కోల్‌కతా: టీమిండియా మేజర్ టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మాత్రం రాణించలేకపోయాడు. ఈ విషయాన్ని యువీ కూడా ఒప్పుకున్నాడు. తన క్రీడా జీవితంలో ఈ ఒక్క లోటు ఉండిపోయిందని అన్నాడు. ఐపీఎల్‌లో ఏ ఒక్క జట్టు తరపున నిలదొక్కుకోలేకపోయిన బాధ తనకుందని పేర్కొన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ ఐపీఎల్‌లో ఆరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పుణే వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్ తరపున ఆడినా తనదైన ముద్ర వేయలేకపోయాడు.
‘ఏ ఫ్రాంచైజీ అయితే నన్ను కొనుక్కుందో ఆ టీమ్ తరపున నిలదొక్కులేకపోయాను. నేను ఆడిన ఒకటి లేదా రెండు జట్లలో కూడా సుస్థిర స్థానం సంపాదించలేకపోయాన’ని యువరాజ్ వాపోయాడు. 91వ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ సమావేశంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని యువీ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుకెక్కిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ అంచనాలకు తగినట్టు రాణించలేకపోయాడు. 2014 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోటీ పడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని 14 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో మొదటి రౌండ్‌లో యువీని దక్కించుకునేందుకు ఏ టీమ్ కూడా ఆసక్తి చూపించలేదు. కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ టీమ్ చివరకు అతడిని దక్కించుకుంది. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచినప్పటికీ అతడి పాత్ర పెద్దగా లేదు. అయితే తాను ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(2016), ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతలుగా నిలిచినప్పుడు అతడు ఈ రెండు జట్లలో సభ్యుడిగా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment