ఢిల్లీ ఎన్నికల బరిలో 33 శాతం మంది కోటీశ్వరులే!
Published Wed, Nov 27 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులే. వీరిలో అతి సంపన్ను డైన అభ్యర్థి ఆస్తి 235 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా చూస్తే... రాజోరీ గార్డెన్ నుంచి పోటీచేస్తున్న మంజిందర్ సిర్సా అతి సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.235.5 కోట్లు. సిర్సా తరువాత స్థానంలో సుశీల్ గుప్తా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన గుప్తా ఆస్తుల విలువ రూ.164 కోట్లు. ఢిల్లీ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలను పరిశీలించిన ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులని తేల్చింది. ఐదేళ్ల కిందట అభ్యర్థి సగటు ఆస్తి 1.7 కోట్ల రూపాయలు ఉండేదని, ఇప్పుడది రూ.3.43 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 14 కోట్ల రూపాయలుంది. బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.8 కోట్లు. సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2.5 కోట్లు ఉంది.
నేరారోపణలు ఎదుర్కొంటన్నవారిలో బీజేపీ ముందు..
గత ఐదేళ్లలో అభ్యర్థులపై క్రిమినల్ రికార్డుల సంఖ్య కూడా 14 నుంచి 16 శాతానికి పెరిగిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 129 మంది అభ్యర్థులపై.. అంటే 16 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 93 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో 15 మందిపై, బీజేపీ అభ్యర్థులలో 31 మందిపై, బీఎస్పీ అభ్యర్థులలో 14 మందిపై, ఆప్ అభ్యర్థులలో ఐదుగురిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా ప్రజలను పాలిస్తామని నమ్మబలుకుతూ ఎన్నికల్లో నిల్చుంటున్నవారు కోట్లు కూడబెట్టిన వారు, కేసుల్లో ఇరుకున్నవారని తెలిసినా ప్రజలకు వారికే పట్టం కడుతున్నారని, అలాంటివారిని తిరస్కరించే అవకాశం ఈసారి ఓటర్లకు ‘నోటా’ బటన్ ద్వారా వచ్చిందని నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Advertisement
Advertisement