'సెహ్వాగ్ సలహాలు హెల్ప్ అయ్యాయి'
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు తనకెంతో ఉపకరించాయని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. అతడి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపాడు. వీరుతో ఇంటరాక్షన్ తో తన బ్యాటింగ్ మెరుగైందని వెల్లడించాడు. 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కు వీరూ భాయ్ మెంటార్ గా రావడం వ్యక్తిగతంగా నాకెంతో ఉపయోగపడింది. విభిన్న పరిస్థితుల్లో బ్యాటింగ్ ఎలా చేయాలో అతడి నుంచి నేర్చుకున్నాను. ప్రత్యేకంగా ఎటువంటి టిప్స్ చెప్పలేదు. కానీ అతడితో ఇంటరాక్షన్ వల్ల నా బ్యాటింగ్ సామర్థ్యం మెరుగవుతూ వస్తోంది. మళ్లీ ఫామ్ అందుకోగలిగాను' అని పీటీఐతో సాహా చెప్పాడు.
2014 ఐపీఎల్ ఫైనల్లో సెంచరీ చేసిన తర్వాత సాహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 33 బంతుల్లో 52 పరుగులు చేసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్స్ పెరుగుతుండడంపై తనకు ఆందోళన లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.