యూనిస్‌ఖాన్ సెంచరీ
పాకిస్తాన్ 271/8
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో పాకిస్తాన్ ఫాలో ఆన్ తప్పించుకునేందుకు పోరాడుతోంది. వర్షం కారణంగా దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో మ్యాచ్ మూడో రోజు గురువారం 53 ఓవర్లే సాధ్యమయ్యాయి. ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. యూనిస్ ఖాన్ (279 బంతుల్లో 136 బ్యాటింగ్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 126/2తో ఆట ప్రారంభించిన పాక్ ఆరంభంలోనే అజహర్ అలీ (71) వికెట్ కోల్పోయింది. అజహర్, యూనిస్ మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత యూనిస్ ఒంటరి పోరాటం చేయగా, అతనికి మరో ఎండ్‌నుంచి ఏమాత్రం సహకారం లభించలేదు. ఇతర బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. ప్రస్తుతం పాక్ 267 పరుగులు వెనుకబడి ఉండగా, క్రీజ్‌లో యూనిస్‌తో పాటు యాసిర్ షా (5) ఉన్నాడు. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఆ జట్టు మరో 68 పరుగులు చేయాలి. మరో వైపు షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ సర్ఫరాజ్ కొట్టిన షాట్ బలంగా తలకు తగలడంతో ఆసీస్ ఆటగాడు మాట్ రెన్‌షా తలనొప్పితో మైదానం వీడాడు. ఈ టెస్టులో అతని తలకు దెబ్బ తగలడం ఇది రెండో సారి.
1 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చిన 11 దేశాల్లోనూ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా యూనిస్ ఖాన్ రికార్డు సృష్టించాడు. 10 టెస్టు దేశాలతో పాటు యూఏఈలో కూడా అతను సెంచరీ సాధించాడు. 10 దేశాల్లో శతకం చేసిన రాహుల్ ద్రవిడ్ యూఏఈలో ఎప్పుడూ టెస్టు ఆడలేదు.
6 అత్యధిక టెస్టు సెంచరీల జాబితాలో యూనిస్ ఖాన్ (34), గవాస్కర్, లారా, జయవర్ధనేలతో సమంగా నిలిచాడు. మరో ఐదుగురు మాత్రమే ఇంతకంటే ఎక్కువ శతకాలు సాధించారు.