35 ఏళ్ల వయసులో ఆట ముగించాడు. అంతర్జాతీయ క్రికెట్లో: పార్థివ్ అరంగేట్రం చేసిన నాటి నుంచి భారత్ ఆడిన 20 టెస్టుల్లో 19 మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కింది. అయితే కీలక సమయాల్లో కీపర్‌గా చేసిన తప్పిదాలతో జట్టులో స్థానం కోల్పో యాడు. 2002లో హెడింగ్లీ, 2003– 04లో అడిలైడ్‌లో భారత్ సాధిం చిన విజయాల్లో భాగంగా ఉన్న పార్థివ్... 2004లో రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 69 పరుగులు చేయడం చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2012 తర్వాత పార్థివ్ వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చలేదు. అతను 2 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఐపీఎల్/దేశవాళీ క్రికెట్లో: ఐపీఎల్లో పార్థివ్ ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడగా మూడుసార్లు (2010లో చెన్నై తరఫున, 2015, 2017లో ముంబై తరఫున) టైటిల్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన 2017 ఫైనల్లో చివరి బంతికి సుందర్‌ను రనౌట్ చేసిన దృశ్యం అభిమానులు మరచిపోలేనిది. 2020లో బెంగళూరు జట్టులో ఉన్నా, ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. గుజరాత్ తరఫున అతను చిరస్మరణీయ ప్రదర్శన కనబర్చాడు. పార్థివ్ సారథ్యంలోనే గుజరాత్ మూడు ఫార్మాట్లలో (రంజీ ట్రోఫీ, విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ) విజేతగా నిలవడం విశేషం. ఆరేళ్ల వయసులోనే తలుపు సందులో ఇరుక్కుపోవడంతో ఎడమచేతి చిటికెన వేలు కోల్పోయిన పార్థివ్... తొమ్మిది వేళ్లతోనే వికెట్ కీపర్‌గా రాణించడం చెప్పుకోదగ్గ అంశం. భారత్ తరఫున పిన్న వయసులో అరంగేట్రం చేసిన వారిలో సచిన్, పీయూష్ చావ్లా, శివరామకృష్ణన్ తర్వాత పార్థివ్ది నాలుగో స్థానం. అయితే వికెట్ కీపర్‌గా మాత్రం ప్రపంచ క్రికెట్ మొత్తంలో అతనే అందరికంటే చిన్నవాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టుల్లో 31.13 సగటుతో 934 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతను 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 23.74 సగటుతో 736 పరుగులు సాధించిన పార్థివ్ ఖాతాలో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 30 క్యాచ్‌లు పట్టిన అతను 9 స్టంపింగ్‌లు చేశాడు. -
ఈ సారథ్యం నాకొద్దు
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ (డీకే) ఐపీఎల్–13 సీజన్ మధ్యలో అనూహ్యంగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే అతనీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2018 నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ కెప్టెన్సీకి బైబై చెబుతూనే నూతన సారథిగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరాడు. అతను కోరినట్లే కోల్‌కతా ఫ్రాంచైజీ మోర్గాన్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ సారథ్యంలోనే ఇంగ్లండ్ విశ్వవిజేత అయ్యింది. ‘బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు... జట్టుకు మరెంతో చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని కార్తీక్ చెప్పినట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అయినాసరే తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని టీమ్ సీఈఓ వెంకీ మైసూర్ తెలి పారు. ‘జట్టు గురించే ఆలోచించే కార్తీక్‌లాంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఇలాంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఈ సీజన్లో కార్తీక్, మోర్గాన్ కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే మోర్గాన్ సారథిగానూ విజయవంతం కావాలి. ఈ తాజా మార్పువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఆశిస్తున్నాం. రెండేళ్లుగా జట్టును నడిపించిన కార్తీక్‌కు అభినందనలు’ అని ఆయన తెలిపారు. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో ఇంగ్లండ్ క్రికెటర్ ఓ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడు కావడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఇంగ్లండ్‌కే చెందిన కెవిన్ పీటర్సన్ 17 మ్యాచ్‌ల్లో సారథ్య బాధ్యతలు చేపట్టాడు. 2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆరు మ్యాచ్‌ల్లో... 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు 11 మ్యాచ్‌ల్లో పీటర్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
ధోని ప్రపంచ రికార్డు
జోహాన్నెస్‌బర్గ్ : టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతోజరిగిన తొలి టీ20లో అత్యధిక క్యాచ్లందుకన్న వికెట్ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో హెన్‌డ్రీక్స్ క్యాచ్‌తో ఈ ఘనతను సొంతం చేసుకున్నా డు. ఓవరాల్‌గా 275 టీ20ల్లో ధోని 134 క్యాచ్లందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర(133) ను అధిగమించాడు. గతంలో సంగక్కర 254 మ్యాచ్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక మూడో స్థానంలో భారత ఆటగాడు దినేశ్ కార్తిక్(227 టీ20 మ్యాచ్‌ల్లో 123 క్యాచ్‌లు), పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్( 211 టీ20ల్లో 115 క్యాచ్‌లు), వెస్టిండీస్ కీపర్ దినేశ్ రామ్‌దిన్( 168 మ్యాచ్‌ల్లో 108 క్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాల్లో ధోనీది మూడోస్థానం. ధోనీ ఇప్పటి వరకు 601 క్యాచ్‌లు, 174 స్టంపింగ్‌లు చేశాడు. మార్క్ బౌచర్ (952), ఆడమ్ గిల్‌క్రిస్ట్( 813) క్యాచ్‌లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో ధోని 77 వికెట్ల భాగస్వామ్యంతో వికెట్ కీపర్‌గా ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 48 క్యాచ్ అవుట్లు, 29 స్టంపౌట్లున్నాయి. -
కీపింగ్ లో దినేష్ రికార్డు
రాజ్ కోట్: గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత క్యాచ్ అందుకొని ఐపీఎల్ లో 100 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు పొందాడు. నాతూ సింగ్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ ప్లేయర్ మనన్ ఓహ్ర ఇచ్చిన క్యాచ్ ను డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇందులో 74 క్యాచ్ లు, 26 స్టంప్ అవుట్ లు ఉన్నాయి. 144 మ్యాచుల్లో దినేష్ ఈ ఘనత సాధించగా, భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణే ఆటగాడు మహేంద్రసింగ్ ధోని 149 మ్యచుల్లో 94 మందిని అవుట్ చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కొల్ కతా వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప 141 మ్యాచుల్లో 81 మందిని అవుట్ చేసి మూడో స్థానంలో, సన్ రైజర్స్ వికెట్ కీపర్ నమాన్ ఓజా, డెక్కన్ చార్జెర్స్ ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. దినేష్ ఐపీఎల్ 10 సీజన్లలో వివిధ ప్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన కార్తీక్ ఆ తర్వాత కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున కూడా ఆడాడు. -
ఊహించని ఛాన్స్.. నిరీక్షణకు బ్రేక్!
మొహాలి: ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర పడింది. ఊహించని విధంగా అవకాశం తలుపు తట్టింది. వృద్ధిమాన్ సాహా గాయపడడంతో టీమిండియా టెస్టు టీమ్ లో పార్థివ్ పటేల్ కు ఛాన్స్ దక్కింది. ఎనిమిదేళ్ల తర్వాత అతడు టెస్టుల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. పార్థివ్ చివరిసారిగా 2008 ఆగస్టులో శ్రీలంకతో కొలంబొలో జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా తరపున ఆడాడు. 31 ఏళ్ల పార్థివ్ ఇప్పటివరకు 20 టెస్టులు ఆడి 29.69 సగటుతో 683 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 ఏళ్ల వయసులో 2002లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. చిన్న వయసులోనే జాతీయ జట్టులో చోటు సంపాదించిన పార్థివ్ నిలదొక్కుకోలేకపోయాడు. అంచనాలకు తగినట్టు రాణించలేక స్థానాన్ని నిలుపుకోలేకపోయాడు. అతడి కంటే ఆలస్యంగా టీమిండియాలో స్థానం దక్కించుకున్న ఎంఎస్ ధోని జట్టులో పాతుకుపోవడంతో పార్థివ్ కు అవకాశం లేకుండా పోయింది. ధోని జట్టుకు దూరమైనప్పుడు మాత్రమే అతడికి సెలెక్టర్ల నుంచి పిలుపువచ్చేంది. ఆరేళ్ల కాలంలో పటేల్ కేవలం 20 టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2014లో టెస్టుల నుంచి ధోని రిటైరయ్యాక యువ ఆటగాళ్లకు అవకాశం దక్కడంతో పార్థివ్ దేశవాళి మ్యాచ్ లకే పరిమితమయ్యాడు. రంజీ మ్యాచుల్లో రాణిస్తున్నా సెలెక్టర్లు అతడిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం వల్లే అతడికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్ తో జరిగే మూడో టెస్టులో పార్థివ్ రాణించినా అతడి అంతర్జాతీయ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని విశ్లేషకుల అంచనా. -
మరో మైలురాయి చేరుకున్న ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ కీపర్‌గాను మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మహీ కీపర్‌గా 350వసారి (స్టంపవుట్, క్యాచవుట్లు సహా) అవుట్ చేశాడు. బుధవారం హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో చిగుంబరను క్యాచవుట్ చేయడం ద్వారా ధోనీ ఈ ఘనత సాధించాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చిగుంబుర క్యాచ్‌ను ధోనీ అందుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధికమంది బ్యాట్స్మెన్లను డిస్మిసల్ చేసిన కీపర్లలో ధోనీ నాలుగో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో తాజా మ్యాచ్ ధోనీకి 278వ వన్డే. కాగా వన్డేల్లో అత్యధిక డిస్మిసల్ చేసిన కీపర్లలో తొలి మూడు స్థానాల్లో సంగక్కర (482), గిల్ క్రిస్ట్ (472), బౌచర్ (424) ఉన్నారు. -
ధోనీ బెస్ట్ వికెట్ కీపర్ కాదు..!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ప్రస్తుతం తొమ్మిదో సీజన్ నడుస్తోంది. అయితే ప్రతీ ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్ల వీరుడికి పర్పుల్ క్యాప్ ప్రదానం చేస్తూ బ్యాట్స్ మన్, బౌలర్లలో మరింత జోష్ పెంచుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో బెస్ట్ వికెట్ కీపర్ ఎవరన్న విషయంపై చాలా మందికి అవగాహనా ఉండదు. ఎందుకుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికొస్తే భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు కచ్చితంగా ప్రస్తావించి తీరాల్సిందే. అదే ఐపీఎల్ బెస్ట్ వికెట్ కీపింగ్ రేసులో మహీ వెనకపడ్డాడు. ఐపీఎల్ 8 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన మహీ ప్రస్తుతం రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ లో కొనసాగుతున్నాడు. గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో బెస్ట్ కీపర్ గా నిలిచాడు. అయితే దినేష్ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు. కార్తీక్ ఓవరాల్ గా 97 మందిని ఔట్ చేయడంలో ఓ చేయి వేయగా, అందులో 71 క్యాచ్ లు, 26 స్టింపింగ్స్ ఉన్నాయి. ధోనీ 142 మ్యాచులు ఆడగా 89 మందిని మాత్రమే ఔట్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ 62 క్యాచ్ లు పట్టగా, 27 మందిని స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్ బాట పట్టించాడు. ఈ సీజన్లో కార్తీక్ మూడు అర్ధ శతకాలతో పాటు ఓవరాల్ గా 280 రన్స్ చేయగా, 13 మ్యాచులాడిన ధోనీ 220 పరుగులు చేశాడు. మహీ హాఫ్ సెంచరీల ఖాతా తెరవకపోవడం గమనార్హం. -
'సెహ్వాగ్ సలహాలు హెల్ప్ అయ్యాయి'
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు తనకెంతో ఉపకరించాయని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. అతడి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. వీరుతో ఇంటరాక్షన్ తో తన బ్యాటింగ్ మెరుగైందని వెల్లడించాడు. 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కు వీరూ భాయ్ మెంటార్ గా రావడం వ్యక్తిగతంగా నాకెంతో ఉపయోగపడింది. విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో అతడి నుంచి నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఎటువంటి టిప్స్ చెప్పలేదు. కానీ అతడితో ఇంటరాక్షన్ వల్ల నా బ్యాటింగ్ సామర్థ్యం మెరుగవుతూ వస్తోంది. మళ్లీ ఫామ్ అందుకోగలిగాను' అని పీటీఐతో సాహా చెప్పాడు. 2014 ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ చేసిన తర్వాత సాహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో 52 పరుగులు చేసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్స్ పెరుగుతుండడంపై తనకు ఆందోళన లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. -
సాహాకు కోహ్లి మద్దతు
బెంగళూరు: వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచాడు. జట్టు కోసం ఏమైనా చేయడానికి అతడు సిద్ధంగా ఉంటాడని తెలిపాడు. అంచనాలను సాహా అందుకున్నాడా అని కోహ్లిని ప్రశ్నించగా... 'అతడు హార్డ్ వర్కింగ్ క్రికెటర్. జట్టు ఏది కావాలంటే అది చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. అతడు తెలివైన వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి బ్యాట్స్ మన్ కూడా. అతడి ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డు చాలా బాగుంది. ఒత్తిడిలోనూ అతడు వందలకొద్ది పరుగులు చేశాడ'ని సమాధానమిచ్చాడు. కీపింగ్ లో ఆత్మవిశ్వాసంతో కనబడుతున్న సాహా, బ్యాటింగ్ లో మరింత రాణించాల్సిన అవసరముందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అతడి నుంచి భారీ స్కోర్లు, మరిన్ని పరుగులు ఆశిస్తున్నట్టు చెప్పాడు. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ కు అతడు సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ఆడగలిగే సత్తా సాహాకు ఉందన్నాడు. బ్యాటింగ్ లోనూ ఆత్మవిశ్వాసం కనబరుస్తాడని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు.