న్యూఢిల్లీ: తన పోరాట పటిమ, ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి యువరాజ్ సింగ్ స్ఫూర్తిగా నిలిచాడని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీపై వీరూ ప్రశంసలు కురిపించాడు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పోరాట యోధుడిగా అందరి హృదయాలు గెలిచాడని మెచ్చుకున్నాడు. ‘ఆటగాళ్లు వస్తారు, వెళతారు కానీ యువీ లాంటి ఆటగాళ్లు అరుదుగా ఉంటార’ని ట్వీట్ చేశాడు. అతడి భవిష్యత్ జీవితం సాఫీగా సాగిపోవాలని శుభాకాంక్షలు తెలిపాడు.
యువరాజ్ సింగ్‌తో కలిసి ఆడటం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో అతడు ఒకడని ప్రశంసించాడు. ఆట పట్ల అతడు చూపించే ప్రేమ, అంకితభావం, ఉత్సాహం తమకు ప్రేరణగా నిలిచిందని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ మ్యాచ్ విన్నర్లతో యువీ ఒకడని మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో కిష్లమైన సవాళ్లను ఎదుర్కొని అత్యుత్తమ క్రీడా జీవితాన్ని నిర్మించికున్న యోధుడని కీర్తించాడు. దేశానికి అతడు అందించిన సేవలకు గర్వపడుతున్నామని పేర్కొన్నాడు.
క్రికెట్‌లో ఒక శకం ముగిసిందని వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. యువీ రిటైర్‌మెంట్ అభిమానులకు కచ్చితంగా నిరాశ కలిగిస్తుందని, అతడి జీవితం స్ఫూర్తిదాయకమని ప్రశంసించాడు. యువరాజ్ సింగ్ ప్రస్థానం అసామాన్యమైనదని, అద్భుతమైన క్రీడాజీవితం సాగించాడని ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు. యువీ సాధించిన విజయాలను, దేశానికి అతడు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో సందేశాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. (చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్ సింగ్)
Comments
Please login to add a commentAdd a comment