ఎవరు ఎన్నికైనా ప్రస్తుత లోక్‌సభ గడువు తొమ్మిది నెలలే. అయితే అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు, తమ స్థానాలైనందున జేడీఎస్‌కు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా జేడీఎస్‌కు మద్దతునిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలోని కేజేపీ పోటీకి విముఖత వ్యక్తం చేసింది. చతుర్ముఖ పోటీల వల్ల శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ముఖాముఖి పోటీ ఎదురవడంతో కాసింత ఆందోళన చెందుతోంది. విపక్షాల ఓట్లన్నీ జేడీఎస్‌కు దఖలు పడితే, తన గతేం కావాలని ఆరాటం చెందుతోంది.
బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శివ కుమార్ సోదరుడు డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థిగా కుమారస్వామి సతీమణి అనిత పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలోని చన్నపట్టణ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గత శాసన సభ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి సీపీ. యోగీశ్వర్ గెలుపొందారు. ఆయన కృపా కటాక్షాల కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు పోటీ పడుతున్నాయి. జేడీఎస్ అధినేత హెచ్‌డీ. దేవెగౌడ శనివారం ఆయనకు ఫోన్ చేసి తన కోడలికి మద్దతునివ్వాల్సిందిగా అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యోగీశ్వర్ చేతిలో అనితా కుమారస్వామి ఓటమి పాలయ్యారు.
దేవెగౌడ తంత్రాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోగీశ్వర్‌ను నేరుగా తన నివాసానికే ఆహ్వానించి, మద్దతు కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం యోగీశ్వర్ తుదికంటా ప్రయత్నించారు. ఆయనపై ఆర్థిక నేరాల కేసు ఉందనే సాకుతో టికెట్‌ను నిరాకరించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయన మద్దతు కోసం అర్రులు చాస్తోంది. మరో వైపు కాంగ్రెస్ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఉప ఎన్నికలపై పార్టీ నాయకులతో శనివారం సమాలోచనలు జరిపారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం ఇన్‌చార్జిగా హోం మంత్రి కేజే. జార్జ్, మండ్య ఇన్‌ఛార్జిగా ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్‌ఎస్. మహదేవ ప్రసాద్‌లను నియమించారు.
యడ్యూరప్పతో శివకుమార్ భేటీ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యడ్యూరప్ప అవినీతిపై కాంగ్రెస్ కోడై కూసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ఆయన మద్దతు కోసం ఆరాట పడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కేజేపీ తటస్థంగా ఉంది. శివకుమార్ గురువారం డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలని అర్థించారు. అయితే యడ్యూరప్ప ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ నెల 22న జరుగనున్న శాసన మండలి ఉప ఎన్నికల్లో బీజేపీ, కేజేపీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాయి. మూడు చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, మైసూరులో కేజేపీ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ రంగం నుంచి వైదొలగింది. ప్రతిగా కేజేపీ ధార్వాడ, చిత్రదుర్గల నుంచి తన అభ్యర్థులను తప్పించింది. ఇలా...బీజేపీ, కేజేపీ, జేడీఎస్‌ల మధ్య అవగాహన కుదిరింది. ఈ పరిస్థితుల్లో యడ్యూరప్ప కాంగ్రెస్‌కు మద్దతునివ్వక పోవచ్చని వినవస్తోంది.
మద్దతియ్యండయ్యా..!
Published Sun, Aug 11 2013 2:57 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement