యువరాజ్ సింగ్ వచ్చేశాడు: రాయుడికీ బెర్తు
డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. టీమిండియాలో మళ్లీ పునరాగమనం చేయనున్నాడు. వచ్చే నెల 10 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు యువరాజ్కు బెర్తు దొరికింది. సోమవారం ఇక్కడ సమావేశమైన భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్లో ఇరు జట్లు మొత్తం ఏడు వన్డేలు ఆడనున్నాయి. కాగా ఆసీస్తో ఏకైక టి-20, మూడు వన్డేలకు ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. తెలుగుతేజం అంబటి రాయుడికి కూడా జట్టులో స్థానం లభించింది.
యువీ చివరి సారిగా గత జనవరిలో టీమిండియా తరపున ఆడాడు. ఆనక ఫామ్లేమి కారణంగా చోటు కోల్పోయాడు. వెస్టిండీస్-ఎతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్ అతనికి బాగా కలిసొచ్చింది. కీలక ఇన్నింగ్స్లు ఆడి సూపర్ ఫామ్ అందుకున్న యువీ జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతనికి టీమిండియాలో చోటు లభిస్తుందన్న విశ్లేషకుల అంచనాలు వాస్తవ రూపం దాల్చాయి.
జట్టు: ధోనీ (కెప్టెన్), ధవన్, రోహిత్, కోహ్లీ, యువరాజ్, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, వినయ్, అమిత్ మిశ్రా, అంబటి రాయుడు, షమీ, ఉనాద్కట్.