యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర
సిడ్నీ:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన యూనిస్ ఖాన్.. పదకొండు దేశాల్లో శతకాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో టెస్టు హోదా లేని యూఏఈలో కూడా యూనిస్ ఖాన్ సెంచరీ చేయడంతో ఆ ఘనతను సాధించాడు. అంతకుముందు 10 టెస్టు హోదా కల్గిన దేశాల్లో రాహుల్ ద్రవిడ్ మాత్రమే సెంచరీలు సాధించాడు.
గురువారం మూడో రోజు ఆటలో భాగంగా 64 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన యూనిస్.. టీ బ్రేక్ తరువాత శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపై వెయ్యి టెస్టు పరుగులను యూనిస్ పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐదో పాకిస్తానీ ఆటగాడిగా, 81వ ఓవరాల్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 538/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 244 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. యూనిస్ ఖాన్ సెంచరీకి తోడు, అజర్ అలీ(71) హాఫ్ సెంచరీ చేశాడు.