Bangalore Rural
-
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ నామినేషన్
కర్ణాటకలో ఏకైక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ నామినేషన్ వేశారు. కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి డీకే సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డీకే సురేష్ వెంట రామనగర జిల్లా ఇన్చార్జి మంత్రి రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ తమ్ముడే ఈ డీకే సురేష్. మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామిని 2013 ఉప ఎన్నికలో ఆయన ఓడించారు. మరోవైపు మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అల్లుడు, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి బావమరిది అయిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ సీఎన్ మంజునాథ్‌ను బీజేపీ-జేడీఎస్ కూటమి పోటీకి దింపింది. బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్న మంజునాథ్ 17 ఏళ్ల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు సారథ్యం వహించి ఈ ఏడాది జనవరిలో పదవీ విరమణ చేశారు. -
ఎస్సై బర్త్‌డే హల్చల్.. స్టేషన్లో టపాసులు కాల్చి డ్యాన్స్‌లు
దొడ్డబళ్లాపురం: కరోనా లాక్డౌన్ సమయంలో ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాల్సిన సమయంలో ఓ ఎస్సై బాధ్యత మరిచి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలు చేసుకోవడం విమర్శల పాలైంది. హొసకోట పీఎస్‌లో ఎస్సైగా పనిచేసే రాజుకి సీఐగా పదోన్నతి వచ్చింది. దీనికి తోడు ఆయన పుట్టినరోజు కావడంతో కొందరు పోలీసులు, ఆయన మిత్రులు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పోలీస్‌స్టేషన్ ముందు టపాసులు కాల్చి డ్యాన్సులు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి. చదవండి: హారిక మృతి కేసు. విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్ -
బెంగళూరు రూరల్, మాండ్య స్థానాలు కాంగ్రెస్ సొంతం
కర్ణాటకలోని బెంగళూరు రూరల్, మాండ్య లోక్‌సభ నియోజక వర్గాలు అధికార కాంగ్రెస్ పార్టీ సొంతమైనాయి. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి డి.కే. సురేశ్ సమీప ప్రత్యర్థి, మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి భార్య అనిత కుమార స్వామిపై లక్షా 37 వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అలాగే మాండ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కన్నడ సినీ నటీ రమ్య తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (ఎస్) అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై 67 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కాగా గతంలో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కుమార స్వామి, మాండ్యా నుంచి చెలువరాయస్వామి గెలుపొందారు. అయితే ఈ ఏడాది మేలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వారిరువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. దాంతో వారు అయా పార్లమెంట్ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికలు నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను శనివారం ఇక్కడ లెక్కించారు. అనంతరం ఉన్నతాధికారులు ఫలితాలను ఇక్కడ వెల్లడించారు. కాగా ఆ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తాము మందే ఊహించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వెల్లడించారు. ఆ ఉప ఎన్నికల్ల ఓడింది జేడీ ఎస్ మాత్రమే కాదని బీజేపీ, కేజీపీలు కూడా అని సిద్దరామయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నో సౌండ్...
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండ్య, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. బుధవారం పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ 24న నిర్వహిస్తారు. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష జేడీఎస్‌లకు ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. దరిమిలా ఇరు పార్టీల ముఖ్య నాయకులు తుది క్షణం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. బెంగళూరు గ్రామీణలో కాంగ్రెస్ అభ్యర్థిగా డీకే. శివకుమార్, జేడీఎస్ అభ్యర్థిగా అనితా కుమారస్వామి, మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థిగా నటి రమ్య, జేడీఎస్ అభ్యర్థిగా సీఎస్. పుట్టరాజులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం. కృష్ణ, మంత్రులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ. దేవెగౌడ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుమారస్వామిలు పార్టీ అభ్యర్థుల తరఫున జోరుగా ప్రచారం సాగించారు. బహిరంగంగానే బీజేపీ మద్దతు ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీల మధ్య అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రచారం పట్ల బీజేపీ తొలుత సుముఖత వ్యక్తం చేసినా, చివరి రెండు రోజులు నేరుగా రంగంలోకి దిగింది. జేడీఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి ఆర్. అశోక్ ప్రచారం చేయడం విశేషం. అతి సమస్యాత్మక కేంద్రాలు బెంగళూరు గ్రామీణలో 446, మండ్యలో 236 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. బెంగళూరు గ్రామీణలో 9,92,878 మంది పురుష, 9,23,456 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండ్యలో 8,15,363 మంది పురుష, 8,02,226 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెంగళూరు గ్రామీణ పరిధిలో ఆనేకల్, బెంగళూరు దక్షిణ, రాజరాజేశ్వరి నగర, కుణిగల్, రామనగర, మాగడి, చన్నపట్టణ, కనకపుర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మండ్య పరిధిలో మళవళ్లి, మద్దూరు, మండ్య, శ్రీరంగపట్టణ, నాగమంగల, మేలుకోటె, కృష్ణరాజ పేటె, కృష్ణరాజ నగర అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. -
నేటితో ప్రచారానికి తెర
సాక్షి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారానికి నేటి (సోమవారం) సాయంత్రం ఐదు గంటలకు తెరపడనుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రచార వేగాన్ని పెంచడంతో పాటు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడైన కుమారస్వామి, (బెంగళూరు గ్రామీణ), చలువరాయస్వామి (మండ్య) లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా అమాత్యులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే తమ కార్యాలయాలకు రావడమే మానేసి పార్టీ అభ్యర్థులైన సురేష్‌కుమార్, రమ్య గెలుపు కోసం లోక్‌సభ పరిధిలోని నియోజక వర్గాల్లో తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రమ్య గెలుపు కోసం కేపీసీసీ నాయకులు మండ్య లోక్‌సభ పరిధిలో కేంద్ర మంత్రులు వీరప్పమొయిలీ, మునియప్ప తదితర నాయకులతో బహిరంగ సభల్లో మాట్లాడించి ఆ వర్గం ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టన్, ఎంపీ మహ్మద్అజారుద్దీన్ను కూడా ప్రచారంలోకి దించారు. ఇక బెంగళూరు గ్రామీణ స్థానానికి పోటీపడుతున్న సురేష్‌కుమార్ కోసం స్వయానా అతని అన్న, కనకపుర ఎమ్మెల్యే డీ.కే శివకుమార్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా తన రాజకీయ బద్ధశత్రువు, ఎస్పీ పార్టీ ఎమ్మెల్యే యోగీశ్వర్ మద్దతు కూడా అడగడానికి వెనుకాడలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో కూడా గెలుపు కోసం అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది. అయితే ృగహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, మాజీ కేంద్ర మంత్రి ఎస్.ఎంృకష్ణ మధ్య ఉన్న విభేదాలు మండ్య స్థానానికి పోటీపడుతున్న రమ్య విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల భావన. జేడీఎస్‌తో బీజేపీ దోస్తీ... మొదటి నుంచి ఈ రెండు స్థానాల్లో జేడీఎస్‌కు మంచి పట్టు ఉంది. దీంతో ఎలాగైనా అనితాకుమారస్వామి (బెంగళూరు గ్రామీణ), సీ.ఎస్ సిద్ధరాజు (మండ్య)లను గెలుచుకోవాలని ఆ పార్టీ నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన దేవెగౌడ ఈ విషయంలో పట్టినపట్టు విడవడం లేదు. వర్షాలను, చలిగాలులను కూడా లెక్కచేయకుండా 80 ఏళ్ల వయసులో కూడా బహిరంగ ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంృకషి చేస్తున్నారు. ఇక కుమారస్వామి అయితే ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ పార్టీతో పాటు ఒకప్పటి తన రాజకీయ సన్నిహితుడు, ప్రస్తుత సీఎం అయిన సిద్ధరామయ్యపై విమర్శలను గుప్పిస్తున్నారు. తమకు బీజేపీతో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎటువంటి పొత్తు ఉండదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన జేడీఎస్ నాయకులు ఆఖరి క్షణాల్లో ఆ పార్టీనాయకులతో కలిసి బహిరంగ ప్రచారానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా బెంగళూరు గ్రామీణ పార్లమెంట్ స్థానానికి పోటీపడుతున్న అనితా కుమారస్వామితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఆర్. అశోక్ ఆదివారం బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కువ మెజారిటీతో జేడీఎస్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. నేడు (సోమవారం) కూడా బీజేపీకి చెందిన కొంతమంది అగ్రనాయకులు జేడీఎస్ అభ్యర్థుల పరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే లౌకికవాద పార్టీగా చెప్పుకునే జేడీఎస్ ఉప ఎన్నికల్లో గెలుపుకోసం హిందుత్వ పార్టీగా ముద్ర పడ్డ బీజేపీతో జతకట్టడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ రెండు స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 21న జరగనుండగా ఫలితాలు 24న వెలువడనున్నాయి. ఆకట్టుకున్న కరాటే పోటీలు బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : నగరంలోని అల్లం భవనంలో పంచాక్షరీ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో కరాటే పోటీలు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 150 మంది బాలికలు పాల్గొనడం విశేషం. తొలిరోజు బె ల్ట్ ప్రదర్శనలు జరగ్గా, రెండవ రోజు ఆదివారం ఫైటింగ్ ప్రదర్శనలు జరిగాయి. బె ల్ట్ ప్రదర్శనలో కలర్ బెల్ట్‌లో గదగ్‌కు చెందిన చేతన మొదటి స్థానం, హుబ్లీ గోజరియాకు ద్వితీయ స్థానం, బెంగళూరు సోరిన్ రాం తృతీయ స్థానం పొందారు. -
ఉప పోరు తర్వాతే
సాక్షి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం నెలకొల్పదలచిన కమిటీ ఏర్పాటవుతుందని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసినందువల్ల మంచి పదవిని ఆశిస్తున్నానన్నారు. తనకు కొంత మంది ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొందరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారని తెలిపారు. అయితే ఇందులో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరుతున్న ఇతర పార్టీల నాయకులకు తాము ఎటువంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. బేషరతుగానే అందరూ చేరుతున్నారని వెల్లడించారు. దీనిపై పార్టీకి లిఖితపూర్వకంగా కూడా అందించారన్నారు. మాజీ డీజీపీ శంకర బిదరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది తానేనన్నారు. పార్టీ నియమావళిమేరకు ఆయనకు గత శాసన సభ ఎన్నికల సందర్భంగా టికెట్టు ఇవ్వలేకపోయామన్నారు. ఆయన మరి కొంత కాలం వేచి ఉంటే సముచిత స్థానం దక్కి ఉండేదని అభిప్రాయపడ్డారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వారిలో 450 మందికి నోటీసులు జారీ చేశామన్నారు. వీరి లో ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సహా ఏడు మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడని వారిని ఎట్టి పరిస్థితులల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రి య దాదాపు పూర్తి కావస్తోందన్నా రు. ఎన్నికలకు రెండు, మూడు నెల ల ముందుగానే కాంగ్రెస్ అభ్య ర్థుల పేర్లను ప్రకటిస్తామన్నారు. కా గా బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
వేడెక్కిన ఉప ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు ప్రచారం హోరెత్తింది. విమర్శల పర్వం మొదలైంది. ప్రధాన నాయకులు తెర చాటున ఇతర పార్టీల్లోని ముఖ్యులను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు లాక్కోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతున్నాయి. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని చన్నపట్టణ శాసన సభ్యుడు సీపీ. యోగీశ్వర్ మద్దతు పొందడానికి ఇరు పార్టీల నాయకులు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఆయన సమాజ్ వాది పారీ అభ్యర్థిగా గెలుపొందారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఆయనతో ఇదివరకే సంప్రదింపులు జరిపారు. ఈసారి తమకు మద్దతునిస్తే భవిష్యత్తులో చన్నపట్టణలో తమ పార్టీ పోటీ చేయకుండా సహకరిస్తామని దేవెగౌడ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సిద్ధరామయ్యతో భేటీ సందర్భంగా యోగీశ్వర్ తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిస్తానని షరతు విధించినట్లు తెలిసింది. అధిష్టానంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అయితే యోగీశ్వర్ తన మనసులోని నిర్ణయాన్ని వెల్లడించకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దేవెగౌడ సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో కూడా చర్చించినట్లు తెలిసింది. పాత పరిచయాల వల్ల యాదవ్ మద్దతు పొందడం పెద్ద కష్టమేమీ కాదని జేడీఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే యోగీశ్వర్ ఆలోచన వేరే రకంగా ఉంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఏ విధంగా మలచుకోవాలనే విషయమై ఆయన యోచిస్తున్నారు. కాంగ్రెస్‌లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే నగరంలోని రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మునిరత్న, దేవరాజ్‌లు కూడా పాల్గొన్నారు. శ్రీనివాస్ కుమారుడు, బీబీఎంపీ కార్పొరేటర్ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కు మద్దతునిస్తానని ప్రకటించారు. చివరగా మాజీ మంత్రి ఆర్. అశోక్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తమను నడి సముద్రంలో వదిలేసి ఆయన అధికారాన్ని అనుభవించారని ధ్వజమెత్తారు. మున్ముందు ఆయన గుట్టు రట్టు చేస్తానని వెల్లడించారు. ఈ హఠాత్పరిణామంతో సమావేశానికి హాజరైన బీజేపీ కార్యకర్తలు నివ్వెరపోయారు. -
మద్దతియ్యండయ్యా..!
ఎవరు ఎన్నికైనా ప్రస్తుత లోక్‌సభ గడువు తొమ్మిది నెలలే. అయితే అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు, తమ స్థానాలైనందున జేడీఎస్‌కు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా జేడీఎస్‌కు మద్దతునిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలోని కేజేపీ పోటీకి విముఖత వ్యక్తం చేసింది. చతుర్ముఖ పోటీల వల్ల శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ముఖాముఖి పోటీ ఎదురవడంతో కాసింత ఆందోళన చెందుతోంది. విపక్షాల ఓట్లన్నీ జేడీఎస్‌కు దఖలు పడితే, తన గతేం కావాలని ఆరాటం చెందుతోంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శివ కుమార్ సోదరుడు డీకే. సురేశ్, జేడీఎస్ అభ్యర్థిగా కుమారస్వామి సతీమణి అనిత పోటీ పడుతున్నారు. ఈ లోక్‌సభ నియోజక వర్గంలోని చన్నపట్టణ అసెంబ్లీ సెగ్మెంట్లో గత శాసన సభ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి సీపీ. యోగీశ్వర్ గెలుపొందారు. ఆయన కృపా కటాక్షాల కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు పోటీ పడుతున్నాయి. జేడీఎస్ అధినేత హెచ్డీ. దేవెగౌడ శనివారం ఆయనకు ఫోన్ చేసి తన కోడలికి మద్దతునివ్వాల్సిందిగా అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యోగీశ్వర్ చేతిలో అనితా కుమారస్వామి ఓటమి పాలయ్యారు. దేవెగౌడ తంత్రాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య యోగీశ్వర్‌ను నేరుగా తన నివాసానికే ఆహ్వానించి, మద్దతు కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం యోగీశ్వర్ తుదికంటా ప్రయత్నించారు. ఆయనపై ఆర్థిక నేరాల కేసు ఉందనే సాకుతో టికెట్‌ను నిరాకరించిన కాంగ్రెస్, ఇప్పుడు ఆయన మద్దతు కోసం అర్రులు చాస్తోంది. మరో వైపు కాంగ్రెస్ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఉప ఎన్నికలపై పార్టీ నాయకులతో శనివారం సమాలోచనలు జరిపారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం ఇన్చార్జిగా హోం మంత్రి కేజే. జార్జ్, మండ్య ఇన్ఛార్జిగా ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్‌లను నియమించారు. యడ్యూరప్పతో శివకుమార్ భేటీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యడ్యూరప్ప అవినీతిపై కాంగ్రెస్ కోడై కూసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ఆయన మద్దతు కోసం ఆరాట పడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కేజేపీ తటస్థంగా ఉంది. శివకుమార్ గురువారం డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలని అర్థించారు. అయితే యడ్యూరప్ప ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ నెల 22న జరుగనున్న శాసన మండలి ఉప ఎన్నికల్లో బీజేపీ, కేజేపీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాయి. మూడు చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, మైసూరులో కేజేపీ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ రంగం నుంచి వైదొలగింది. ప్రతిగా కేజేపీ ధార్వాడ, చిత్రదుర్గల నుంచి తన అభ్యర్థులను తప్పించింది. ఇలా...బీజేపీ, కేజేపీ, జేడీఎస్‌ల మధ్య అవగాహన కుదిరింది. ఈ పరిస్థితుల్లో యడ్యూరప్ప కాంగ్రెస్‌కు మద్దతునివ్వక పోవచ్చని వినవస్తోంది.