భారత్ అంతంత మాత్రమే
ఆసియా క్రీడల వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఒకటి.. అయితే ఈ క్రీడల్లో భారత్ ఒక్కసారి కూడా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలవలేకపోయింది. 1951, 1982 ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన భారత్... ఈ రెండుసార్లు పోటీల్లో ఆధిపత్యాన్ని చాటలేకపోయింది. 1951లో రెండో స్థానంలో... 1982లో ఐదో స్థానంలో నిలిచింది.
1962లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అయితే 1990 నుంచి ఆసియా క్రీడల్లో ప్రదర్శన అంతంత మాత్రంగానే సాగుతోంది. చైనా నిర్వహించిన ఈ క్రీడల్లో భారత్ ఎన్నడూ లేని విధంగా 11వ స్థానంలో నిలిచింది. ఆతర్వాత భారత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇక 2006 దోహా ఏషియాడ్‌లో, 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 50కి పైగా పతకాలు సాధించినా టాప్-5లో స్థానం మాత్రం సంపాదించలేకపోయింది. మొత్తానికి ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటిదాకా 128 స్వర్ణాలు, 168 రజతాలు, 249 కాంస్యాలను కలుపుకుని ఓవరాల్‌గా 545 పతకాలు సాధించింది. సరాసరిన ఆసియా క్రీడల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది.
ఈ సారైనా మెరుగవుతుందా?
ఇప్పటిదాకా 16 సార్లు ఆసియా క్రీడలు జరగ్గా అన్నిసార్లు భారత్ పోటీల్లో పాల్గొంది. అయితే భారత్ ఒక్కసారి కూడా అగ్రస్థానంలో మాత్రం నిలవలేకపోయింది. గ్వాంగ్జౌ ఏషియాడ్ ముగిసి నాలుగేళ్లయ్యాయి. మళ్లీ ఆసియా క్రీడలు మొదల య్యాయి. ఈ సారి అదే ప్రశ్న... దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లోనైనా భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుందా? అంటే కలలో కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం తొలి ఐదు స్థానాల్లోనైనా నిలుస్తుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి.
ఎందుకంటే భారత్‌కు తప్పనిసరిగా పతకాలు దక్కుతాయని ఆశిస్తున్న క్రీడాంశాల సంఖ్య మరింతగా పెరగకపోవడమే. పైగా ఈ సారి ఆసియా క్రీడల్లో భారత్ కచ్చితంగా పతకం గెలుస్తుందనుకుంటున్న ఈవెంట్‌ల నుంచి కొందరు స్టార్ ప్లేయర్లు పోటీల నుంచి తప్పుకోగా.. మరికొందరు గాయాల పాలయ్యారు. ఫలితంగా క్రీడల ఆరంభానికి ముందే భారత్ ఖాతా నుంచి పతకాలు చేజారిపోయాయి. 2010లో భారత్ 35 క్రీడాంశాల్లో పోటీపడగా.. ఈసారి ఆసంఖ్య 28కి పడిపోయింది. ఇక ఇంచియాన్‌లో పలు క్రీడాంశాల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యమే లేదు. మొత్తం 516 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో బరిలో ఉన్నారు.
క్రికెట్‌లో చేజారిన పతకం
ఆసియా క్రీడల్లో ఈసారీ భారత క్రికెట్ జట్లు పాల్గొనడం లేదు. 2010లో చైనా ఆతిథ్యమిచ్చిన ఆసియా క్రీడల్లో తొలిసారిగా క్రికెట్‌కు ప్రవేశం కల్పించారు. అయితే బీసీసీఐ అప్పుడు జట్టును పంపలేదు. కనీసం ఈసారి గేమ్స్‌లోనైనా భారత్ ప్రాతినిధ్యం ఉంటుందని క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ బీసీసీఐ ఈ సారి కూడా ఏషియాడ్‌కు పురుషుల, మహిళల జట్లను పంపలేదు. దీంతో ఈ క్రీడాంశంలో భారత్‌కు పతకం దక్కే అవకాశం చేజారినట్లయింది. భారత్‌తో పాటు పాకిస్థాన్ పురుషుల జట్టు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. అయితే శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మాత్రం పురుషుల, మహిళల జట్లు ఏషియాడ్‌లో బరిలోకి దిగుతున్నాయి.