కబడ్డీలో ఖుషీ...ఖుషీ | India won 2 gold medals in kabaddi... | Sakshi
Sakshi News home page

కబడ్డీలో ఖుషీ...ఖుషీ

Published Sun, Oct 5 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

కబడ్డీలో ఖుషీ...ఖుషీ

కబడ్డీలో ఖుషీ...ఖుషీ

ఊహించినట్లుగానే కబడ్డీ కూతలో కనకం మోత మోగింది. పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ చెలరేగిపోయింది. ప్రత్యర్థులను పాతర వేస్తూ రెండు స్వర్ణాలను గెలిచి ఔరా అనిపించింది.

 ఇంచియాన్: కబడ్డీలో తమ తడాఖా ఎలా ఉంటుందో భారత క్రీడాకారులు మైదానంలో చూపెట్టారు. ప్రత్యర్థుల నుంచి గట్టి సవాలు ఎదురైనా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించారు. ఫలితంగా ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణాలను నిలబెట్టుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల ఫైనల్లో భారత్ 27-25తో ఇరాన్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఏడోసారి పసిడిని సొంతం చేసుకుంది. మహిళల ఫైనల్లో భారత్ 31-21తో ఇరాన్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

     పురుషుల ఫైనల్ ఆరంభంలో ఇరాన్ ఆటగాళ్ల బలమైన రైడింగ్, అద్భుతమైన డిఫెండింగ్‌కు భారత్ కాస్త తడబడింది. దీంతో ఓ లోనాను సమర్పించుకోవడంతో ఇరాన్ 17-7 ఆధిక్యంలో నిలిచింది.
     భారత ప్లేయర్ జస్వీర్ సింగ్ అనాలోచిత ఆటతీరు తో మూల్యం చెల్లించుకున్నాడు. కీలక సమయంలో మూడుసార్లు రైడింగ్‌కు వెళ్లి అవుటై వచ్చాడు.
     ఈ దశలో అనూప్ కుమార్ రైడింగ్‌లో మూడు పాయింట్లు తేవడంతో ఆధిక్యం 11-18కి తగ్గింది. ఒకటి, రెండు పాయింట్లతో నెట్టుకొచ్చిన భారత్ తొలి అర్ధభాగానికి 13-21తో వెనుకబడింది.
     రెండో అర్ధభాగంలో వ్యూహం మార్చిన భారత్ ఎదురుదాడికి దిగింది. కెప్టెన్ రవికుమార్ వీరోచిత ఆటతో వరుస పాయింట్లతో పాటు ‘లోనా’ కూడా లభించింది. దీంతో భారత్ 21-21తో స్కోరును సమం చేసింది.
     అయితే ఇరానియన్లు కాస్త సంయమనంతో కదలి 24-21తో ముందంజ వేసినా భారత్ సకాలంలో తేరుకుని 24-24తో సమం చేసింది.
     ఆట మరో ఏడు నిమిషాల్లో ముగుస్తుందనగా అనూప్ అద్భుతమైన రైడింగ్‌కు పాయింట్ రావడం, తర్వాత రైడింగ్‌కు వచ్చిన మెరాజ్ షెకీని సూపర్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో భారత్ 26-24 ఆధిక్యంలో వెళ్లింది. చివరి రైడింగ్‌లో అనూప్ విఫలమైనా... మెరాజ్‌ను మరోసారి క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో భారత్ 27-25తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
 మహిళలదీ అదే జోరు
 మహిళల విభాగంలో కూడా భారత్ రెండో అర్ధభాగంలోనే సత్తా చాటింది. ఆరంభంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్ ఆ తర్వాత ఏకపక్షంగా మారిపోయింది. మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు దొరకకుండా పాయింట్లు నెగ్గిన భారత్... రెండు లోనాలు కూడా నమోదు చేసింది. దీంతో తొలి అర్ధభాగానికి 15-11 ఆధిక్యంలో నిలిచింది.
     అభిలాష మహాత్రే అటాకింగ్ రైడింగ్‌కు రెండో అర్ధభాగంలో చకచకా పాయింట్లు వచ్చాయి. ఏడో నిమిషంలో మరో లోనా లభించడంతో 25-16తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ఇరాన్ మహిళలు పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 తైక్వాండో: ఈ విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. 73 కేజీల క్వార్టర్‌ఫైనల్లో అల్ఫాద్ అబ్రార్‌తో జరిగిన బౌట్‌లో షాలో రైక్వార్ 3-3తో స్కోరును సమం చేసింది. అయితే బౌట్‌లో చూపిన ఆధిపత్యానికి అబ్రార్‌ను విజేతగా ప్రకటించారు. మరో బౌట్‌లో మార్గరెట్ మారియా 1-15తో లీ డాంగుహా (చైనా) చేతిలో ఓడింది.
 వాలీబాల్: భారత్ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 3-2తో ఖతార్‌పై నెగ్గింది.
 అథ్లెటిక్స్: హ్యామర్ త్రోలో కాంస్యం సాధించిన మంజూ బాలా రజత పతకానికి ప్రమోట్ అయ్యింది. రజతం సాధించిన వాంగ్ జెంగ్ (చైనా) డోపింగ్‌లో పట్టుబడటంతో ఆమె పతకాన్ని వెనక్కి తీసుకుని మంజుకు ఇచ్చారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement