సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు ప్రచారం హోరెత్తింది. విమర్శల పర్వం మొదలైంది. ప్రధాన నాయకులు తెర చాటున ఇతర పార్టీల్లోని ముఖ్యులను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి దాకా రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు లాక్కోవడానికి కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ముఖాముఖి తలపడుతున్నాయి. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలోని చన్నపట్టణ శాసన సభ్యుడు సీపీ. యోగీశ్వర్ మద్దతు పొందడానికి ఇరు పార్టీల నాయకులు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఆయన సమాజ్ వాది పారీ అభ్యర్థిగా గెలుపొందారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఆయనతో ఇదివరకే సంప్రదింపులు జరిపారు. ఈసారి తమకు మద్దతునిస్తే భవిష్యత్తులో చన్నపట్టణలో తమ పార్టీ పోటీ చేయకుండా సహకరిస్తామని దేవెగౌడ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
సిద్ధరామయ్యతో భేటీ సందర్భంగా యోగీశ్వర్ తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిస్తానని షరతు విధించినట్లు తెలిసింది. అధిష్టానంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అయితే యోగీశ్వర్ తన మనసులోని నిర్ణయాన్ని వెల్లడించకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. దేవెగౌడ సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో కూడా చర్చించినట్లు తెలిసింది. పాత పరిచయాల వల్ల యాదవ్ మద్దతు పొందడం పెద్ద కష్టమేమీ కాదని జేడీఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే యోగీశ్వర్ ఆలోచన వేరే రకంగా ఉంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా ఏ విధంగా మలచుకోవాలనే విషయమై ఆయన యోచిస్తున్నారు.
కాంగ్రెస్‌లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎం. శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం పరిధిలోకి వచ్చే నగరంలోని రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మునిరత్న, దేవరాజ్‌లు కూడా పాల్గొన్నారు. శ్రీనివాస్ కుమారుడు, బీబీఎంపీ కార్పొరేటర్ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కు మద్దతునిస్తానని ప్రకటించారు. చివరగా మాజీ మంత్రి ఆర్. అశోక్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. తమను నడి సముద్రంలో వదిలేసి ఆయన అధికారాన్ని అనుభవించారని ధ్వజమెత్తారు. మున్ముందు ఆయన గుట్టు రట్టు చేస్తానని వెల్లడించారు. ఈ హఠాత్పరిణామంతో సమావేశానికి హాజరైన బీజేపీ కార్యకర్తలు నివ్వెరపోయారు.
వేడెక్కిన ఉప ఎన్నికల ప్రచారం
Published Mon, Aug 12 2013 3:26 AM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM
Advertisement
Advertisement