జకార్తాలో కలుద్దాం...
ఇంచియాన్: పక్షం రోజుల పాటు ఆసియా ఖండాన్ని ఉర్రూతలూగించిన క్రీడల పండుగ ముగిసింది. 17వ ఆసియా క్రీడలను అత్యంత విజయవంతంగా నిర్వహించామనే కించిత్ గర్వంతో... కళ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో... సంబరాలు అంబరాన్ని తాకేలా శనివారం జరిగిన ముగింపు వేడుకలకు ఇంచియాన్ ఏషియాడ్ స్టేడియం వేదికైంది. ప్రధానంగా కొరియా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ క్రీడాభిమానులకు పరిచయం చేసే విధంగా ఈ వేడుకలు సాగాయి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఫహాద్ అల్ సబా క్రీడల ముగింపును అధికారికంగా ప్రకటించారు. ‘మరో నాలుగేళ్ల అనంతరం ఆసియాకు చెందిన యువకులు జకార్తాలో కలవాలని పిలుపునిస్తున్నాను.
సోదరభావంతో మనమంతా ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ ఇంచియాన్.. థ్యాంక్యూ కొరియా... థ్యాంక్యూ ఆసియా’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత ఓసీఏ పతాకం కిందికి దిగుతుండగా 45 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల సమక్షంలో అధికారిక గీతం స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది. కార్యక్రమంలో తొలి భాగం కొరియా జాతీ య డ్యాన్స్ కంపెనీ ‘రెయిన్‌బో కొయిర్’ సభ్యుల ప్రదర్శనతో పాటు జాతీయ గూగక్ సెంటర్ డ్యాన్స్ ట్రూప్ వారి నృత్యాలతో ప్రేక్షకులు మైమరిచిపోయారు.
ఆసియా స్నేహితుల మధ్య శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని వివిధ దేశాలకు చెందిన 30 మంది చిన్నారులతో కలిసి రెయిన్‌బో కొయిర్ గ్రూప్ పాడిన గీతం ఆకట్టుకుంది.
అలాగే కొరియా సంప్రదాయక మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో ఫైటర్స్ విన్యాసాలు అబ్బురపరిచాయి.
స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్‌పై తాజా గేమ్స్‌లోని అథ్లెట్ల విజయాలు, పరాజయాలు, భావోద్వేగాలను ప్రేక్షకులకు మరోసారి ప్రదర్శించారు. తొలి ఆసియా గేమ్స్‌కు చెందిన పతాకం, టార్చితోపాటు ఓసీఏ పతాకాన్ని 2018 క్రీడల వేదిక జకార్తా (ఇండోనేసియా) ప్రతినిధులకు అందజేశారు. జకార్తాకు చెందిన కళాకారుల నృత్యం, సంగీత ప్రదర్శన కూడా కొద్దిసేపు సాగింది. చివర్లో ఇంచియాన్ గేమ్స్ జ్యోతిని ఆర్పివేయడంతో క్రీడలు ముగిసిన ట్టయ్యింది.
పతకాల పట్టిక (స్వర్ణాల ఆధారంగా ర్యాంక్‌ను నిర్ణయించారు)
దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం
చైనా 151 108 83 342
దక్షిణ కొరియా 79 71 84 234
జపాన్ 47 76 77 200
కజకిస్థాన్ 28 23 33 84
ఇరాన్ 21 18 18 57
థాయ్‌లాండ్ 12 7 28 47
ఉత్తర కొరియా 11 11 14 36
భారత్ 11 10 36 57
చైనీస్ తైపీ 10 18 23 51
ఖతార్ 10 0 4 14
ఉజ్బెకిస్థాన్ 9 14 21 44
బహ్రెయిన్ 9 6 4 19
హాంకాంగ్ 6 12 24 42
మలేసియా 5 14 14 33
సింగపూర్ 5 6 13 24
మంగోలియా 5 4 12 21
ఇండోనేసియా 4 5 11 20
కువైట్ 3 5 4 12
సౌదీ అరేబియా 3 3 1 7
మియన్మార్ 2 1 1 4
వియత్నాం 1 10 25 36
ఫిలిప్పీన్స్ 1 3 11 15
పాకిస్థాన్ 1 1 3 5
తజికిస్థాన్ 1 1 3 5
ఇరాక్ 1 0 3 4
యూఏఈ 1 0 3 4
శ్రీలంక 1 0 1 2
కంబోడియా 1 0 0 1
జకార్తా, ఆసియా క్రీడల, కించిత్, Jakarta, the Asian Games, kinchit