కర్ణాటకలోని బెంగళూరు రూరల్, మాండ్య లోక్సభ నియోజక వర్గాలు అధికార కాంగ్రెస్ పార్టీ సొంతమైనాయి. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీ అభ్యర్థి డి.కే. సురేశ్ సమీప ప్రత్యర్థి, మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి భార్య అనిత కుమార స్వామిపై లక్షా 37 వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అలాగే మాండ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కన్నడ సినీ నటీ రమ్య తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (ఎస్) అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై 67 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.
కాగా గతంలో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కుమార స్వామి, మాండ్యా నుంచి చెలువరాయస్వామి గెలుపొందారు. అయితే ఈ ఏడాది మేలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వారిరువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. దాంతో వారు అయా పార్లమెంట్ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికలు నిర్వహించాయి.
ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను శనివారం ఇక్కడ లెక్కించారు. అనంతరం ఉన్నతాధికారులు ఫలితాలను ఇక్కడ వెల్లడించారు. కాగా ఆ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తాము మందే ఊహించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వెల్లడించారు. ఆ ఉప ఎన్నికల్ల ఓడింది జేడీ ఎస్ మాత్రమే కాదని బీజేపీ, కేజీపీలు కూడా అని సిద్దరామయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.