బతుకు బలి
వేలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట సిప్‌కాట్‌లోని కలుషిత నీటి ట్యాంక్ పగిలిపోవడంతో పది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. విషవాయువులు పీల్చడం వల్ల మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
వేలూరు:రాణిపేట సిప్‌కాట్‌లో తోళ్లు, రసాయనాలు, ఇనుము, ప్లాస్టిక్ తదితర 86 పరిశ్రమలున్నాయి. ప్రధా నంగా తోళ్ల పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత నీటిని శుభ్రం చేసి నిల్వ చేసేందుకు 50 లక్షల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన స్టోరేజ్‌ట్యాంక్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ట్యాంక్‌లోని నీటిని శుద్ధిచేసి మళ్లీ పరిశ్రమలకు విని యోగిస్తుంటారు. తోళ్ల పరిశ్రమలో పనిచేసే కార్మికుల విశ్రాంతి షెడ్‌ను ఈ తొట్టె సమీపంలోనే నిర్మించారు. శుక్రవారం రాత్రి విధులు పూర్తిచేసుకుని 13 మంది కార్మికులు షెడ్‌లో నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సుమారు వెయ్యి మీటర్ల ఎత్తున్న ఈ కలుషిత నీటిట్యాంక్ ఒక్కసారిగా బద్ధలైంది. అందులోని నీరు వరదలా కార్మికులు నిద్రిస్తున్న షెడ్‌లోకి ప్రవేశించింది.
ప్రవాహం తీవ్రతకు పరిశ్రమల ప్రహరీగోడ సైతం కూలిపోయింది. అనుకోకుండా ఆదే సమయంలో అక్కడికి చేరుకున్న పరిశ్రమల సూపర్‌వైజర్ అమీర్, రవి, పయణిలు ముక్కులు మూసుకుని ప్రమాద స్థలం నుంచి పరుగులు తీశారు. విషయాన్ని పరిశ్రమ యాజమాన్యానికి, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. వేలూరు జిల్లా కలెక్టర్ నందగోపాల్, పోలీస్ డీఐజీ తమిల్ చంద్రన్, ఎస్‌పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలానికి చేరుకుని వేలూరు, రాణిపేట, వాలాజలోని అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి సహాయక చర్యలు ప్రారంభించారు. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు జేసీబీ సాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు. నిద్ర మత్తులో ఉన్న పదిమంది కార్మికులు బురదలో కూరుకుపోవడంతో అక్కడిక్కడే మృతి చెందారు.
మృతి చెందిన వారిలో తొమ్మిదిమంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారుకాగా మరోవ్యక్తి తమిళనాడుకు చెందిన వాడిగా గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు కార్మికుల్లో ఇద్దరికి విషవాయువు శోకడంతో శ్వాస ఆడక కొంత సేపటికే స్పహతప్పి పడిపోయారు. మృతదేహాలను, స్ఫృహకోల్పోయిన వారిని వేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా విషవాయువు ఆ ప్రాంతంలోని వీధుల్లో ప్రవేశించి బీభత్సంగా మారింది. రోడ్లన్నీ బురదమయమై దుర్వాసన ప్రబలడంతో గ్రామస్తులు ఆందోళన చె ందారు.
అనుమతిలేకుండానే తొట్టి నిర్మాణం
పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే నీటిని శుద్ధిచేసే విభాగానికి కాలుష్యనియంత్ర మండలి అనుమతి పొందిన యాజమాన్యం భారీ నీటితొట్టిను మాత్రం అనుమతి పొందకుండానే నిర్వహిస్తోంది. పైగా నీటిశుద్ధి విభాగ నిర్మాణం పూర్తికాకుండానే వినియోగించడం, అనుమతి పొందని నీటి తొట్టె ప్రమాదానికి కారణమని వేలూరు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి కామరాజ్ తెలిపారు. నీటిశుద్ధి విభాగానికి సీల్‌వేసి సమగ్రవిచారణ జరుపుతామని ఆయన చెప్పారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
పది మంది మృతి చెందిన ప్రాంతాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి మోహన్, ఎమ్మెల్యేలు డాక్టర్ విజయ్, మహ్మద్‌జాన్, శ్రీనివాసన్, కలైఅరసన్, రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న మృత దేహాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. పది మందిని బలిగొన్న ప్రమాదంపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ నందగోపాల్‌ను ఆదేశించారు. మృతులకు తలా రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రకటించారు.
మృతుల వివరాలు
తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మేల్‌వలం గ్రామానికి చెందిన వాచ్‌మన్ సంపత్(40), పశ్చిమబెంగాల్‌కు చెందిన అబీర్‌ఖాన్(50), అలీ ఆస్కార్(25), అలీ అక్బర్(23), సుకూర్(45), ఏసియామ్(23), అక్రమ్(22), ఫియార్(25), షాజహాన్(25), కుదూర్(18)లు మృతి చెందారు.