నిలకడే కీలకం
స్వర్ణం పురోగతికి సూచన: వాల్ష్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో 16 ఏళ్ల విరామం తర్వాత సాధించిన స్వర్ణ పతకం... భారత హాకీ భవిష్యత్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని జట్టు చీఫ్ కోచ్ టెర్రీ వాల్ష్ తెలిపారు. అయితే ఈ తరహా ప్రదర్శన పదేపదే చేయాలంటే జట్టులో నిలకడ అత్యంత ముఖ్యమని ఈ ఆస్ట్రేలియన్ మాజీ క్రీడాకారుడు అభిప్రాయపడ్డాడు. జట్టు పురోగతికి ఏషియాడ్ స్వర్ణం సూచిక అని ఈ సందర్భంగా వాల్ష్ తెలిపాడు. ‘ప్రస్తుతం పరిస్థితి సున్నితంగా, సమతూకంగా ఉంది.
ఏడాది క్రితంతో పోలిస్తే భారత జట్టు మెరుగైన స్థితిలో ఉందని ఏషియాడ్ ఫలితం నిరూపించింది. ఇక్కడి నుంచి మరింత ఎత్తుకు ఎదగాలంటే దూకుడుతో కూడిన వ్యూహాలు అమలు చేయాలి. అలాగైతేనే అనుకున్నస్థాయికి చేరుకుంటాం’ అని వాల్ష్ అన్నాడు. ప్రస్తుత జట్టు ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదువలేదని... అయితే వారెంత కాలం నిలకడగా ఆడతారో చెప్పడం కష్టమన్నారు. భారత జట్టు ఆటతీరులో పురోగతి ఉన్నా... అగ్రశ్రేణి జట్లయిన ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌తో పోటీపడే సత్తా ఇంకా పూర్తిస్థాయిలో రాలేదని ఆయన అన్నారు.