'నాపై మా క్రికెట్ బోర్డుకు నమ్మకం లేదు'
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తనపై నమ్మకం లేకపోవడం వల్లే అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు చెప్పినట్లు ఆ దేశ సీనియర్ క్రికెటర్ యూనిస్ ఖాన్ తాజాగా స్పష్టం చేశాడు. తనది ఎంతమాత్రం ఆకస్మిక నిర్ణయం కాదంటూ తొలిసారి పెదవి విప్పిన యూనస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్లో ఓటమికి తనను పరోక్షంగా బాధ్యుణ్ని చేశారని యూనిస్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను వన్డేల నుంచి ఆకస్మికంగా తప్పుకోవడం వల్లే జట్టు ఆ సిరీస్ లో ఓటమి పాలైందని కోచ్ వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడానికి నిరాకరించిన యూనిస్ ఖాన్ దానికి తగిన సమయం వచ్చినప్పుడు అతనినే అడుగుతానన్నాడు. 'ఇది చాలా దురదృష్టం. ఇంగ్లండ్ తో సిరీస్ కు నన్ను బలి పశువును చేస్తున్నారు. నేను ఇంకా చాలా కాలం ఆడదామనుకున్నా. నాపై జట్టుక నమ్మకం లేదు. అది కోచ్ వకార్ యూనస్ కావొచ్చు. వేరే ఎవరైనా కావొచ్చు దానివల్లే బయటకి వచ్చా' అని యూసఫ్ తెలిపాడు.
తాను ఎప్పుడో వన్డేల నుంచి తప్పుకుందామనుకున్నానని, అయితే వరల్డ్ కప్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కలేని కారణంగానే ఇంతకాలం నిరీక్షించాల్సి వచ్చిందన్నాడు. తనది ఆకస్మిక నిర్ణయం ఎంతమాత్రం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కాగా, టెస్టులకు గుడ్ బై చెప్పే సమయం వచ్చినప్పుడు ఆ ఫార్మెట్ నుంచి కూడా వైదొలుగుతానని అన్నాడు. అది ఎప్పుడనేది తన స్వీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టెస్టుల్లో 9 వేల పరుగులు చేసి పాక్ తొలి ఆటగాడిగా నిలిచిన యూనిస్ పేర్కొన్నాడు. గతేడాది నవంబర్లో ఇంగ్లండ్ తో తొలి వన్డే అనంతరం యూనిస్ ఖాన్ వన్డేల నుంచి వీడ్కోలు తీసుకున్న సంగతి తెలిసిందే.