న్యూఢిల్లీ: ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సోమవారం పరిశీలించారు. ఈ మేరకు రెండు పార్లమెంటరీ స్థానాల కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. న్యూఢిల్లీ పార్లమెంట్ స్థానంలోని గోలే మార్కెట్ ఎన్‌పీ బెంగాలి గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌తో పాటు ద్వారకా సెక్టార్-9లోని ఇంటిగ్రేటెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవ్ మాట్లాడుతూ...న్యూఢిల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలకు శుక్రవారం ఉదయం ఏడు గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారని, 30 నిమిషాల వ్యవధి తర్వాత ఈవీఎంల సీల్ తెరుస్తారని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం...ప్రతి పార్లమెంట్ స్థానంలో 10 సూక్ష్మ పరిశీలకులు ఉంటారని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారు. లెక్కింపు ప్రాంగణంలో మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. అయితే ఎన్నికల అధికారులు ల్యాప్‌టాప్, ఇతర పరికరాలను ఉపయోగించి ఫలితాలను పంపిస్తారు. కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, సూక్ష్మ పరిశీలకులు, ఎన్నికల కమిషన్ అధికారులను మాత్రమే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఇతరులెవ్వరికీ ప్రవేశం ఉండదు. మీడియాకు కూడా అనుమతి ఉండదని దేవ్ వివరించారు.
అయితే మొత్తం లెక్కింపు ప్రక్రియను అంతా వీడియో తీస్తారని చెప్పారు. మంగళవారం, బుధవారం మిగతా కౌంటింగ్ కేంద్రాలను సందర్శిస్తానని తెలిపారు. కాగా, 150 మంది అభ్యర్థుల భవిత్యవాన్ని నిర్దేశించే 20వేల ఈవీఎంలు పటిష్ట భద్రత కలిగిన స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రంగా ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ లోపల కేంద్ర పారామిలటరీ బలగాలు, బయట ఢిల్లీ పోలీసులు పహారా కాస్తున్నారని దేవ్ తెలిపారు. ఏప్రిల్ పదిన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 65.09 శాతం ఓటింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన విజయ్‌దేవ్
Published Mon, May 12 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement