17న పల్స్ పోలియో
సాక్షి, చెన్నై: తొలి విడత పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల పదిహేడో తేదీ జరగనున్నది. 43 వేల శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 70 లక్షల మంది పిల్లలకు చుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించారు. పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.
ఇందులోభాగంగా ప్రతి ఏటా పోలియో చుక్కల్ని ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు వేస్తూ వస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కలు వేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతోన్నది. ఆదిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో విజయవంతం చేయడం లక్ష్యంగా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. సచివాలయంలో బుధవారం ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలో పల్స్ పోలియో శిబిరాల ఏర్పాటు చర్యలపై సమాలోచన సమావేశం జరిగింది. ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్ వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో శిబిరాల్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా 43501 శిబిరాల్ని ఏర్పాటు చేసి, 70 లక్షల మంది పిల్లలకు చుక్కల్ని వేయడం లక్ష్యంగా టార్గెట్ నిర్ణయించారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. అలాగే, సంచార వాసులు,కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా మొైబె ల్ శిబిరాల్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1652 మొబైల్ శిబిరాల్ని, మరో వెయ్యి బృందాల్ని ఏర్పాటుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఈనెల 17వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ శిబిరాల్లో పిల్లలకు చుక్కలు వేయనున్నారు. చుక్కలు వేయ బడ్డ పిల్లల ఎడమ చేతి బొటనవేలికి ఇంక్ మార్క్ వేయనున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు మంత్రి విజయభాస్కర్ పిలుపు నిచ్చారు.