
బులావాయో:ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఫేవరెట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. గ్రూప్-బిలో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై జింబాబ‍్వే రెండు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. కడవరకూ నువ్వా-నేనా అన్న రీతిలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేనే విజయం వరించింది. జింబాబ్వే 196 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకుని అద్భుతమైన గెలుపును అందుకుంది. ఫలితంగా అఫ్గానిస్తాన్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 49.3 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అఫ్గానిస్తాన్ ఓ దశలో విజయం దిశగా పయనించినా చివర వరకూ పోరాడటంలో విఫలమై ఓటమి చెందింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. అఫ్గాన్ ఆటగాళ్లలో రెహ్మత్ షా(69), మొహ్మద్ నబీ(51) రాణించినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. 156 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయిన అఫ్గాన్..మరో 38 పరుగులు చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు సాధించగా, సికిందర్ రాజా మూడు వికెట్లతో మెరిశాడు. ఇక బ్రెయిన్ విటోరి రెండు వికెట్లు, చతరా వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 43 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ టేలర్(89), సికిందర్ రాజా(60)లు హాఫ్ సెంచరీలతో సత్తాచాటుకున్నారు.