అబుదాబి:శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పాకిస్తాన్ స్పిన్నర్ యాసిర్ షా విజృంభించాడు. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు సాధించి సత్తా చాటుకున్నాడు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా పాకిస్తాన్ కు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. 69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. నిన్నటి ఆటలో రెండు వికెట్లు తీసిన యాసిర్.. ఈ రోజు ఆటలో మూడు వికెట్లు సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో యాసిర్ ఎనిమిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో యాసిర్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 422 ఆలౌట్