సిడ్నీ: పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడమంటే ప్రత్యర్థి బౌలర్లకు కత్తిమీద సామే. కోహ్లిని ఔట్ చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సన్నద్ధమవుతున్నా అతను మాత్రం పరుగుల దాహంతో చెలరేగిపోతున్నాడు. అయితే అయితే, కోహ్లిని ఎలా కట్టడి చేయాలనే దానిపై ఆస్ట్రేలియా లెగ్‌స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ బౌలర్లకు విలువైన సలహాలు ఇచ్చాడు.
‘వికెట్‌కు ఇరువైపులా షాట్లు ఆడడంలో కోహ్లి దిట్ట. అతడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు లెగ్ స్టంప్‌ను టార్గెట్ చేస్తే ఆన్‌సైడ్ ఫీల్డింగ్ మోహరించాలి. ఒకవేళ ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతులేస్తే ఆఫ్‌సైడ్ ఫీల్డింగ్ పెట్టాలి. అంతేకాని నేరుగా స్టంప్స్‌కు గురిపెట్టొద్దు’ అని వార్న్ సూచించాడు. కోహ్లిని కట్టడి చేయాలంటే.. తానైతే ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతులేస్తూ స్లిప్స్, షార్ట్ కవర్‌లో ఫీల్డర్లను మోహరించి షాట్లు ఆడకుండా అడ్డుకునే వ్యూహాన్ని రచిస్తానని వార్న్ చెప్పాడు. ‘ఆఫ్ స్టంప్‌కు బంతులేసినప‍్పుడు స్లిప్, షార్ట్ కవర్స్ మీదుగా కవర్ డ్రైవ్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. షాట్ మిస్సయితే ఎక్కడో అక్కడ దొరికిపోతాడు. ఒకవేళ వికెట్ టు వికెట్ బంతిని విసిరితే మాత్రం కోహ్లి రెండు వైపులా ఆడగలడు. రెండు వైపులా కాకుండా ఏదైనా ఒకవైపు ఫీల్డింగ్ సరిచేస్తే సరిపోతుంది. మంచి ఆటగాళ్లకు ఇలాగే బంతులేయాలి’అని క్రిక్ ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో వార్న్ అన్నాడు. కాగా, వన్డే ఫార్మాట్‌లో కోహ్లి తరహా ఆటగాడ‍్ని ఇంతవరకూ చూడలేదని వార్న్ అన్నాడు. తన దృష్టిలో సచిన్, లారాల కంటే కోహ్లినే అత్యుత్తమ ఆటగాడన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment