అసాధ్యమేమీ కాదు! | not possible in 70 per cent Lok Sabha elections polling say : Vijay Dev | Sakshi
Sakshi News home page

అసాధ్యమేమీ కాదు!

Published Tue, Feb 25 2014 10:47 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

అసాధ్యమేమీ కాదు! - Sakshi

అసాధ్యమేమీ కాదు!

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం మందిని పోలింగ్ బూత్‌లకు రప్పించడం అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, లోక్‌సభ ఎన్నికల్లో కూడా సాధిస్తామనే ధీమా  వ్యక్తం చేశారు. ఈ విషయమై దేవ్ మీడియాతో మాట్లాడుతూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్యాన్ని దాదాపుగా అందుకున్నాం. అంచనాలకు మించి 66 శాతం పోలింగ్ నమోదుకావడం గొప్పవిషయమే. డిసెంబర్ ఎన్నికల తర్వాత నమోదైన పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ సాధించడం అసాధ్యమేమీ కాదనిపిస్తోంది. లక్ష్యాన్ని అందుకోవడానికి మా వ్యూహాలు మాకున్నాయి.
 
 ఇదేమీ ‘మిషన్ ఇంపాజిబుల్’ కాదు. లోక్‌సభ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఏమంత మెరుగ్గా లేదు. దీంతో ఎక్కడ తక్కువ ఓటింగ్ నమోదైందనే విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాలపై ఎక్కువ దృష్టిని సారించాలని నిర్ణయించాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినవారందరిని పోలింగ్ కేంద్రాలకు రప్పించినా 65 శాతం దాటే అవకాశముంది. మరికొంత కష్టపడితే సునాయాసంగా 70 శాతం దాటవచ్చు. ఇదేమంత కష్టమేమీ కాదు. ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
 
 లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి మొదటివారంలో ప్రకటించే అవకాశముంది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారా? అనే ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. దానిపై కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఏదైనా మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపే నిర్వహించే పరిస్థితి వస్తే మా పనితీరును మరింత వేగవంతం చేయాల్సి ఉంటుంద’న్నారు. ఇక భద్రత విషయం గురించి మాట్లాడుతూ... ‘ఇటీవల పార్లమెంటరీ భద్రతా దళాల అధికారులతో సమావేశం జరిగింది. లోక్‌సభ ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహిస్తారు? అందుకు ఎంతమంది భద్రత సిబ్బంది కావాలనే విషయం చర్చకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 107 కంపెనీల పారామిలటరీ బలగాలు భద్రతా విధులను నిర్వర్తించాయి. అప్పడు కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు ఉండడంతో పెద్దగా సమస్య ఎదురుకాలేదు.
 
 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఢిల్లీతోసహా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అదనపు బలగాల కోసం డిమాండ్లు వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా పార్లమెంటరీ భద్రతా దళాలను రంగంలోకి దించేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంద’న్నారు. ఇక ఎన్నికల సమయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి బీటెక్ పట్టాదారుడైన దేవ్ మాట్లాడుతూ... ‘ఎన్నికలు జరిగే పోలింగ్ బూత్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ నుంచే అన్ని పోలింగ్ బూత్‌ల ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది విజయవంతంగా అమలైంది. ప్రతి ఓటు స్క్రీన్‌పై కనిపించేలా టెక్నాలజీని ఉపయోగించుకున్నామ’న్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement