ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం
ఫించ్ మెరుపులు.. ఢిల్లీకి భారీ లక్ష్యం
Published Wed, May 10 2017 9:55 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
► రాణించిన దినేష్ కార్తీక్
కాన్పుర్: ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అర్ధసెంచరీ చేయడంతో గుజరాత్ నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీకి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఆదిలోనే ఓపెనర్ డ్వాన్ స్మిత్(8) వికెట్ కోల్పోయింది. లేని పరుగు ప్రయత్నించిన స్మిత్ రనౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(6) కమిన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయి నిరాశ పర్చాడు. ఇక గుజరాత్ పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. మరో వైపు వేగంగా ఆడిన ఓపెనర్ ఇషాన్ కిషన్(34) కూడా మిశ్రా బౌలింగ్ లో అనవసరపు షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు.
ఇక క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్, ఆరోన్ ఫించ్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. బ్రాత్ వైట్ వేసిన 17 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన దినేశ్ కార్తీక్ (40) అండర్సన్ అద్బుత క్యాచ్ కు వెనుదిరిగాడు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ 92 పరుగులు జోడించడంతో గుజరాత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఇదే ఓవర్ మరుసటి బంతిని సిక్స్ కొట్టిన ఫించ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫించ్ జడేజాతో కలిసి చెలరేగాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేసిన ఫించ్ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో ఫాల్కనర్, జడేజా ఆచితూచి ఆడడంతో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో కమిన్స్, మిశ్రా, బ్రాత్ వైట్, షమీ లకు తలో వికెట్ దక్కింది.
Advertisement
Advertisement