అటు హామీ ఇటు బందీ
Published Mon, Dec 30 2013 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
శ్రీలంక నావికాదళాల దాడులకు అడ్డుకట్ట వేసేలా శాశ్వత పరిష్కారం చూపుతామని అటు కేంద్రం హామీ ఇచ్చిందో లేదో, ఇటు 22 మంది జాలర్లను పట్టుకెళ్లి బందించేశాయి. లంక సేనల దాడులు మితిమీరి పోతుండడంతో పుదుకోట్టై జాలర్లలో ఆగ్రహాన్ని రగిల్చింది. దీంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వం రోజురోజుకూ పేట్రేగుతోంది. ఇప్పటికే ఆ దేశ చెరలో 300కు పైగా తమిళ జాలర్ల జీవితాలు మగ్గుతున్నాయి. లక్షలు విలువ చేసే 75కు పైగా పడవలు వారి ఆధీనంలో ఉన్నాయి. తమ వాళ్ల విడుదల కోసం రాష్ట్ర జాలర్లు ఆందోళన చేస్తూ వస్తున్నారు. జాలర్లను బుజ్జగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు మాత్రం బుట్ట దాఖలవుతున్నాయి. తమ వాళ్ల విడుదల కోసం ఢిల్లీ వెళ్లిన బృందం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో శనివారం ఉదయం భేటీ అయ్యారు. దాడులకు అడ్డుకట్ట వేస్తామంటూ ఆయన హామీ గుప్పించారు. అదే రోజు రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యూరు. డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, ఎంపీ విజయన్ నేతృత్వంలోని జాలర్ల ప్రతినిధుల బృందం ఏకరువు బెట్టిన ఆవేదనల్ని మన్మోహన్ సింగ్ ఆలకించారు. దాడుల అడ్డుకట్టకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి పంపించారు. వారు అటు హామీ ఇచ్చి పంపించారో లేదో, ఇటు 22 మంది జాలర్లను తమ దేశానికి లంక సేనలు బందీగా పట్టుకెళ్లడం బట్టి చూస్తే హామీలు ఏ మేరకు అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
పుదుకోట్టై జిల్లా జగదాపట్నం, కోట్టై పట్నం జాలర్లు సుమారు రెండు వేల మంది 500 పడవల్లో శనివారం రాత్రి చేపల వేట నిమిత్తం కడలిలోకి వెళ్లారు. జగదాపట్నానికి చెందిన సత్య ప్రియన్, విజయన్, శీలన్‌ల పడవలతో పాటుగా మరికొన్ని భారత సరిహద్దుల్లో చేపల వేటలో నిమగ్నమయ్యాయి. వలలను విసిరి చేపల్ని వేటాడుతున్న జాలర్లపై శ్రీలంక సేనలు విరుచుకు పడ్డారుు. ఐదు బోట్లలో వచ్చిన ఆ దేశ నావికాద ళం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. వలల్ని తెంచి పడేస్తూ, దుడ్డుకర్రలతో జాలర్లపై దాడులు చేస్తూ, తమ బోట్లను జాలర్ల పడవలకు ఢీ కొడుతూ ఆ దేశ సైనికులు వీరంగం సృష్టించారు. దీంతో అక్కడున్న జాలర్లు ఆందోళనకు దిగారు. దీంతో తమ పడవల్ని ఒడ్డుకు తిప్పారు. అయితే, ఆరు పడవల్ని అందులోని 22 మందిని లంక సేనలు చుట్టుముట్టాయి. వారిని బందీగా పట్టుకుని తమ దేశానికి తీసుకెళ్లాయి. శ్రీలంకలోని కాంగేషన్ హార్బర్‌లో ఆ పడవల్ని ఉంచారు. సోమవారం కోర్టులో జాలర్లను హాజరు పరచబోతున్నారు. తమ వాళ్లను బందీలుగా లంక సేనలు పట్టుకెళ్లిన సమాచారంతో పుదుకోట్టై జాలర్లలో ఆగ్రహం రేగింది. చేపల వేటను బహిష్కరించి తమ వాళ్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. తమ వాళ్లపై దాడి జరిగిన సమాచారంతో జాలర్ల కుటుంబాలు విలపిస్తున్నాయి. ప్రధాని హామీ ఇచ్చిన మరుసటి రోజే తమ మీద దాడి జరగడాన్ని జాలర్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
Advertisement
Advertisement