యూనిస్ @ 10,000
►పది వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్‌మన్
►ఈ ఘనత సాధించిన తొలి పాక్ క్రికెటర్
కింగ్‌స్టన్: పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులు సాధించిన 13వ క్రికెటర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఆటగాడు యూనిస్ కావడం విశేషం. వెస్టిండీస్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు శనివారం ఛేజ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో అతని పేరు రికార్డు పుస్తకాల్లో నమోదైంది. 116వ టెస్టు ఆడుతున్న యూనిస్, 208వ ఇన్నింగ్స్‌లో పది వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
ఈ ఘనత అందుకునే సమయానికి మిగతా 12 మంది కంటే యూనిస్‌దే ఎక్కువ వయసు (39 ఏళ్ల 145 రోజులు) కావడం మరో విశేషం. విండీస్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద అవుటయ్యే సమయానికి యూనిస్ 53.09 సగటుతో 10,035 పరుగులు సాధించాడు. అతని కెరీర్‌లో 34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 11 దేశాల్లోనూ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కూడా యూనిస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ఇప్పటికే ప్రకటించాడు.
పాకిస్తాన్‌కు ఆధిక్యం...: తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌పై పాక్‌కు ఆధిక్యం లభించింది. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం కడపటి వార్తలందే సమయానికి పాక్ 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.