యూనిస్ ఖాన్పై పీసీబీ చర్యలు!
కరాచీ: పాకిస్తాన్ లోని స్వదేశీ వన్డే టోర్నమెంట్లో అంపైర్లతో పాటు మ్యాచ్ రిఫరీతో ఘర్ణణ పడ్డ ఆ దేశ క్రికెటర్ యూనిస్ ఖాన్ పై చర్యలకు రంగం సిద్ధమైంది. జాతీయ వన్డే టోర్నమెంట్లో భాగంగా ఖైబర్ పాఖ్ తున్ ఖావా(కేపీకే) జట్టుకు సారథ్య పగ్గాలు చేపట్టిన యూనస్ ఖాన్.. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయం పట్ల అంసతృప్తి వ్యక్తం చేసి ఆ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు పీసీబీ సన్నద్ధమైంది.
ఈ తాజా వ్యవహారంతో టెస్టుల్లో పాకిస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన యూనిస్ ఖాన్పై మూడు నుంచి ఐదు మ్యాచ్లు వరకూ నిషేధం పడే అవకాశం ఉందని పీసీబీ వర్గాల సమాచారం. ఈ మేరకు యూనిస్ ఖాన్ తో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఫోన్లో మాట్లాడలనుకున్నా అది సాధ్యపడలేదు. శనివారం రాత్రి ఫైసలాబాద్ నుంచి కరాచీ చేరుకున్న యూనిస్ ఖాన్ తన ఫోన్ ను స్విచ్ఛాఫ్ లో ఉండటం కూడా షహర్యార్ ఖాన్ ను మరింత ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ విషయం..
పాకిస్తాన్ జాతీయ వన్డే టోర్నమెంట్ లో భాగంగా ఎఫ్ఐఏ కెప్టెన్ మిస్బాబుల్ హక్ అవుట్ నిర్ణయంపై కేపీకే జట్టు సభ్యులు అప్లై చేశారు. అయితే దాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీనిపై అంపైర్లతో వాదనకు దిగిన యూనిస్ ఖాన్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఈ అంశంపై జోక్యం చేసుకున్న మ్యాచ్ రిఫీరీని కూడా యూనస్ నిలదీశాడు. ఆ అవుట్ ఎందుకు ఇవ్వాలేదో తనకు చెప్పాలని ప్రశ్నించాడు. అంతటి ఆగకుండా ఆ మ్యాచ్లో తమ జట్టు ఓటమికి అంపైర్లే కారణమని బహిరంగంగా విమర్శించాడు. దీంతోపాటు ఆ టోర్నీ నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించాడు.