వుషులో రెండు పతకాలు ఖాయం
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. వుషు క్రీడాంశంలో మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసింది. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో ‘విన్ బై రౌండ్’ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరింది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం దక్కుతుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా)ను ఎదుర్కోనుంది. మరోవైపు పురుషుల సాండా 60 కేజీల విభాగంలో నరేందర్ గరేవాల్ కూడా సెమీస్‌కు చేరి మరో పతకాన్ని సిద్ధం చేశాడు. క్వార్టర్స్‌లో తను 2-0తో అబ్దుల్లా (పాక్)పై నెగ్గాడు. కానీ పురుషుల 75 కేజీల క్వార్టర్స్‌లో రజనీ డియోరి 0-2తో వాన్ సీ (వియత్నాం) చేతిలో ఓడాడు. ఆసియా గేమ్స్ చరిత్రలో వుషు విభాగంలో ఇప్పటిదాకా భారత్ మూడు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, రెండు కాంస్యాలున్నాయి.
టెన్నిస్: పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు పరాజయాలు ఎదురయ్యాయి. కజకిస్థాన్‌తో జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత్ 1-2 తేడాతో ఓడింది. మహిళల టీమ్ ఈవెంట్‌లోనూ కజకిస్థాన్ చేతిలో 1-2తో ఓడి వెనుదిరిగింది.
జూడో: మహిళల +78 కేజీల క్వార్టర్ ఫైనల్లో రజ్వీందర్ కౌర్ 0-2తో జాజ్మా ఒడ్కు (మంగోలియా) చేతిలో ఓడింది. ఆ తర్వాత రెపిచేజ్‌లోనూ నగీరా సర్బషోవాపై 0-3తో ఓడి పతకం ఆశలను వమ్ము చేసుకుంది.
హాకీ: మహిళల హాకీ పూల్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో భారత జట్టు 3-0తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. 15వ నిమిషంలో పూనమ్ రాణి తొలి గోల్ చేయగా, 39వ నిమిషంలో వందన కఠారియా రెండో గోల్‌తో ఆధిక్యాన్ని అందించింది. ద్వితీయార ్ధం 53వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది.
బాస్కెట్‌బాల్: పురుషుల క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత బాస్కెట్‌బాల్ జట్టు 80-61 తేడాతో కజకిస్థాన్‌పై నెగ్గింది.
వాలీబాల్: మహిళల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 0-3తో జపాన్ చేతిలో ఓడింది.
స్విమ్మింగ్: పురుషుల 50మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో భారత స్విమ్మర్ మధు నాయర్ 26.85 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచాడు.
హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘డి’లో భారత జట్టు 12-47తో జపాన్ చేతిలో; మహిళల జట్టు 12-39తో చైనా చేతిలో ఓడాయి.
జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్: మహిళల వ్యక్తిగత అర్హత అండ్ టీమ్ ఫైనల్‌లో భారత్ చివరి (8) స్థానంలో నిలిచింది.
ఫుట్‌బాల్: పురుషుల తొలి రౌండ్‌లో భారత్ 0-2తో జోర్డాన్ చేతిలో మట్టికరిచింది.
సైక్లింగ్ ట్రాక్: పురుషుల స్ప్రింట్ ప్రి క్వార్టర్స్‌లో రెపిచేజ్‌లో అమర్జిత్ సింగ్ నేగి రెండో స్థానంలో, హీట్ 2లో అమ్రిత్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.