కొత్త ఓటర్లు 3.49 లక్షలు
Published Thu, Sep 12 2013 1:54 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధాన సభ ఎన్నికల్లో 3.49 లక్షల మంది యువతీయువకులు తొలిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియలో యువతను భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఫలితంగానే కొత్త ఓటర్ల సంఖ్య ఈసారి భారీగా పెరిగిందని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారి విజయ్ దేవ్ తెలిపారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత తమ ఓటుహక్కును వినియోగించుకునేలా నగరంలోని 863 విద్యాసంస్థల్లో ప్రత్యేక ప్రచారకులను ఎన్నికల సంఘం నియమించింది. 110 శిబిరాలను నిర్వహించి, ఓటు హక్కు విలువను యువతకు వివరించాం. ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పాం. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ నుంచే ప్రారంభమైంది. మహిళా ఓటర్లు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 324 శిబిరాలను నిర్వహించాం. మహిళలు కూడా ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పు వస్తుందో తెలిజెప్పాం. ఇళ్లు లేని నిరాశ్రయులను 7,249 మందిని గుర్తించి, ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేశాం.
అభ్యర్థుల ఖర్చుకు కళ్లెం...
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుకు కళ్లెం వేసేందుకు అత్యధిక వ్యయ పరిమితిని రూ. 14 లక్షలుగా నిర్ణయించాం. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తీ విధిగా బ్యాంకు ఖాతాను తెరిచి, వాటి ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు వివరాలను నామినేషన్ సమయంలోనే ఎన్నికల అధికారికి సమర్పించాలి. అంతేకాక ఎన్నికల ఖర్చుకు సంబంధించి అభ్యర్థి ఓ రిజిస్టర్‌ను నిర్వహించాలి. దానిలో ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను పొందుపర్చాలి. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే డబ్బులు పంచినవారితోపాటు డబ్బులు తీసుకున్నవారు కూడా శిక్షార్హులవుతారు. వారికి కనీసం ఏడాదిపాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ విషయమై ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం.
ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
ఇక ఓటు వేసే అభ్యర్థులకు వారి ఫొటో, వివరాలు ఉన్న పత్రాలన్ని ముందుగానే ఇస్తారు. వీటిని గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో? లేదో? ఎస్‌ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9211728082 నంబర్‌కు డయల్ చేయాలి. ఈ సదుపాయాన్ని జూలైలోనే ప్రారంభించాం. ఇప్పటిదాకా 36,952 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కాగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 35,000 మందితోపాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న 9,000 మంది తమ పేర్లను నమోదు చేసుకోలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరిని కూడా ఓటర్ల జాబితాలోకి తీసుకొస్తాం.
ఇక ఢిల్లీ ఓటరుజాబితాలో 154 మంది వంద సంవత్సరాలు దాటినవారుండగా 68,392 మంది ఎనభై సంవత్సరాలు దాటినవారున్నారు. ఓటరు సరైన అభ్యర్థిని ఎన్నుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందుకు ఓటరుకు సాయపడేందుకు అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఇకపై ఓటర్లు బారులు తీరాల్సిన అవసరం లేదు. వారు కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాక తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విధానసభ ఎన్నికల కోసం 2,603 ప్రాంతాల్లో 11,763 పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశాం. వీటిలో 634 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామ’ని చెప్పారు.
ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు..
వేధింపులు, నేరపూరిత కుట్ర, మోసం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుల్ మన్‌రాయ్, ఆజాద్ సింగ్, పవన్ కుమార్, ప్రేమ్‌చంద్‌లపై ఢిల్లీ ఎన్నికల సంఘం శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించింది.
Advertisement