కీపింగ్ లో దినేష్ రికార్డు
రాజ్ కోట్: గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత క్యాచ్ అందుకొని ఐపీఎల్ లో 100 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్ గా గుర్తింపు పొందాడు. నాతూ సింగ్ వేసిన రెండో ఓవర్లో పంజాబ్ ప్లేయర్ మనన్ ఓహ్ర ఇచ్చిన క్యాచ్ ను డైవ్ చేసి పట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ లో ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్ గా రికార్డు నమోదు చేశాడు. ఇందులో 74 క్యాచ్ లు, 26 స్టంప్ అవుట్ లు ఉన్నాయి.
144 మ్యాచుల్లో దినేష్ ఈ ఘనత సాధించగా, భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణే ఆటగాడు మహేంద్రసింగ్ ధోని 149 మ్యచుల్లో 94 మందిని అవుట్ చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు. కొల్ కతా వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప 141 మ్యాచుల్లో 81 మందిని అవుట్ చేసి మూడో స్థానంలో, సన్ రైజర్స్ వికెట్ కీపర్ నమాన్ ఓజా, డెక్కన్ చార్జెర్స్ ఆటగాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. దినేష్ ఐపీఎల్ 10 సీజన్లలో వివిధ ప్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన కార్తీక్ ఆ తర్వాత కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరుపున కూడా ఆడాడు.