ఎయిర్‌పోర్టులో యువీ జంట ఏం చేసిందంటే..
టీమిండియా ఆల్ రౌండర్, కొత్త పెళ్లికొడుకు యువరాజ్ సింగ్ మాంచి జోష్ మీదున్నాడు. బాలీవుడ్ నటి హజల్ కీచ్‌ను సిక్కు, హిందు సంప్రదాయం ప్రకారం రెండుసార్లు వివాహం చేసుకున్న యువరాజ్ డాన్స్‌లతో అదరగొడుతున్నాడు. అవకాశం, సందర్భం రావడం ఆలస్యమన్నట్టు చెలరేగిపోతున్నాడు.
శుక్రవారం గోవాలో యువీ, హజల్లు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు పాల్గొన్నారు. కాగా పెళ్లికి ముందు గోవా ఎయిర్‌పోర్టులో యువీ, హజల్లు డాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఈ జోడీ పోటీపడి భాంగ్రా డాన్స్ చేశారు. గోవాలో జరిగిన పెళ్లికి సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు.
గత బుధవారం చండీగఢ్ సమీపంలో యువీ, హజల్ సిక్కుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం హజల్ కీచ్ తన పేరును గుర్బసంత్ కౌర్‌గా మార్చుకుంది. ఈ వేడుకల్లో నూతన వధూవరులు డాన్స్‌లతో అతిథులను కనువిందు చేశారు. వీరితో కలసి విరాట్ కోహ్లీ కూడా చిందేశాడు. ఈ నెల 7న ఢిల్లీలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది.