Vijay Dev
-
స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన విజయ్‌దేవ్
న్యూఢిల్లీ: ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సోమవారం పరిశీలించారు. ఈ మేరకు రెండు పార్లమెంటరీ స్థానాల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానంలోని గోలే మార్కెట్ ఎన్పీ బెంగాలి గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌తో పాటు ద్వారకా సెక్టార్-9లోని ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవ్ మాట్లాడుతూ...న్యూఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలకు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, 30 నిమిషాల వ్యవధి తర్వాత ఈవీఎంల సీల్ తెరుస్తారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం...ప్రతి పార్లమెంట్ స్థానంలో 10 సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారు. లెక్కింపు ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. అయితే ఎన్నికల అధికారులు ల్యాప్‌టాప్, ఇతర పరికరాలను ఉపయోగించి ఫలితాలను పంపిస్తారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల కమిషన్ అధికారులను మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఇతరులెవ్వరికీ ప్రవేశం ఉండదు. మీడియాకు కూడా అనుమతి ఉండదని దేవ్ వివరించారు. అయితే మొత్తం లెక్కింపు ప్రక్రియను అంతా వీడియో తీస్తారని చెప్పారు. మంగళవారం, బుధవారం మిగతా కౌంటింగ్ కేంద్రాలను సందర్శిస్తానని తెలిపారు. కాగా, 150 మంది అభ్యర్థుల భవిత్యవాన్ని నిర్దేశించే 20వేల ఈవీఎంలు పటిష్ట భద్రత కలిగిన స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రంగా ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ లోపల కేంద్ర పారామిలటరీ బలగాలు, బయట ఢిల్లీ పోలీసులు పహారా కాస్తున్నారని దేవ్ తెలిపారు. ఏప్రిల్ పదిన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 65.09 శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే. -
అసాధ్యమేమీ కాదు!
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం మందిని పోలింగ్ బూత్‌లకు రప్పించడం అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై దేవ్ మీడియాతో మాట్లాడుతూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్యాన్ని దాదాపుగా అందుకున్నాం. అంచనాలకు మించి 66 శాతం పోలింగ్ నమోదుకావడం గొప్పవిషయమే. డిసెంబర్ ఎన్నికల తర్వాత నమోదైన పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ సాధించడం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. లక్ష్యాన్ని అందుకోవడానికి మా వ్యూహాలు మాకున్నాయి. ఇదేమీ ‘మిషన్ ఇంపాజిబుల్’ కాదు. లోక్‌సభ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఏమంత మెరుగ్గా లేదు. దీంతో ఎక్కడ తక్కువ ఓటింగ్ నమోదైందనే విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాలపై ఎక్కువ దృష్టిని సారించాలని నిర్ణయించాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినవారందరిని పోలింగ్ కేంద్రాలకు రప్పించినా 65 శాతం దాటే అవకాశముంది. మరికొంత కష్టపడితే సునాయాసంగా 70 శాతం దాటవచ్చు. ఇదేమంత కష్టమేమీ కాదు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి మొదటివారంలో ప్రకటించే అవకాశముంది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. దానిపై కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఏదైనా మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపే నిర్వహించే పరిస్థితి వస్తే మా పనితీరును మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంద’న్నారు. ఇక భద్రత విషయం గురించి మాట్లాడుతూ... ‘ఇటీవల పార్లమెంటరీ భద్రతా దళాల అధికారులతో సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహిస్తారు? అందుకు ఎంతమంది భద్రత సిబ్బంది కావాలనే విషయం చర్చకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 107 కంపెనీల పారామిలటరీ బలగాలు భద్రతా విధులను నిర్వర్తించాయి. అప్పడు కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు ఉండడంతో పెద్దగా సమస్య ఎదురుకాలేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఢిల్లీతోసహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అదనపు బలగాల కోసం డిమాండ్లు వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటరీ భద్రతా దళాలను రంగంలోకి దించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంద’న్నారు. ఇక ఎన్నికల సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి బీటెక్ పట్టాదారుడైన దేవ్ మాట్లాడుతూ... ‘ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ నుంచే అన్ని పోలింగ్ బూత్‌ల ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది విజయవంతంగా అమలైంది. ప్రతి ఓటు స్క్రీన్‌పై కనిపించేలా టెక్నాలజీని ఉపయోగించుకున్నామ’న్నారు. -
పెయిడ్ న్యూస్ కేసులో 9 మంది
సాక్షి, న్యూఢిల్లీ: పెయిడ్ న్యూస్‌ను నివారించడం కోసం ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపట్టినప్పటికీ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో పలు పెయిడ్ న్యూస్ కేసులు ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయి. ఢిల్లీ రవాణాశాఖ మంత్రి అర్విందర్ సింగ్ లవ్లీతోపాటు 9 మంది అభ్యర్థులను ఈసీ పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా నిర్ధారించింది. వీరిలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. అంతేకాక పెయిడ్ న్యూస్ ప్రచురించిన పత్రికలపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. పెయిడ్ న్యూస్ కేసులో కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, సుశీల్ గుప్తా, ముఖేష్ శర్మలను దోషులుగా నిర్ధారించింది. లవ్లీ గాంధీనగర్ నుంచి, గుప్తా మోతీనగర్ నుంచి , శర్మ ఉత్తంనగర్ నుంచి పోటీచేశారు. బీజేపీ చెందిన నీల్ దమన్ ఖత్రీ, జయ్‌ప్రకాశ్, మనోజ్ షౌకీన్, రాజీవ్ బబ్బర్‌లను కూడా పెయిడ్ న్యూస్ కేసులో దోషులుగా గుర్తించారు. ఖత్రీ నరేలా నుంచి, జయ్‌ప్రకాశ్ సదర్ బజార్ నుంచి, షౌకీన్ నంగ్లోయ్ జాట్ నుంచి, బబ్బర్ తిలక్ నగర్ నుంచి పోటీచేశారు. బీఎస్పీకి చెందిన ధీరజ్‌కుమార్ టోకస్, సలీం సైఫీలను కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. టోకస్ ఆర్కేపురం నుంచి, సైఫీ నంగ్లోయ్ జాట్ నుంచి పోటీచేశారు. పెయిడ్ న్యూస్ ఆరోపణలు రావడంతో ఈ అభ్యర్థులకు నోటీసులు పంపామని, అయితే వారిచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు చేపట్టామని ఎన్నికల ప్రధానాధికారి విజయ్‌దేవ్ చెప్పారు. పెయిడ్ న్యూస్ కోసం వారు చేసిన ఖర్చును వారి ఎన్నికల వ్యయంలో చేర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల కోసం వారు చేసిన మొత్తం ఖర్చును పరిశీలించి నిర్ధారిస్తామని, వారి వ్యయం పరిమితిని మించినట్లయితే గెలిచిన అభ్యర్థుల ఎన్నికను రద్దు చేస్తామని ఆయన చెప్పారు. పెయిడ్ న్యూస్‌కు సంబంధించి 60 ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని ఆయన చెప్పారు. వాటిలో 8 ఆరోపణలు పెయిడ్ న్యూస్ కావని తేల్చామని, 28 కేసులలో నోటీసులు జారీ చేశామని, మరో 24 కేసులలో నోటీసులు జారీచేయవలసి ఉందన్నారు. -
కొత్త ఓటర్లు 3.49 లక్షలు
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న విధాన సభ ఎన్నికల్లో 3.49 లక్షల మంది యువతీయువకులు తొలిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియలో యువతను భాగస్వాములను చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, ఫలితంగానే కొత్త ఓటర్ల సంఖ్య ఈసారి భారీగా పెరిగిందని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారి విజయ్ దేవ్ తెలిపారు. ఈ విషయమై బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువత తమ ఓటుహక్కును వినియోగించుకునేలా నగరంలోని 863 విద్యాసంస్థల్లో ప్రత్యేక ప్రచారకులను ఎన్నికల సంఘం నియమించింది. 110 శిబిరాలను నిర్వహించి, ఓటు హక్కు విలువను యువతకు వివరించాం. ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజెప్పాం. ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్ నుంచే ప్రారంభమైంది. మహిళా ఓటర్లు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 324 శిబిరాలను నిర్వహించాం. మహిళలు కూడా ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పు వస్తుందో తెలిజెప్పాం. ఇళ్లు లేని నిరాశ్రయులను 7,249 మందిని గుర్తించి, ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేశాం. అభ్యర్థుల ఖర్చుకు కళ్లెం... ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుకు కళ్లెం వేసేందుకు అత్యధిక వ్యయ పరిమితిని రూ. 14 లక్షలుగా నిర్ణయించాం. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వ్యక్తీ విధిగా బ్యాంకు ఖాతాను తెరిచి, వాటి ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు వివరాలను నామినేషన్ సమయంలోనే ఎన్నికల అధికారికి సమర్పించాలి. అంతేకాక ఎన్నికల ఖర్చుకు సంబంధించి అభ్యర్థి ఓ రిజిస్టర్‌ను నిర్వహించాలి. దానిలో ఎప్పటికప్పుడు ఖర్చుల వివరాలను పొందుపర్చాలి. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే డబ్బులు పంచినవారితోపాటు డబ్బులు తీసుకున్నవారు కూడా శిక్షార్హులవుతారు. వారికి కనీసం ఏడాదిపాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ విషయమై ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఇక ఓటు వేసే అభ్యర్థులకు వారి ఫొటో, వివరాలు ఉన్న పత్రాలన్ని ముందుగానే ఇస్తారు. వీటిని గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చు. ఓటర్లు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో? లేదో? ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం 9211728082 నంబర్‌కు డయల్ చేయాలి. ఈ సదుపాయాన్ని జూలైలోనే ప్రారంభించాం. ఇప్పటిదాకా 36,952 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కాగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 35,000 మందితోపాటు పోలీసు శాఖలో పనిచేస్తున్న 9,000 మంది తమ పేర్లను నమోదు చేసుకోలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. వీరందరిని కూడా ఓటర్ల జాబితాలోకి తీసుకొస్తాం. ఇక ఢిల్లీ ఓటరుజాబితాలో 154 మంది వంద సంవత్సరాలు దాటినవారుండగా 68,392 మంది ఎనభై సంవత్సరాలు దాటినవారున్నారు. ఓటరు సరైన అభ్యర్థిని ఎన్నుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇందుకు ఓటరుకు సాయపడేందుకు అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఇకపై ఓటర్లు బారులు తీరాల్సిన అవసరం లేదు. వారు కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాక తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఈ విధానసభ ఎన్నికల కోసం 2,603 ప్రాంతాల్లో 11,763 పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశాం. వీటిలో 634 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామ’ని చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు.. వేధింపులు, నేరపూరిత కుట్ర, మోసం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముకుల్ మన్రాయ్, ఆజాద్ సింగ్, పవన్ కుమార్, ప్రేమ్చంద్లపై ఢిల్లీ ఎన్నికల సంఘం శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించింది.