
చెలరేగిన యువరాజ్
ఢిల్లీ: రంజీ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ చెలరేగిపోయాడు. గ్రూప్-ఎ మ్యాచ్లో భాగంగా బరోడాతో మ్యాచ్లో యువరాజ్ సింగ్(260:370 బంతుల్లో 26 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. శనివారం మూడో రోజు ఆటలో 179 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన యువరాజ్.. చివరి రోజు ఆటలో కూడా మరోసారి అదే స్థాయిలో బ్యాట్ ఝుళిపించాడు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో యువీ కొన్ని కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 452/2 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ కు యువరాజ్ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకుముందు మరో పంజాబ్ ఆటగాడు వోహ్రా(224) డబుల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత యువీ డబుల్ సెంచరీ కూడా తోడవడంతో పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 670 పరుగులు చేసింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన బరోడా చివరి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. బరోడా తన తొలి ఇన్నింగ్స్లో 529 పరుగులు చేసింది.ఆ ఇన్నింగ్స్ లో దీపక్ హుడా(293) డబుల్ సెంచరీ సాధించాడు.