జయలలిత ఆరోగ్యంపై ఆగని వదంతులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. వీవీఐపీలు చెన్నై అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. జయలలిత క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇక అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకే నేతలు ఓ ఐటీ డెస్క్ ను ఏర్పాటుచేశారు. అయినా జయలలిత ఆరోగ్యంపై వదంతులు ఆగడం లేదు.
ఫేస్బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, వాట్సప్ల ద్వారా జయలలిత ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేసిన వారిపై తమిళనాడులో 50 కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటి వరకూ ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా టుటికోరిన్ జిల్లాకు చెందిన ఆంటోని జేసురాజ్ (24) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయ ఆరోగ్యం గురించి అతను సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేశాడు. పోలీసులు జేసురాజ్కు నోటీసులు ఇచ్చి విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 22 నుంచి తమిళనాడు సీఎం అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, సీఎం జయలలిత సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అన్నాడీఎంకే వైద్య విభాగం డా. సునీల్ నేతృత్వంలో మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో అన్నాడీఎంకే ఎంపీ వేణుగోపాల్, పలువురు ఎమ్మెల్యేలు, ఆప్కా అధ్యక్షుడు డా.కె. సుబ్బారెడ్డి, 100 మంది వైద్యులు పాల్గొన్నారు.