the Asian Games
-
డబ్బులు కావాలంటే భారత్‌కు ఆడాల్సిందే!
అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: తమ నుంచి నిధులు పొందాలనుకుంటే కచ్చితంగా భారత్‌కు ఆడాల్సిందేనని అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ అల్టిమేటం జారీ చేసింది. ఎప్పుడు పిలిచినా అథ్లెట్లు అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంచియాన్ ఏషియాడ్‌లో ఆడటానికి చాలా మంది ఆటగాళ్లు అయిష్టత వ్యక్తం చేయడంతో క్రీడా శాఖ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇలాంటి నిబంధనలను గతేడాదే అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపించినా అవి సరిగా అమలుకాకపోవడంతో మరోసారి వాటిని బయటకు తీసుకొచ్చింది. ఇప్పట్నించి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆసియా క్రీడల కోసం భారత బృందాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మేం ఆడబోమని చెప్పారు. ఇది మా దృష్టికి వచ్చింది. గేమ్స్‌లో కాకుండా ప్రైజ్‌మనీ వచ్చే టోర్నీల్లో ఆడేందుకు వాళ్లు మొగ్గు చూపారు. వీళ్లు ఈ పోటీలను సీరియస్‌గా తీసుకోవడం లేదని తేలింది. గేమ్స్ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఇలాంటి టోర్నీలో ఎక్కువ పతకాలు గెలిస్తే దేశ ప్రతిష్ట పెరుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేస్, బోపన్న, సోమ్దేవ్లను ఉద్దేశించి ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. టెన్నిస్ ఆటగాళ్లకు ఏఐటీఏ మద్దతు అంతర్జాతీయ టోర్నీలకు డుమ్మా కొడితే ఆర్థిక సహాయం చేయబోమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐఏటీఏ) స్పందించింది. సోమ్‌దేవ్, పేస్, బోపన్నలు ఏషియాడ్‌లో ఆడకపోవడానికి కారణాలను వెల్లడించింది. ‘ఆటగాళ్ల నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంది. అంతకు వారం కిందటే ఆ ముగ్గురు డేవిస్ కప్‌లో ఆడారు. హోరాహోరీ పోరులో సెర్బియా చేతిలో ఓడారు. వాళ్లకు దేశం పట్ల ఎలాంటి అంకితభావం ఉందో ఈ మ్యాచ్‌లను చూస్తే తెలిసిపోతుంది. ఆటగాళ్లకు మెరుగైన ర్యాంక్‌లు ఉండటం చాలా అవసరం. లేదంటే దేశం తరఫున గ్రాండ్‌స్లామ్, ఒలింపిక్స్‌లో ఆడలేరు’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ భరత్ ఓజా అన్నారు. గేమ్స్‌లో ఆడకపోవడం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును త్యాగం చేశారన్నారు. ‘గేమ్స్‌లో ఆడితే ఈ ముగ్గురికి పతకాలు వచ్చేవి. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు పురస్కారాలు ఇచ్చేవి. కానీ గేమ్స్ నుంచి వైదొలిగి ఏటీపీ, చాలెంజర్ టోర్నీలో ఆడటం వల్ల దీన్ని నష్టపోయారు. కారణం ర్యాంక్‌లను కాపాడుకోవాలన్న లక్ష్యమే’ అని ఓజా వ్యాఖ్యానించారు. -
నిలకడే కీలకం
స్వర్ణం పురోగతికి సూచన: వాల్ష్ న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో 16 ఏళ్ల విరామం తర్వాత సాధించిన స్వర్ణ పతకం... భారత హాకీ భవిష్యత్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తెలిపారు. అయితే ఈ తరహా ప్రదర్శన పదేపదే చేయాలంటే జట్టులో నిలకడ అత్యంత ముఖ్యమని ఈ ఆస్ట్రేలియన్ మాజీ క్రీడాకారుడు అభిప్రాయపడ్డాడు. జట్టు పురోగతికి ఏషియాడ్ స్వర్ణం సూచిక అని ఈ సందర్భంగా వాల్ష్ తెలిపాడు. ‘ప్రస్తుతం పరిస్థితి సున్నితంగా, సమతూకంగా ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే భారత జట్టు మెరుగైన స్థితిలో ఉందని ఏషియాడ్ ఫలితం నిరూపించింది. ఇక్కడి నుంచి మరింత ఎత్తుకు ఎదగాలంటే దూకుడుతో కూడిన వ్యూహాలు అమలు చేయాలి. అలాగైతేనే అనుకున్నస్థాయికి చేరుకుంటాం’ అని వాల్ష్ అన్నాడు. ప్రస్తుత జట్టు ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదువలేదని... అయితే వారెంత కాలం నిలకడగా ఆడతారో చెప్పడం కష్టమన్నారు. భారత జట్టు ఆటతీరులో పురోగతి ఉన్నా... అగ్రశ్రేణి జట్లయిన ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌తో పోటీపడే సత్తా ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని ఆయన అన్నారు. -
జకార్తాలో కలుద్దాం...
ఇంచియాన్: పక్షం రోజుల పాటు ఆసియా ఖండాన్ని ఉర్రూతలూగించిన క్రీడల పండుగ ముగిసింది. 17వ ఆసియా క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించామనే కించిత్ గర్వంతో... కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో... సంబరాలు అంబరాన్ని తాకేలా శనివారం జరిగిన ముగింపు వేడుకలకు ఇంచియాన్ ఏషియాడ్ స్టేడియం వేదికైంది. ప్రధానంగా కొరియా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ క్రీడాభిమానులకు పరిచయం చేసే విధంగా ఈ వేడుకలు సాగాయి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఫహాద్ అల్ సబా క్రీడల ముగింపును అధికారికంగా ప్రకటించారు. ‘మరో నాలుగేళ్ల అనంతరం ఆసియాకు చెందిన యువకులు జకార్తాలో కలవాలని పిలుపునిస్తున్నాను. సోదరభావంతో మనమంతా ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ ఇంచియాన్.. థ్యాంక్యూ కొరియా... థ్యాంక్యూ ఆసియా’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత ఓసీఏ పతాకం కిందికి దిగుతుండగా 45 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల సమక్షంలో అధికారిక గీతం స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. కార్యక్రమంలో తొలి భాగం కొరియా జాతీ య డ్యాన్స్ కంపెనీ ‘రెయిన్బో కొయిర్’ సభ్యుల ప్రదర్శనతో పాటు జాతీయ గూగక్ సెంటర్ డ్యాన్స్ ట్రూప్ వారి నృత్యాలతో ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆసియా స్నేహితుల మధ్య శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని వివిధ దేశాలకు చెందిన 30 మంది చిన్నారులతో కలిసి రెయిన్బో కొయిర్ గ్రూప్ పాడిన గీతం ఆకట్టుకుంది. అలాగే కొరియా సంప్రదాయక మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో ఫైటర్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై తాజా గేమ్స్‌లోని అథ్లెట్ల విజయాలు, పరాజయాలు, భావోద్వేగాలను ప్రేక్షకులకు మరోసారి ప్రదర్శించారు. తొలి ఆసియా గేమ్స్‌కు చెందిన పతాకం, టార్చితోపాటు ఓసీఏ పతాకాన్ని 2018 క్రీడల వేదిక జకార్తా (ఇండోనేసియా) ప్రతినిధులకు అందజేశారు. జకార్తాకు చెందిన కళాకారుల నృత్యం, సంగీత ప్రదర్శన కూడా కొద్దిసేపు సాగింది. చివర్లో ఇంచియాన్ గేమ్స్ జ్యోతిని ఆర్పివేయడంతో క్రీడలు ముగిసిన ట్టయ్యింది. పతకాల పట్టిక (స్వర్ణాల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయించారు) దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం చైనా 151 108 83 342 దక్షిణ కొరియా 79 71 84 234 జపాన్ 47 76 77 200 కజకిస్థాన్ 28 23 33 84 ఇరాన్ 21 18 18 57 థాయ్‌లాండ్ 12 7 28 47 ఉత్తర కొరియా 11 11 14 36 భారత్ 11 10 36 57 చైనీస్ తైపీ 10 18 23 51 ఖతార్ 10 0 4 14 ఉజ్బెకిస్థాన్ 9 14 21 44 బహ్రెయిన్ 9 6 4 19 హాంకాంగ్ 6 12 24 42 మలేసియా 5 14 14 33 సింగపూర్ 5 6 13 24 మంగోలియా 5 4 12 21 ఇండోనేసియా 4 5 11 20 కువైట్ 3 5 4 12 సౌదీ అరేబియా 3 3 1 7 మియన్మార్ 2 1 1 4 వియత్నాం 1 10 25 36 ఫిలిప్పీన్స్ 1 3 11 15 పాకిస్థాన్ 1 1 3 5 తజికిస్థాన్ 1 1 3 5 ఇరాక్ 1 0 3 4 యూఏఈ 1 0 3 4 శ్రీలంక 1 0 1 2 కంబోడియా 1 0 0 1 జకార్తా, ఆసియా క్రీడల, కించిత్, Jakarta, the Asian Games, kinchit -
కబడ్డీలో ఖుషీ...ఖుషీ
ఊహించినట్లుగానే కబడ్డీ కూతలో కనకం మోత మోగింది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ చెలరేగిపోయింది. ప్రత్యర్థులను పాతర వేస్తూ రెండు స్వర్ణాలను గెలిచి ఔరా అనిపించింది. ఇంచియాన్: కబడ్డీలో తమ తడాఖా ఎలా ఉంటుందో భారత క్రీడాకారులు మైదానంలో చూపెట్టారు. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించారు. ఫలితంగా ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణాలను నిలబెట్టుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 27-25తో ఇరాన్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఏడోసారి పసిడిని సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 31-21తో ఇరాన్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఫైనల్ ఆరంభంలో ఇరాన్ ఆటగాళ్ల బలమైన రైడింగ్, అద్భుతమైన డిఫెండింగ్‌కు భారత్ కాస్త తడబడింది. దీంతో ఓ లోనాను సమర్పించుకోవడంతో ఇరాన్ 17-7 ఆధిక్యంలో నిలిచింది. భారత ప్లేయర్ జస్వీర్ సింగ్ అనాలోచిత ఆటతీరు తో మూల్యం చెల్లించుకున్నాడు. కీలక సమయంలో మూడుసార్లు రైడింగ్‌కు వెళ్లి అవుటై వచ్చాడు. ఈ దశలో అనూప్ కుమార్ రైడింగ్‌లో మూడు పాయింట్లు తేవడంతో ఆధిక్యం 11-18కి తగ్గింది. ఒకటి, రెండు పాయింట్లతో నెట్టుకొచ్చిన భారత్ తొలి అర్ధభాగానికి 13-21తో వెనుకబడింది. రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రవికుమార్ వీరోచిత ఆటతో వరుస పాయింట్లతో పాటు ‘లోనా’ కూడా లభించింది. దీంతో భారత్ 21-21తో స్కోరును సమం చేసింది. అయితే ఇరానియన్లు కాస్త సంయమనంతో కదలి 24-21తో ముందంజ వేసినా భారత్ సకాలంలో తేరుకుని 24-24తో సమం చేసింది. ఆట మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా అనూప్ అద్భుతమైన రైడింగ్‌కు పాయింట్ రావడం, తర్వాత రైడింగ్‌కు వచ్చిన మెరాజ్ షెకీని సూపర్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో భారత్ 26-24 ఆధిక్యంలో వెళ్లింది. చివరి రైడింగ్‌లో అనూప్ విఫలమైనా... మెరాజ్‌ను మరోసారి క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో భారత్ 27-25తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళలదీ అదే జోరు మహిళల విభాగంలో కూడా భారత్ రెండో అర్ధభాగంలోనే సత్తా చాటింది. ఆరంభంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్ ఆ తర్వాత ఏకపక్షంగా మారిపోయింది. మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు దొరకకుండా పాయింట్లు నెగ్గిన భారత్... రెండు లోనాలు కూడా నమోదు చేసింది. దీంతో తొలి అర్ధభాగానికి 15-11 ఆధిక్యంలో నిలిచింది. అభిలాష మహాత్రే అటాకింగ్ రైడింగ్‌కు రెండో అర్ధభాగంలో చకచకా పాయింట్లు వచ్చాయి. ఏడో నిమిషంలో మరో లోనా లభించడంతో 25-16తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ఇరాన్ మహిళలు పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తైక్వాండో: ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. 73 కేజీల క్వార్టర్ఫైనల్లో అల్ఫాద్ అబ్రార్‌తో జరిగిన బౌట్లో షాలో రైక్వార్ 3-3తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్లో చూపిన ఆధిపత్యానికి అబ్రార్‌ను విజేతగా ప్రకటించారు. మరో బౌట్లో మార్గరెట్ మారియా 1-15తో లీ డాంగుహా (చైనా) చేతిలో ఓడింది. వాలీబాల్: భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3-2తో ఖతార్‌పై నెగ్గింది. అథ్లెటిక్స్: హ్యామర్ త్రోలో కాంస్యం సాధించిన మంజూ బాలా రజత పతకానికి ప్రమోట్ అయ్యింది. రజతం సాధించిన వాంగ్ జెంగ్ (చైనా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకుని మంజుకు ఇచ్చారు. -
వుషులో రెండు పతకాలు ఖాయం
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. వుషు క్రీడాంశంలో మహిళల సాండా 52 కేజీల క్వార్టర్ ఫైనల్లో సనతోయి దేవి అద్భుత ప్రదర్శన చేసింది. మంగోలియాకు చెందిన అమ్‌గలన్ జర్గల్‌ను 2-0తో ‘విన్ బై రౌండ్’ పద్దతిన నెగ్గి సెమీస్‌కు చేరింది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా కాంస్య పతకం దక్కుతుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఈ మణిపూర్ క్రీడాకారిణి జాంగ్ లుయాన్ (చైనా)ను ఎదుర్కోనుంది. మరోవైపు పురుషుల సాండా 60 కేజీల విభాగంలో నరేందర్ గరేవాల్ కూడా సెమీస్‌కు చేరి మరో పతకాన్ని సిద్ధం చేశాడు. క్వార్టర్స్‌లో తను 2-0తో అబ్దుల్లా (పాక్)పై నెగ్గాడు. కానీ పురుషుల 75 కేజీల క్వార్టర్స్‌లో రజనీ డియోరి 0-2తో వాన్ సీ (వియత్నాం) చేతిలో ఓడాడు. ఆసియా గేమ్స్ చరిత్రలో వుషు విభాగంలో ఇప్పటిదాకా భారత్ మూడు పతకాలు సాధించింది. ఇందులో ఒక రజతం, రెండు కాంస్యాలున్నాయి. టెన్నిస్: పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు పరాజయాలు ఎదురయ్యాయి. కజకిస్థాన్‌తో జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్ 1-2 తేడాతో ఓడింది. మహిళల టీమ్ ఈవెంట్లోనూ కజకిస్థాన్ చేతిలో 1-2తో ఓడి వెనుదిరిగింది. జూడో: మహిళల +78 కేజీల క్వార్టర్ ఫైనల్లో రజ్వీందర్ కౌర్ 0-2తో జాజ్మా ఒడ్కు (మంగోలియా) చేతిలో ఓడింది. ఆ తర్వాత రెపిచేజ్‌లోనూ నగీరా సర్బషోవాపై 0-3తో ఓడి పతకం ఆశలను వమ్ము చేసుకుంది. హాకీ: మహిళల హాకీ పూల్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో భారత జట్టు 3-0తో థాయ్‌లాండ్‌పై నెగ్గింది. 15వ నిమిషంలో పూనమ్ రాణి తొలి గోల్ చేయగా, 39వ నిమిషంలో వందన కఠారియా రెండో గోల్‌తో ఆధిక్యాన్ని అందించింది. ద్వితీయార ్ధం 53వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించింది. బాస్కెట్‌బాల్: పురుషుల క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత బాస్కెట్‌బాల్ జట్టు 80-61 తేడాతో కజకిస్థాన్‌పై నెగ్గింది. వాలీబాల్: మహిళల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 0-3తో జపాన్ చేతిలో ఓడింది. స్విమ్మింగ్: పురుషుల 50మీ. బ్యాక్‌స్ట్రోక్ హీట్‌లో భారత స్విమ్మర్ మధు నాయర్ 26.85 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచాడు. హ్యాండ్‌బాల్: పురుషుల ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘డి’లో భారత జట్టు 12-47తో జపాన్ చేతిలో; మహిళల జట్టు 12-39తో చైనా చేతిలో ఓడాయి. జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్: మహిళల వ్యక్తిగత అర్హత అండ్ టీమ్ ఫైనల్లో భారత్ చివరి (8) స్థానంలో నిలిచింది. ఫుట్‌బాల్: పురుషుల తొలి రౌండ్లో భారత్ 0-2తో జోర్డాన్ చేతిలో మట్టికరిచింది. సైక్లింగ్ ట్రాక్: పురుషుల స్ప్రింట్ ప్రి క్వార్టర్స్‌లో రెపిచేజ్‌లో అమర్జిత్ సింగ్ నేగి రెండో స్థానంలో, హీట్ 2లో అమ్రిత్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు. -
భారత అథ్లెట్లకు ప్రధాని శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెట్లు దేశం గర్వపడేలా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో తన సందేశాన్ని ట్వీట్ చేశారు. 2018లో ఇండోనేసియా ఆతిథ్యం 2018లో జరగబోయే ఆసియా గేమ్స్‌కు ఇండోనేసియాలోని జకర్తా ఆతిథ్యమివ్వనుంది. శుక్రవారం సమావేశమైన ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు దీనికి ఆమోద ముద్ర వేసింది. -
భారత్ అంతంత మాత్రమే
ఆసియా క్రీడల వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఒకటి.. అయితే ఈ క్రీడల్లో భారత్ ఒక్కసారి కూడా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవలేకపోయింది. 1951, 1982 ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన భారత్... ఈ రెండుసార్లు పోటీల్లో ఆధిపత్యాన్ని చాటలేకపోయింది. 1951లో రెండో స్థానంలో... 1982లో ఐదో స్థానంలో నిలిచింది. 1962లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే 1990 నుంచి ఆసియా క్రీడల్లో ప్రదర్శన అంతంత మాత్రంగానే సాగుతోంది. చైనా నిర్వహించిన ఈ క్రీడల్లో భారత్ ఎన్నడూ లేని విధంగా 11వ స్థానంలో నిలిచింది. ఆతర్వాత భారత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇక 2006 దోహా ఏషియాడ్‌లో, 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 50కి పైగా పతకాలు సాధించినా టాప్-5లో స్థానం మాత్రం సంపాదించలేకపోయింది. మొత్తానికి ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటిదాకా 128 స్వర్ణాలు, 168 రజతాలు, 249 కాంస్యాలను కలుపుకుని ఓవరాల్‌గా 545 పతకాలు సాధించింది. సరాసరిన ఆసియా క్రీడల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ సారైనా మెరుగవుతుందా? ఇప్పటిదాకా 16 సార్లు ఆసియా క్రీడలు జరగ్గా అన్నిసార్లు భారత్ పోటీల్లో పాల్గొంది. అయితే భారత్ ఒక్కసారి కూడా అగ్రస్థానంలో మాత్రం నిలవలేకపోయింది. గ్వాంగ్జౌ ఏషియాడ్ ముగిసి నాలుగేళ్లయ్యాయి. మళ్లీ ఆసియా క్రీడలు మొదల య్యాయి. ఈ సారి అదే ప్రశ్న... దక్షిణ కొరియాలోని ఇంచియాన్లోనైనా భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుందా? అంటే కలలో కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం తొలి ఐదు స్థానాల్లోనైనా నిలుస్తుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే భారత్‌కు తప్పనిసరిగా పతకాలు దక్కుతాయని ఆశిస్తున్న క్రీడాంశాల సంఖ్య మరింతగా పెరగకపోవడమే. పైగా ఈ సారి ఆసియా క్రీడల్లో భారత్ కచ్చితంగా పతకం గెలుస్తుందనుకుంటున్న ఈవెంట్ల నుంచి కొందరు స్టార్ ప్లేయర్లు పోటీల నుంచి తప్పుకోగా.. మరికొందరు గాయాల పాలయ్యారు. ఫలితంగా క్రీడల ఆరంభానికి ముందే భారత్ ఖాతా నుంచి పతకాలు చేజారిపోయాయి. 2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు. క్రికెట్లో చేజారిన పతకం ఆసియా క్రీడల్లో ఈసారీ భారత క్రికెట్ జట్లు పాల్గొనడం లేదు. 2010లో చైనా ఆతిథ్యమిచ్చిన ఆసియా క్రీడల్లో తొలిసారిగా క్రికెట్‌కు ప్రవేశం కల్పించారు. అయితే బీసీసీఐ అప్పుడు జట్టును పంపలేదు. కనీసం ఈసారి గేమ్స్‌లోనైనా భారత్ ప్రాతినిధ్యం ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ ఈ సారి కూడా ఏషియాడ్‌కు పురుషుల, మహిళల జట్లను పంపలేదు. దీంతో ఈ క్రీడాంశంలో భారత్‌కు పతకం దక్కే అవకాశం చేజారినట్లయింది. భారత్‌తో పాటు పాకిస్థాన్ పురుషుల జట్టు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. అయితే శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మాత్రం పురుషుల, మహిళల జట్లు ఏషియాడ్‌లో బరిలోకి దిగుతున్నాయి.