రామేశ్వరం : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా చేపలు పడుతున్న 31 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం ఆదివారం వెల్లడించింది. వారికి చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకుని... సీజ్ చేసినట్లు తెలిపింది. ఈ వార్తను తమిళనాడు మత్స్యశాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు.
అరెస్ట్ అయిన 31 మంది మత్య్సకారులు తమిళనాడుకు చెందిన వారేనని చెప్పారు. వారిలో 22 మంది ట్యూటికారన్, మరో తొమ్మిది మంది రామేశ్వరంకు చెందిన వారని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మార్చి 3వ తేదీన తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 66కు పెరిగింది.