సెమీస్‌లో ఇంగ్లండ్
టి20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికా అవుట్
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ చెమటోడ్చి గెలిచింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులతో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకను ఓడించి మూడో విజయంతో సగర్వంగా సెమీస్‌కు చేరింది. ఈ ఫలితంతో శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా కూడా లీగ్ దశతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ రాయ్ (39 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రూట్ (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అయితే బట్లర్ (37 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చివరి ఐదు ఓవర్లలో 72 పరుగులు వచ్చాయి. వాండార్సే 2 వికెట్లు తీశాడు.
శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి ఓడిపోయింది. తొలి మూడు ఓవర్లలోనే 15 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మాథ్యూస్ ( 54 బంతుల్లో 73 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కపుగెడెర (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్), తిషార పెరీరా (11 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు), షనక (9 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్సర్)ల సహాయంతో చివరి వరకూ పోరాడాడు. దీంతో ఓ దశలో శ్రీలంక గెలుపుదిశగా సాగింది. అయితే 19వ ఓవర్లో జోర్డాన్ 2 వికెట్లు తీయగా... ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగుల దూరంలో ఉన్న శ్రీలంకను స్టోక్స్ నిలువరించాడు. ఈ ఓవర్లో మాథ్యూస్ ఆడినా 4 పరుగులు మాత్రమే వచ్చాయి.
స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ ఎల్బీడబ్ల్యు (బి) వాండార్సే 42; హేల్స్ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 0; రూట్ (సి) తిరిమన్నె (బి) వాండార్సే 25; బట్లర్ నాటౌట్ 66; మోర్గాన్ రనౌట్ 22; స్టోక్స్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1-4; 2-65; 3-88; 4-162.
బౌలింగ్: మాథ్యూస్ 4-0-25-0; హెరాత్ 4-1-27-1; వాండార్సే 4-0-26-2; సిరివర్ధన 1-0-9-0; చమీరా 4-0-36-0; పెరీరా 2-0-27-0; షనక 1-0-15-0.
శ్రీలంక ఇన్నింగ్స్: చండీమల్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 1; దిల్షాన్ (సి) హేల్స్ (బి) విల్లీ 2; సిరివర్ధన (సి) మోర్గాన్ (బి) విల్లీ 7; తిరిమన్నె రనౌట్ 3; మాథ్యూస్ నాటౌట్ 73; కపుగెడెర (సి) స్టోక్స్ (బి) ప్లంకెట్ 30; పెరీరా (సి) విల్లీ (బి) జోర్డాన్ 20; షనక (సి) రూట్ (బి) జోర్డాన్ 15; హెరాత్ (బి) జోర్డాన్ 1; వాండార్సే నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1-3; 2-4; 3-15; 4-15; 5-95; 6-137; 7-155; 8-157.
బౌలింగ్: విల్లీ 4-0-26-2; జోర్డాన్ 4-0-28-4; ప్లంకెట్ 4-0-23-1; స్టోక్స్ 4-0-19-0; రషీద్ 2-0-31-0; మోయిన్ అలీ 2-0-32-0.
న్యూజిలాండ్ x ఇంగ్లండ్?
ప్రస్తుతం గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్ ఆరేసి పాయింట్లతో సమానంగా ఉన్నాయి. విండీస్ తమ ఆఖరి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో దారుణంగా ఓడిపోతే తప్ప ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అంటే ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్‌ది రెండో స్థానం. ఫలితంగా గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం ఢిల్లీలో జరుగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ విజేత సెమీస్‌లో వెస్టిండీస్‌తో ఆడాల్సి రావచ్చు. ఈ మ్యాచ్ గురువారం ముంబైలో జరుగుతుంది.