
జింబాబ్వే క్రికెట్ జట్టు
కరాచీ: పర్సనల్ లోన్, గోల్డ్ లోన్, మార్ట్‌గేజ్ లోన్, హోమ్ లోన్ గురించి విన్నాం కానీ... ఈ క్రికెట్ లోన్ కొత్తగా ఉంది కదూ. కొత్తగా ఉన్నా... మేం ఆడుకునేందుకు లోన్ కావాల్సిందేనని జింబాబ్వే క్రికెట్ యూనియన్ (జెడ్‌సీయూ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి మొరపెట్టుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఓ విదేశీ పర్యటనకు వెళ్లలేనంత పరిస్థితి తలెత్తిందని జింబాబ్వే వాపోతోంది. ఇప్పుడు ఐసీసీ సాయం చేస్తేనే తమ క్రికెట్ ఆటలు సాగుతాయని అభ్యర్థిస్తోంది.
మొత్తం మీద జింబాబ్వే కష్టాలు పాకిస్తాన్ కష్టాలుగా మారనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఆగస్టులో జింబాబ్వే క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆర్థిక కష్టాలతో జింబాబ్వే రాకపోతే పాక్ విలవిలలాడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే జరిగితే సమీప భవిష్యత్‌లో పాక్‌లో విదేశీ జట్టు పర్యటన ఇక గగనమే అవుతుంది. అయితే జింబాబ్వే తమ తుది నిర్ణయాన్ని ఏప్రిల్‌లో వెల్లడించనుందని పీసీబీ చీఫ్ నజమ్ సేథి అన్నారు.