ఇటు పెద్దోళ్లు అటు కుర్రాళ్లు | Under-19 World Cup india vs sri lanka | Sakshi
Sakshi News home page

ఇటు పెద్దోళ్లు అటు కుర్రాళ్లు

Published Tue, Feb 9 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

ఇటు పెద్దోళ్లు    అటు కుర్రాళ్లు

ఇటు పెద్దోళ్లు అటు కుర్రాళ్లు

మూడు మ్యాచ్‌ల టి 20 సిరీస్   భారత్
శ్రీలంక  అండర్-19 ప్రపంచకప్ సెమీస్


కాకతాళీయమే అయినా భారత్, శ్రీలంక జట్లు రెండు భిన్న ఫార్మాట్లలో రెండు భిన్న జట్లతో రెండు భిన్న వేదికలపై ఒకేరోజు తలపడుతున్నాయి. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణేలో నేడు భారత్, శ్రీలంక సీనియర్ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్ పోరు జరగనుంది. అటు బంగ్లాదేశ్‌లో భారత్, శ్రీలంక జట్లు నేడు అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఒకవేళ ధోనిసేన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా సిరీస్‌లో పుంజుకోవచ్చు. కానీ కుర్ర జట్టు మాత్రం ప్రపంచకప్ కల సాకారం చేసుకోవాలంటే లంకను కచ్చితంగా జయించాలి.
 
 పుణే: ఆస్ట్రేలియా గడ్డపై సంచలన ఆటతీరుతో కంగారూలను చిత్తు చేసి జోరు మీదున్న భారత్ ఓ వైపు... సీనియర్ క్రికెటర్లకు గాయాలతో, కుర్రాళ్ల అనుభవలేమితో, న్యూజిలాండ్ చేతిలో పరాభవాలతో శ్రీలంక మరో వైపు... టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ నేడు (మంగళవారం) సహారా స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియాపై గెలవడం ద్వారా టి20 ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరిన భారత్ ఈ సిరీస్ గెలిస్తేనే దానిని నిలబెట్టుకోగలుగుతుంది.

తుది జట్టులో ఎవరు?
శ్రీలంకతో ఆడే సిరీస్‌లో ఉన్న క్రికెటర్లలో ప్రపంచకప్, ఆసియాకప్‌లకు ఎంపిక కాని వారు కూడా ఉన్నారు. మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్‌ల రూపంలో ఈ ఇద్దరూ అందుబాటులో ఉన్నారు. ప్రపంచకప్‌కు ముందు క్రికెటర్లకు ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటే ఈ ఇద్దరినీ బెంచ్‌కే పరిమితం చేయాలి. కోహ్లికి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చినందున రహానే తుది జట్టులోకి రావడం ఖాయమే. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్, ధావన్‌లతో పాటు రైనా, ధోని, యువరాజ్‌లతో మిడిలార్డర్ అత్యంత పటిష్టంగా ఉంది. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఇప్పటివరకూ బ్యాట్‌తో సత్తా చూపే అవకాశమే రాలేదు. అలాగే రవీంద్ర జడేజాకు కూడా కొంత బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి. అయితే సిరీస్‌లో తొలి మ్యాచ్ అయినందున బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయకపోవచ్చు. జడే జాతో పాటు అశ్విన్ స్పిన్ బాధ్యత తీసుకుంటాడు. కొత్త క్రికెటర్ పవన్ నేగీని ఆడించాలంటే జడేజా లేదా యువరాజ్‌లలో ఒకరిని ఆపాలి. తొలి మ్యాచ్‌లోనే బహుశా ఈ ప్రయోగం చేయకపోవచ్చు. ఇక ఇద్దరు పేస్ బౌలర్ల కోటాలో నెహ్రా, బుమ్రా తుది జట్టులో ఉంటారు. స్వదేశంలో ప్రపంచకప్‌కు ముందు స్పిన్నర్లు ఈ పరిస్థితులకు అలవాటు పడటం కీలకం. కాబట్టి వీలైనంత వరకు అందరికీ అవకాశం ఇవ్వడం కూడా ఓ ఆలోచన. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

చాంపియన్‌కు సవాల్
టి20లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ శ్రీలంక ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సంగక్కర, జయవర్ధనే రిటైర్ అయిన లోటు కనిపిస్తుండగానే... మాథ్యూస్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇక ఓపెనర్ దిల్షాన్ కూడా గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఇక పేస్ విభాగంలో మలింగ, కులశే ఖర... కీలక స్పిన్నర్ హెరాత్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. కెప్టెన్ చండీమల్, కపుగెడెర, తిసార పెరీరా మాత్రమే బాగా తెలిసిన బ్యాట్స్‌మెన్. ఆల్‌రౌండర్లు సిరివర్ధనే, ప్రసన్న కూడా దాదాపుగా తుది జట్టులో ఉంటారు. సరైన పేసర్లు అందుబాటులో లేనందున వెటరన్ దిల్హారో ఫెర్నాండోకు జట్టులో చోటు దక్కింది. ఫామ్‌లో ఉన్న భారత స్టార్స్‌ను లంక బౌలర్లు ఏ మేరకు ఆపగలుగుతారో సందేహమే.

జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, రైనా, యువరాజ్, హార్దిక్, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
 
శ్రీలంక
: చండీమల్ (కెప్టెన్), డిక్‌వెల్లా, గుణతిలక, షనక, సిరివర్ధన, కపుగెడెర, తిషార పెరీరా, ప్రసన్న, సేనానాయకే, ఫెర్నాండో, ఎరంగా.
 
పిచ్, వాతావరణం
పుణేలోని సహారా స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం. మంచు ప్రభావం పెద్దగా ఉండకపోతే టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా బ్యాటింగ్ చేస్తుంది. వర్షం సూచనలు లేవు. భారత  బ్యాట్స్‌మెన్ ఫామ్ దృష్ట్యా భారీ స్కోర్లు ఆశించవచ్చు.  
 
‘మేం ప్రపంచ చాంపియన్లమే అయినా సీనియర్ క్రికెటర్లు అందుబాటులో లేరు. అయితే యువ క్రికెటర్లకు ఇదో గొప్ప అవకాశంగా మేం చూస్తున్నాం. తమ సత్తా నిరూపించూకోవాలని కుర్రాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. ఆశావహ దృక్పథంతో సిరీస్‌ను ప్రారంభిస్తాం.’       - చండీమల్
 
 ‘ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో రైనా ఆడతాడు. అందుకోసం ఈ సిరీస్‌లోనూ అదే స్థానంలో ఆడిస్తాం. పెద్ద టోర్నీకి ముందు సన్నాహకంగా శ్రీలంకతో మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. టి20ల్లో అన్ని జట్లూ బలంగానే ఉంటాయి. ఆ రోజు ఎవరు అన్ని రంగాల్లో రాణిస్తే వారిదే విజయం.’ - ధోని
 
ఉదయం గం. 8.30  నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

శ్రీలంక  అండర్-19 ప్రపంచకప్ సెమీస్

 మిర్‌పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న యువ భారత్‌కు అసలైన పరీక్ష నేడు (మంగళవారం) ఎదురుకానుంది. మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు స్థానిక షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగే సెమీఫైనల్‌లో శ్రీలంకతో తలపడనుంది. సన్నాహక మ్యాచ్‌లతో పాటు ప్రధాన టోర్నీలోనూ భారత కుర్రాళ్లకు ప్రత్యర్థుల నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. చక్కటి ఆల్‌రౌండ్ ప్రతిభతో ప్రతీ మ్యాచ్‌లోనూ  నెగ్గి అంతులేని ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతున్నారు. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో టాప్ ఆర్డర్ కాస్త తడబడి వికెట్లు వెంటవెంటనే కోల్పోయినా మిగిలిన బ్యాట్స్‌మెన్ నిలిచారు. అలాగే కివీస్, నేపాల్‌పై విజయాలతో పాటు... క్వార్టర్స్‌లో నమీబియాను 197 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించారు. ఈనేపథ్యంలో నేటి మ్యాచ్‌లోనూ తమ అత్యుత్తమ ఆటతీరు చూపి శ్రీలంకను ఓడిస్తామని కోచ్ రాహుల్ ద్రవిడ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీలంక తమ గ్రూపు ‘బి’ మ్యాచ్‌లో ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాకిస్తాన్ తర్వాత స్థానాన్ని పొందింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుని మంచి ఊపు మీదుంది.

భారత్ ఆల్‌రౌండ్ షో
ఇప్పటిదాకా టోర్నీలో భారత్ ఆడిన మ్యాచ్‌లను గమనిస్తే బ్యాటింగ్‌తో పాటు బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించి విజయాలను అందించారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ (252 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (245) అత్యుత్తమ ఫామ్‌తో జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలుస్తున్నారు. క్వార్టర్స్‌లో 96 బంతుల్లోనే 111 పరుగులతో రెచ్చిపోయిన పంత్ నేడు కూడా అదే జోరును కొనసాగిస్తే భారత్‌కు ఎదురుండదు. ఇక సర్ఫరాజ్ నిలకడను ప్రదర్శిస్తూ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు చేశాడు. వీరికి తోడు అర్మాన్ జాఫర్, మహిపాల్ లొమ్రోర్ కీలక సమయాల్లో జట్టుకు సహాయపడుతున్నారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫామ్ ఆందోళన  కలిగిస్తోంది. ఇక బౌలింగ్‌లో అవేశ్ ఖాన్ (9 వికెట్లు) ఇప్పటికే జట్టు నుంచి అత్యధిక వికెట్లు సాధించాడు. లొమ్రోర్ (7), దాగర్ (5) కూడా ప్రత్యర్థులను ఇబ్బందిపెడుతున్నారు.

స్పిన్‌ను నమ్ముకున్న లంక
శ్రీలంక జట్టు ప్రధానంగా స్పిన్ బౌలింగ్‌ను నమ్ముకుంది. భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను దీటుగా ఆడగలిగినా అదే మాకు ప్రధాన బలమని వారి కోచ్ విజేసూరియ చెబుతున్నారు. ఇంగ్లండ్‌తో ఆడినట్టుగానే సెమీస్‌లో భారత్‌పై ఆడితే మ్యాచ్ తమకు అనుకూలంగా మారుతుందని అన్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ చరిత్ అసలంక (194 పరుగులు) అవిష్క ఫెర్నాండో (143)లపై ఆధారపడింది. స్పిన్నర్లు హసరంగ  డి సిల్వ, దమిత సిల్వ రాణిస్తూ ఇప్పటికే ఏడేసి వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లోనూ లంక వీరినే నమ్ముకుంది.
 
జట్లు (అంచనా): భారత్ : ఇషాన్ కిషన్ (కెప్టెన్), రిషబ్, అన్‌మోల్ ప్రీత్, సర్ఫరాజ్, అర్మాన్, లొమ్రోర్, సుందర్, దాగర్, అవేశ్, బాథమ్, ఖలీల్ అహ్మద్.

 శ్రీలంక : చరిత్ అసలంక (కెప్టెన్), బండారా, ఫెర్నాండో, మెండిస్, అశన్, విశాద్ రందిక, హసరంగ డి సిల్వ, నానయక్కర, దమిత్ సిల్వ, నిమేష్, ఫెర్నాండో.
 
 పిచ్, వాతావరణం

భారత్ తమ లీగ్ మ్యాచ్‌లన్నీ ఇక్కడే ఆడి భారీగా పరుగులు సాధించింది. అయితే బౌలర్లకు కూడా ఈ పిచ్ సహకరించే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉండనుంది. అయినా మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేదు. మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా ఉంది.
 
సెమీస్‌లో విండీస్
ఫతుల్లా: పాకిస్తాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ కుర్రాళ్లు 5 వికెట్లతో గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించారు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 227 పరుగులు చేసింది. 57 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో ఆరో నంబర్ బ్యాట్స్‌మన్ ఉమెర్ మసూద్ (113) వీరోచిత సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 40 ఓవర్లలో 5 వికెట్లకు 229 పరుగులు చేసి నెగ్గింది. ఇమ్లాచ్ (54), హెట్‌మైర్ (52) రాణించారు. సెమీస్‌లో విండీస్ జట్టు ఆతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement