crorepatis
-
Rajasthan Elections 2023: ఇక్కడ 651 మంది అభ్యర్థులు కోటీశ్వరులే!
రాజస్థాన్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కళంకిత అభ్యర్థులతో పాటు కోటీశ్వరులైన నేతల సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల్లో ఈసారి ఏకంగా 651 మంది కోటీశ్వరులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ. 3.12 కోట్లు కాగా, గత ఎన్నికల్లో ఇది రూ. 2.12 కోట్లు. అభ్యర్థులు సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ల విశ్లేషణ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. కోటీశ్వరులైన అభ్యర్థుల్లో బీజేపీ నుంచి 160 మంది, కాంగ్రెస్ నుంచి 149 మంది ఉన్నారు. ఎనిమిది మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. చురు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండెలియా అత్యంత సంపన్న అభ్యర్థి. ఆయన ఆస్తుల విలువ రూ.166 కోట్లు. ఆయన తర్వాత నీమ్‌కథానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజౌర్ రూ.123 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నింబహెరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉదయ్‌లాల్ అంజన మూడో స్థానంలో నిలిచారు. ఇక కేసుల విషయానికి వస్తే.. ఈసారి 236 మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. వీరిలో బీజేపీకి చెందిన 42 మంది, కాంగ్రెస్‌కు చెందినవారు 34 మంది, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ అభ్యర్థులు 24 మంది ఉన్నారు. అలాగే ఆప్‌కు చెందినవారు 15 మంది, సీపీఎంకు చెందిన 12 మంది, బీఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కోటీశ్వరులు పెరిగారు.. లక్షాధికారులు తగ్గారు!
I-T returns filed for income above Rs 1 crore: దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఇది కోవిడ్ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది. మరోవైపు అదే కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు, 2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి. అల్పాదాయ వర్గాలపై కోవిడ్ దెబ్బ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్ రిటర్న్స్ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి. -
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు; విస్తుగొలిపే నిజాలు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. నేర చరితులకు పెద్దపీట ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. 6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. పోటీలో కోటీశ్వరులు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్ఎల్డీ(66), ఎన్పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ టాప్.. బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్ఎల్డీ(32), ఎన్పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి. మహిళలకు దక్కని ప్రాధాన్యం ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా) కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు.. వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?) -
ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!
500 Indian Employees Just Turned Crorepatis: భారత సంతతికి చెందిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ సంస్థ నాస్డాక్లో లిస్టింగ్ చేసిన ఒక్కరోజులోనే కంపెనీల షేర్లు 32 శాతం మేర పెరిగాయి. నాస్డాక్ ట్రేడింగ్‌లో బుధవారం రోజున ఫ్రెష్‌వర్క్స్ కంపెనీ షేర్లు 47.55 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 13 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా ఫ్రెష్‌వర్క్స్ కంపెనీలోని సుమారు 500 మంది భారతీయ ఉద్యోగులు ఒక్కరోజులోనే కోటీశ్వరులైనారని కంపెనీ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృబూతం వెల్లడించారు. అందులో సుమారు 70 మంది ఉద్యోగులు 30 ఏళ్ల లోపు వారే. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు 4300 ఉద్యోగులున్నారు. సుమారు 76 శాతం మంది ఉద్యోగులు ఫ్రెష్‌వర్క్స్ షేర్లను కలిగి ఉన్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీగా...సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్ దేశాలు...! నాస్డాక్ స్టాక్ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేసిన భారతీయ సాఫ్ట్వేర్ సంస్థగా ఫ్రెష్‌వర్క్ నిలిచింది. ఫ్రెష్ వర్క్స్ సంస్థను 2010లో భారత్‌లో గిరీష్ మాతృబూతం, షాన్ కృష్ణసామి స్థాపించారు. కస్టమర్లకు మరింత దగ్గరవ్వడం కోసం కొద్ది రోజుల క్రితమే భారత్ నుంచి అమెరికాకు ఫ్రెష్‌వర్క్స్‌ను యాజమాన్యం తరలించింది. ఇప్పుడు కాలిఫోర్నియాలోని శాన్ మేటియోలో, చెన్నైలో గణనీయమైన ఉద్యోగులను ఫ్రెష్‌వర్క్స్ కలిగి ఉంది. ఆక్సెల్ , సీక్వోయా క్యాపిటల్ వంటి పెట్టుబడిదారుల నుండి నిధులను ఫ్రెష్‌వర్క్స్ సేకరించింది. ఇన్ఫోసిస్, విప్రో, డబ్ల్యుఎన్ఎస్, డాక్టర్ రెడ్డిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి డజనుకు పైగా నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన భారతీయ కంపెనీలలో ఫ్రెష్‌వర్క్స్ ఒకటిగా నిలవనుంది,. 1999లో నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో జాబితా చేసిన మొదటి భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ తన పేరిట ఆ రికార్డు కలిగి ఉంది. చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన ఫ్రెష్‌వర్క్స్ ఐటీ కంపెనీ -
ముగ్గురు కేబీసీ కోటీశ్వరులు
తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్మెంట్. ఆ ‘కోటి’ ఘనతను సాధించిన ముగ్గురూ మహిళలే కావడం విశేషం. కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) గేమ్ షోలో హోస్ట్ అమితాబ్ బచన్ ఎదురుగా ఉండే హాట్ సీట్‌ను టీవీలో మీరు చూసే ఉంటారు. ఆయన నింపాదిగా నవ్వుతూ కనిపిస్తుంటారు. హాట్ సీట్లో కూర్చున్నవాళ్లు చప్పుడు లేకుండా, ఆవిరి యంత్రం పనిచేస్తున్నట్లుగా ఉంటారు. కరెక్టు సమాధానాలు చెప్పుకుంటూ పోతుంటే ప్రైజ్‌మనీ పెరుగుతూ పోతోంది. ఒక్క తప్పు సమాధానం చెప్పినా అమౌంట్ డౌన్ అయిపోతోంది. ‘వచ్చిందే చాలులే’ అని, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాళ్లూ ఉంటారు. ఈ గేమ్ షోలో చివరి వరకు కరెక్టు సమాధానాలన్నీ చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ ఏడాది కేబీసీ సీజన్– 12 సెప్టెంబర్ చివరిలో మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభంలో స్టార్ టీవీ ప్రసారం చేసిన ఈ షోను 2010 నుంచీ సోనీ టీవీ ఇస్తోంది. ఇప్పుడీ తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్మెంట్. ఆ ఘనతను ఈ సీజన్లో తొలిసారి నవంబర్ పదకొండున 20 ఏళ్ల నజియా నసీం సాధించారు. కోటి సాధించిన తక్కిన ఇద్దరూ కూడా మహిళలే. మోహితా శర్మ నవంబర్ పద్దెనిమిదిన, నవంబర్ ఇరవై ఐదున అనుపాదాస్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. 42 ఏళ్ల అనుప స్కూల్ టీచర్. చత్తీస్‌గఢ్ నుంచి వచ్చారు. తల్లికి క్యాన్సర్ చికిత్స చేయించడం కోసం కొంతకాలంగా ఆమె ముంబైలో ఉంటున్నారు. 31 ఏళ్ల మోహితా శర్మ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెది ఢిల్లీ. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగం. తొలి కోటి విజేత నజియా నసీమ్ ఢిల్లీలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. కేబీసీ గేమ్ షోలో మొత్తం పదహారు ప్రశ్నలు ఉంటాయి. పదహారు ప్రశ్నలకూ కరెక్టుగా సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. కోటి రూపాయలు గెలుచుకోవడం కూడా తేలికేం కాదు. పదిహేనవ ప్రశ్న వరకు వెళ్లాలి. పదిహేనవ ప్రశ్నకు కరెక్టు జవాబు చెప్పాలి. అంటే.. కోటికీ, ఏడు కోట్లకు మధ్య ఉన్న తేడా ఒకే ఒక ప్రశ్న. సింగపూర్‌లో సుభాష్ చంద్రబోస్ ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ప్రకటించిన ప్రదేశం ఏమిటి? అన్నది తొలి కోటి విజేత నజియా నసీమ్‌కు ఎదురైన ఏడు కోట్ల ప్రశ్న. ఆప్షన్ ఎ) క్యాథీ సినిమా హాల్, బి) ఫోర్ట్ క్యానింగ్ పార్క్, సి) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, డి) నేషనల్ గ్యాలరీ ఆఫ్ సింగపూర్. (ఆన్సర్ క్యాథీ సినిమా హాల్). నజియాకు కరెక్టుగా తెలీదు. ఊగిసలాట ఎందుకని క్విట్ అయ్యారు. కోటి తీసుకుని గేమ్ నుంచి నిష్క్రమించారు. రెండో కోటి విజేత మోహితా శర్మకు పదహారవ ప్రశ్నగా ఇంకాస్త కఠినమైన పరీక్షే ఎదురైంది. ముంబైలోని వాడియా గ్రూపు 1817లో నిర్మించిన ఈ కింది నాలుగు బ్రిటిష్ వార్ షిప్‌లలో అతి పురాతనమైనది ఏది? అనేది ఆ ప్రశ్న. ఆప్షన్ ఎ) హెచ్ఎంఎస్ మిండెన్, బి) హెచ్ఎంఎస్ కార్న్వాలిస్, సి) హెచ్ఎంఎస్ ట్రింకోమలి, డి) హెచ్ఎంఎస్ మియానీ. (కరెక్ట్ ఆన్సర్ హెచ్ఎంఎస్ ట్రింకోమలి). ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం తెలియక మోహితా కూడా క్విట్ అయే అవకాశాన్నే ఎంచుకుని కోటీశ్వరిగా హాట్ చెయిర్ దిగారు. మూడో కోటి విజేత అనుపను కంప్యూటర్ అడిగిన ఏడు కోట్ల ప్రశ్న కూడా మరీ అంత సులభమైనదేమీ కాదు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ దేశపు జట్టుకు రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాన్వాలా ప్రాతినిధ్యం వహించారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఎ) కెన్యా, బి) యు.ఎ.ఇ., సి) కెనడా, డి) ఇరాన్. కరెక్ట్ ఆన్సర్ యు.ఎ.ఇ. అనుప యు.ఎ.ఇ. అనే చెబుదామనుకుని కూడా రిస్క్ ఎందుకని క్విట్ అయి కోటితో సరిపెట్టుకున్నారు. ఏమైనా ఈ ముగ్గురూ సాధించిన విజయం సాధారణమైనది ఏమీ కాదు. చూడాలి ఏడు కోట్ల రూపాయల విజేత కూడా ఒక మహిళే అవుతారేమో. -
కేబీసీ 12 రికార్డు.. కోటీశ్వరులైన ముగ్గురు స్త్రీలు
కౌన్ బనేగా కరోడ్‌పతి.. సింపుల్‌గా చెప్పాలంటే కేబీసీ.. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఈ షోకు విపరీతమైన క్రేజ్. దాదాపు కొన్ని లక్షల మంది 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. కానీ కొందరు అదృష్టవంతులు మాత్రమే హాట్ సీటు వరకు చేరుకుంటారు. ఇక కేబీసీ సీజన్ 12 నెల రోజుల క్రితం ప్రారంభమయ్యింది. అయితే ఈ సీజన్‌కు, మిగతా సీజన్లకు మధ్య ఓ తేడా ఉంది. ఈ సీజన్ ప్రారంభమైన నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు మహిళలు కోటీశ్వరులుగా నిలిచారు. మరో విశేషం ఏంటంటే వీరంతా కేబీసీ ప్రారంభమైన నాటి నుంచి అంటే 20 ఏళ్లుగా దీనిలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అవకాశం రావడం.. కోటీశ్వరులుగా మారడం నిజంగా గ్రేటే. ఇక ఈ సీజనల్లో ఇప్పటి వరకు కోటీశ్వరులుగా నిలిచిన ఆ ముగ్గురు మహిళలు ఎవరంటే నాజియా నజీమ్, రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ, మూడవ కోటీశ్వరురాలు అనుప దాస్. ఇక ఈ ముగ్గురు కోటీశ్వరుల గురించి క్లుప్తంగా ఓ సారి చూద్దాం. మొదటి కోటీశ్వరురాలు నాజియా నసీమ్ కేజీబీ సీజన్ 12లో తొలి కోటీశ్వరురాలు నాజియా నసీమ్. ఢిల్లీకి చెందిన నాజియా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కేబీసీలో పాల్గొన్న ఆమె ఈ నెల 11న సీజన్లో తొలి కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక ఆమె ఆట తీరును బిగ్ బీ సైతం ఎంతో ప్రశంసించారు. NAZIA NASIM is #KBC12’s first crorepati ! Watch this iconic moment in #KBC12 on 11th Nov 9 pm only on Sony @SrBachchan@SPNStudioNEXT pic.twitter.com/6qG8T3vmNc — sonytv (@SonyTV) November 5, 2020 రెండవ కోటీశ్వరురాలు మోహితా శర్మ కేబీసీ సీజన్లో 12లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ రెండవ కోటీశ్వరురాలిగా నిలిచారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మోహితా కేబీసీ 12లో రెండో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే మోహిత భర్త గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ అదృష్టం ఆయన భార్యని వరించింది. (చదవండి: ‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’) మూడవ కోటీశ్వరురాలు అనుపదాస్ ఇక చత్తీస్‌గఢ్‌కు చెందిన స్కూల్ టీచర్ అనుపదాస్ ఈ సీజన్లో ఇప్పటివరకు కోటీ రూపాయలు గెలుచుకున్న మూడవ మహిళగా నిలిచారు. నిన్నటి ఎపిసోడ్లో అనుప దాస్ ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గేమ్ నుంచి క్విట్ అయ్యి కోటి రూపాయలతో కోటీశ్వరురాలిగా నిలిచారు. ఈమె కూడా గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆమెపై ప్రశంసలు కురిపించారు. చాలా బాగా ఆడారని మెచ్చుకున్నారు. వీరు ముగ్గురు ఈ సీజన్లో ఇప్పటి వరకు కోటి రూపాయలు గెలుచుకున్న మహిళలుగా నిలిచారు. కేబీసీలో తొలి కోటేశ్వరురాలు ఎవరంటే కేబీసీ 12 సీజన్లలో మొదటి సారి కోటీశ్వరురాలిగా నిలిచిన మహిళ ఎవరంటే రహత్ తస్లీమ్. 2010లో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కేబీసీలో అప్పటి వరకు ఏ మహిళ కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. రహత్ తస్లీమ్ మెడిసిన్ చదవాలని భావించారు. కానీ చిన్న వయసులోనే వివాహం కావడంతో ఆ కోరిక తీరలేదు. ఇక కేబీసీలో గెలిచిన సొమ్ముతో ఆమె తన కలను నేరవేర్చుకుంటానని తెలిపారు. (చదవండి: 7 కోట్ల రూపాయల ప్రశ్నకు జవాబు ఇదే?) రూ.5 కోట్లు గెలిచిన మహిళ ఎవరంటే.. సన్మిత్ కౌర్ కేబీసీ చరిత్రలో తొలిసారి ఏకంగా ఐదు కోట్లు రూపాయలు గెలిచిన మహిళగా రికార్డు సృష్టించారు. ఆరవ సీజన్లో సన్మిత్ ఈ రికార్డు సృష్టించారు. ముంబైకి చెందిన సన్మిత్ తన కుమార్తె ప్రొత్సాహం వల్ల దీనిలో పాల్గొన్నానని తెలిపారు. కేబీసీలో కోటి గెలిచిన ఇతర మహిళలు ఎవరంటే.. ఫిరోజ్ ఫాతిమా: కేబీసీ సీజన్ 7 లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళా పోటీదారుగా ఫిరోజ్ ఫాతిమా నిలిచారు. ఫిరోజ్ తన తండ్రి చికిత్స కోసం ఆమె కుటుంబం తీసుకున్న రుణాన్ని చెల్లించడానికిగాను దీన్ని వినియోగిస్తానని తెలిపారు. అనామికా మజుందార్: జంషెడ్‌పూర్‌లో ఎన్జీఓను నిర్వహిస్తున్న ఒక సామాజిక కార్యకర్త, అనామికా కేబీసీ తొమ్మిదవ సీజన్లో కోటిశ్వరురాలు అయ్యారు. పోటీలో గెలిచేందుకు ఆమె తన కొడుకుతో కలిసి చదువుకునేదాన్నని తెలిపారు. (కేబీసీ : ఈ సీజన్లో ఇదే తొలిసారి) బినిత జైన్: జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన బినిత జైన్ తన పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును ఇవ్వడానికి కేబీసీకి వచ్చినట్లు తెలిపారు. 10వ సీజన్లో ఆమె కోటి రూపాయలు గెలుచుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఆమెని గొప్ప సింగిల్ పేరెంట్ అని ప్రశంసించారు. బబితా తడే: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన బబితా, కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 11 లో కోటీశ్వరురాలు అయ్యారు. వృత్తిరీత్యా మధ్యాహ్నం భోజనం వండే బబిత పాఠశాల విద్యార్థులకు కిచిడీ తయారు చేయడం ద్వారా నెలకు 1,500 రూపాయలు సంపాదించేవారు. ఆమె అంకితభావానికి హోస్ట్ అమితాబ్ బచ్చన్ ముచ్చటపడ్డారు -
3రోజుల్లో.. 70 మంది కోటీశ్వరులయ్యారు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించిన బిగ్ బిలయన్ డే సేల్‌లో భారీగా ఆర్డర్లు నమోదయ్యాయి. దసరా, దీపావళి పండుగలకు ముందు భారీ ఆఫర్లు, తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాలను ఈనెల 16 నుంచి చేపట్టిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు ‘బిగ్ బిలియన్ డే సేల్’ పేరుతో అమ్మక కార్యక్రమం చేపట్టింది. అయితే ఇది మొదలైన మూడు రోజుల్లోనే 70 మంది అమ్మకందారులు కోటీశ్వరులైనట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలానే మరో 10 వేల మంది అమ్మకందారులు లక్షాధికారులు అయినట్లు వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం బిగ్‌బిలియన్ డే సేల్ మూడు రోజుల్లో ప్లాట్‌ఫామ్‌లోని అమ్మకందారులకు మంచి బిజినెస్ లభించింది. ఇక మొదటి మూడు రోజుల్లో తన వేదికపై 3 లక్షలకు పైగా విక్రేతలకు ఆర్డర్లు లభించినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఆర్డర్లలో 60 శాతం టైర్–2 (ద్వితీయ శ్రేణి), అంతకంటే చిన్న పట్టణాలవే ఉన్నట్టు పేర్కొంది. (చదవండి: 12 గంటల్లో 1.75 లక్షల ఫోన్ల అమ్మకం) ''ఈ ఏడాది విక్రయదారుల సంఖ్య 20శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 3,000కు పైగా పిన్కోడ్లకు సేవలు అందిస్తున్నాము. 2020 బిగ్ బిలియన్‌డేస్ తొలి రెండు రోజుల్లో విక్రేతలు.. 2019 బిగ్‌బిలియన్ డేస్ కార్యక్రమంలో ఏడు రోజుల విక్రయాలను మించి వృద్ధిని చూశారు’’ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. తొలి 3 రోజుల్లో ఈఎంఐ, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్ ద్వారా కస్టమర్లు చేసిన ఖర్చు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ ఏడాది అత్యవసరమైన ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని.. ముఖ్యంగా గృహోపకరణాలు, వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి ఎక్కువ ఆర్డర్లు లభించాయని తెలిపింది. అలానే సాధారణ రోజుల్లో పోల్చితే పండగ సీజన్లో డిజిటల్ చెల్లింపులు లావాదేవీలు 60 శాతం పెరిగాయన్నది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపారు. దాంతో అమ్మకాలు భారీగా జరిగాయి. -
ఇది కోటీశ్వరుల మంత్రిమండలి!
సాక్షి ముంబై : మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన మహావికాస్ ఆఘాడి మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో 41 మంత్రులు కోటీశ్వరులే ఉన్నారు. తొలిసారిగా పోటీ చేసిన సహాయక మంత్రి అదితి తట్కరే మాత్రం లక్షాధికారిగానే నిలవడం గమనార్హం. ఆమె మినహా మిగతా 41 మంది మంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ. 21.9 కోట్లు ఉందని సమాచారం. ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్’ అనే సంస్థ మహారాష్ట్రలోని మంత్రుల ఆస్తులతోపాటు నేరచరిత్రకు సంబంధించిన వివరాలు ఇతర వివరాలను వెల్లడించింది. ఎన్నికల సమయంలో నామినేషన్లను ప్రకటించిన వివరాల మేరకు ఈ సంస్థ ఓ రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ వివరాల మేరకు 42 మంది మంత్రులలో కాంగ్రెస్‌కు చెందిన విశ్వజీత్ కదం అత్యధిక సంపన్నుడిగా తెలిసింది. ఆయన ఆస్తులు రూ. 216 కోట్లు కావడం విశేషం. 2014లో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోకంటే ఈ సారి మంత్రి మండలిలో 82 శాతం మంత్రులు కోటీశ్వరులున్నారు. వీరిలో ముగ్గురు అత్యధికంగా తమ ఆస్తులను ప్రకటించినవారిలో ఉన్నారు. విశ్వజీత్ కదం రూ. 216 కోట్లు, అనంతరం ద్వితీయ స్థానంలో ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ. 75 కోట్లు, ఆతర్వాత ఎన్సీపీ నేత రాజేష్ టోపే రూ. 53 కోట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోటీశ్వరుడా లేదా అనేది తెలియరాలేదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియరాలేదు. అదేవిధంగా తొలిసారిగా పోటీ చేసిన ఎన్సీపీ నేత సునీల్ తట్కరే కూతురు అదితి తట్కరే ఆస్తులు మాత్రం రూ. 39 లక్షలున్నాయని ప్రకటించారు. వార్షిక ఆదాయంలో అజిత్ ప్రథమం.. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో రూ. 3.86 కోట్ల వార్షిక ఆదాయంతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన అనంతరం దివంగత కాంగ్రెస్ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ వార్షిక ఆదాయం రూ. 2.26 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా విశ్వజీత్ కదం రూ. 2.35 కోట్లతో తృతీయ స్థానంంలో ఉన్నారు. 42 మంత్రులలో 37 మంత్రులు తమపై అప్పులున్నట్టు ప్రకటించారు. వీరిలో విశ్వజీత్ కదం అత్యధికంగా రూ. 121 కోట్లు అప్పు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ నేత జితేంద్ర అవాడ్‌పై రూ. 37 కోట్లు, కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టవార్పై రూ. 22 కోట్ల అప్పులున్నాయి. 27 మంత్రులపై కేసులు... రాష్ట్ర మంత్రి మండలిలోని 27 మంత్రులపై కేసులున్నాయి. వీరిలో 18 మంది మంత్రులపై తీవ్రమైన నేరారోపనల కేసులున్నాయి. మరోవైపు విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే 42 మంత్రులలో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన 18 మంది మంత్రులుండగా 22 మంది మంత్రులు డిగ్రీ పూర్తి చేసిన వారున్నారు. వయసు ప్రకారం పరిశీలిస్తే 17 మంది మంత్రుల వయసు 25 నుంచి 50 ఏళ్ల వరకు ఉండగా 25 మంది మంత్రుల వయసు 51 నుంచి 80 ఏళ్ల వరకు ఉంది. ఈ సారి ఉద్ధవ్ నేతృత్వంలోని మంత్రి మండలిలో కేవలం ముగ్గురు మహిళా మంత్రులే ఉన్నారు. -
ఆ మంత్రులంతా కోటీశ్వరులే..
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో కొలువుతీరిన బీజేపీ-జేజేపీ సంకీర్ణ సర్కార్‌లోని 12 మంది మంత్రులు కరోడ్‌పతిలే. వీరిలో వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రి జై ప్రకాష్ దలాల్ రూ 76 కోట్లతో అత్యంత సంపన్న మంత్రి కాగా, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా రూ 74 కోట్ల ఆస్తులతో తర్వాతి స్ధానంలో నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 2014లో హరియాణా సర్కార్‌లో 10 మంది మంత్రులకు గాను 7గురు మంత్రులు కోటీశ్వరులుగా ఈ నివేదిక విశ్లేషించింది. ఇక 12 మంది కరోడ్‌పతి మంత్రుల్లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఒకరు కావడం గమనార్హం. మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ 17.41 కోట్లని నివేదిక పేర్కొంది. -
బరిలో కోటీశ్వరులు
లోక్‌సభ 2019 ఎన్నికలకు తొలి దశ పోలింగ్ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో 545 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ దశల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుచోట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల అఫిడవిట్లలో.. ఆస్తులు, అప్పులు, స్థిర చరాస్తులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి. ములాయంసింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: మణిపురి ప్రకటించిన ఆస్తులు: రూ.20.54 కోట్లు 2014లో ఆస్తులు: రూ.15.95 కోట్లు స్థిరాస్తులు: రూ.16.21 కోట్లు (2014: రూ.12.54 కోట్లు) చరాస్తులు: రూ.4.33 కోట్లు (2014: రూ.3.41 కోట్లు) పెట్టుబడులు: రూ.50.09 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.40.13 లక్షలు (ములాయంసింగ్ యాదవ్: రూ.11.25 లక్షలు, భార్య పేరిట: 28.88 లక్షలు) అప్పులు: రూ.2.2 కోట్లు క్రిమినల్ కేసులు: లక్నోలో ఒక కేసు అధీనంలోని భూమి: రూ.7.89 కోట్ల విలువైన 10.77 ఎకరాలు, 5,000, 5,974 చ.అ. ప్లాట్లు, 16,010, 3,230 చ.అ. వైశాల్యం గల రెండు ఇళ్లు. అమిత్ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: గాంధీనగర్ ప్రకటించిన ఆస్తులు: రూ.30.81 కోట్లు స్థిరాస్తులు: రూ.15.29 కోట్లు చరాస్తులు: రూ.23.51 కోట్లు పెట్టుబడులు: రూ.21.95 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.37.61 లక్షలు అప్పులు: రూ.47.69 లక్షలు క్రిమినల్ కేసులు: పశ్చిమ బెంగాల్, బిహార్‌లో రెండు చొప్పున మొత్తం నాలుగు అధీనంలోని భూమి: 22 ఎకరాల పొలం, 3,511, 59,890 చ.అ. వ్యవసాయేతర ప్లాట్లు రెండు. సుప్రియా సూలే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: బారామతి ప్రకటించిన ఆస్తులు: రూ.140.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.116.46 కోట్లు స్థిరాస్తులు: రూ.22.55 కోట్లు (2014: రూ.17.47 కోట్లు) చరాస్తులు: రూ.118.33 కోట్లు (2014: రూ.98.99 కోట్లు) పెట్టుబడులు: రూ.97.86 కోట్లు (రూ.16.74 సుప్రియా సూలే పేరిట, రూ. 81.12 కోట్లు భర్త సదానంద సూలే పేరిట) చేతిలో ఉన్న నగదు: రూ. 94,320 (సుప్రియ పేరిట: రూ.28,770, భర్త సదానంద్: పేరిట రూ.23,050, కుమార్తె రేవతి పేరిట రూ.28,900, కొడుకు విజయ్ పేరిట రూ.13,600) అప్పులు: రూ.55 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.2.7 కోట్ల విలువైన 16.7 ఎకరాలు. రూ.1.03 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి 1.77 ఎకరాలు. 2765, 2541 చ.అ. విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లు. భర్త సదానంద్ పేరుతో 4,442 చ.అ. ఇల్లు మరొకటి). నితిన్ గడ్కరీ (బీజేపీ) పోటీ చేస్తున్న స్థానం: నాగ్‌పూర్ ప్రకటించిన ఆస్తులు: రూ.25.12 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ.69.38 లక్షలు చరాస్తులు: రూ.91.99 లక్షలు పెట్టుబడులు: రూ.3.55 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.99 లక్షలు, భార్య పేరిట రూ.11 లక్షలు) ∙అప్పులు: రూ.1.57 కోట్లు ∙క్రిమినల్ కేసులు: లేవు ∙అధీనంలోని భూమి: నాగ్‌పూర్‌లోని ధపేవాడలో 29 ఎకరాలు. ఇందులో 15 ఎకరాలు భార్య పేరుతో, 14.60 ఎకరాలు కుటుంబ ఉమ్మడి ఆస్తిగా నమోదైంది. నాగ్‌పూర్‌లోని మహల్ ప్రాంతంలో పూర్వీకుల ఇల్లు, ముంబైలోని ఎమ్మెల్యే సొసైటీలో ఒక ఫ్లాట్. ఊర్మిళ మటోండ్కర్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ ప్రకటించిన ఆస్తులు: రూ.68.88 కోట్లు స్థిరాస్తులు: రూ.41.24 కోట్లు చరాస్తులు: రూ.27.64 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు ప్రియా దత్ (కాంగ్రెస్ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: ముంబై నార్త్ సెంట్రల్ స్థిరాస్తులు: రూ.72 కోట్లు (2014: రూ.60.30 కోట్లు) చరాస్తులు: రూ.24.20 కోట్లు (2014: రూ.6 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్:రూ.8.05 కోట్లు అప్పులు: రూ.3.5 కోట్లు క్రిమినల్ కేసులు: లేవు డింపుల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) పోటీ చేస్తున్న స్థానం: కనౌజ్ ప్రకటించిన ఆస్తులు: రూ.37.78 కోట్లు 2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు స్థిరాస్తులు: రూ..26.20 కోట్లు (2014: రూ.21.71 కోట్లు) చరాస్తులు: రూ.11.58 కోట్లు (2014: రూ.6.33 కోట్లు) పెట్టుబడులు: రూ.55.50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్: రూ.8.05 కోట్లు అప్పులు: రూ.14.26 లక్షలు క్రిమినల్ కేసులు: లేవు అధీనంలోని భూమి: రూ.8.39 కోట్ల విలువైన 18.74 ఎకరాలు, 925.36 చదరపు అడుగుల ప్లాట్. రెండు ఇళ్లు. రాహుల్ గాంధీ (కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు) పోటీ చేస్తున్న స్థానం: వయనాడ్ (కేరళ) ప్రకటించిన ఆస్తులు: రూ.15.88 కోట్లు 2014లో ఆస్తులు: రూ.9.4 కోట్లు స్థిరాస్తులు: రూ.10.08 కోట్లు (2014: రూ.1.32 కోట్లు) చరాస్తులు: రూ.5.80 కోట్లు (2014: రూ.8.07 కోట్లు) ∙అప్పులు:రూ.72 లక్షలు క్రిమినల్ కేసులు: 5 (పరువు నష్టం దావాలు నాలుగు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన కేసు మరొకటి నమోదై ఉంది) -
ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు జాక్‌పాట్
సాక్షి, ముంబై: ప్రపంచ ఈ కామర్స్దిగ్గజం వాల్‌మార్ట్ , దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా డీల్ నేపథ్యంలో ఉద్యోగులు భారీగా లాభపడనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ డీల్‌లో భాగంగా స్టాక్ బై బ్యాక్ ఆప్షన్ కింద ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలినట్టయింది. దీంతొ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారిపోనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ డీల్ పిలుస్తున్న ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయడం కోసం 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3300 కోట్లు) కేటాయించింది. ఈ డీల్ పూర్తవగానే ఈఎస్ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్) ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు లాభాపడనున్నారు. తాజా ఒప్పందంతో సీనియర్ సభ్యుల కొందరు కోటీశ్వరులు కాబోతున్నారని మార్కెటింగ్ టీంలోని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదనీ, బహుశా శుక్రవారం ఒక ప్రకటన వచ్చే అవకాశ ఉందని భావించారు. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు మూడేళ్ల వ్యవధిలో తమ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 200-250మంది, మింత్రాకు చెందిన 150మందికి, జబాంగ్‌లోని మరో 50 మంది ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్ గ్రూప్ సీఈవో బిన్ని బన్సాల్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను 100శాతం బై బేక్ చేస్తామని బుధవారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. షేర్ ధర సుమారు 10వేల రూపాయల వద్ద ఈ కొనుగోలు ఉండవచ్చని భావిస్తున్నారు. -
మూడో వంతు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడింట ఓ వంతు పైగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2013లో వారు ఎన్నికైనప్పుడు 35 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. పార్టీల వారీగా చూస్తే 36 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదవగా, బీజేపికి చెందిన 13 మంది, జేడీఎస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. కర్ణాటక ఎమ్మెల్యేల్లో 52 శాతం మంది 5 కోట్ల రూపాయలు పైబడిన ఆస్తులు కలిగిఉన్నారు. 25 శాతం మంది ఎమ్మెల్యేలకు 2 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య ఆస్తులుండగా, 22 శాతం ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షల నుంచి 2 కోట్ల మధ్య ఆస్తులున్నాయి. రూ. 10 లక్షల నుంచి 50 లక్షల లోపు ఆస్తులున్న ఎమ్మెల్యేలు కేవలం 0.5 శాతం మందే కాగా పది లక్షల రూపాయలలోపు ఆస్తులు కూడా కేవలం 0.5 శాతం మందే ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా 1765 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్ధానాలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. -
మూడింతలైన కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : కార్పొరేట్ ఇండియాలో కరోడ్‌పతి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య గత రెండేళ్లలో మూడు రెట్లు పెరిగింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ కోటికి పైగా వార్షిక వేతనం అందుకునే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య 422 నుంచి 2017లో ఏకంగా 1,172 మందికి పెరిగింది. కాపిటాలైన్ ఇతర వార్షిక నివేదికల గణాంకాల ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. బడా కంపెనీలు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించడం, లాభాలు పెరగడంతో పలు మధ్యస్ధాయి కంపెనీల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పలువురు ప్రమోట్ కావడంతో కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య పెరిగింది. బీఎస్ఈ 200 గ్రూప్‌లో ప్రతి కంపెనీలో సగటున రూ 5.5 కోట్ల ప్యాకేజ్‌తో ఐదుగురు కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. ఈ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో రూ 5000 కోట్లు (నికర లాభంలో 1.1 శాతం) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలకు వెచ్చించాయి. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో రూ కోటికి పైగా వేతనం అందుకుంటున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా 105 కాగా, టీసీఎస్‌లో 91, భారతి ఎయిర్‌టెల్‌లో 82 మంది కరోడ్‌పతి ఎగ్జిక్యూటివ్‌లున్నారు. -
ఆ ఊర్లో అందరూ కోటీశ్వరులే..
సాక్షి, ఈటానగర్ : ఈశాన్య రాష్ట్రాల్లోని ఆ చిన్ని గ్రామం..నిన్నమొన్నటి వరకూ గ్రామీణ భారతాన్ని ప్రతిబింబించే సగటు పల్లెటూరు. కాయకష్టం చేసి పొట్టపోసుకునే గ్రామస్తులే అడుగడుగునా కనిపిస్తారు. అయితే రాత్రికి రాత్రే వారంతా ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బోంజా గ్రామంలో ఇప్పుడు అంతా సంపన్నులే. వారంతా ఆసియా దేశాల్లో సంపన్నుల సరసన నిలిచారు. వీరికి అనూహ్యంగా ఇంత సంపద ఎలా వచ్చి పడిందనేగా సందేహం. భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన పరిహారంతో వీరంతా కోటీశ్వరులయ్యారు. గ్రామంలోని 31 కుటుంబాలకు రూ 40.83 కోట్ల పరిహారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. 200 ఎకరాల భూమిని సేకరించినందుకు ఈ పరిహారాన్ని చెల్లించారు. నష్టపరిహారం పొందిన వారిలో ఓ వ్యక్తికి రూ 6.73 కోట్లు రాగా, ఓ కుటుంబానికి రూ 2.44 కోట్లు అందాయి. 31 కుటుంబాల్లో 29 కుటుంబాలకు రూ కోటి 9 లక్షల పైనే పరిహారం దక్కింది. దీంతో గ్రామస్తులంతా కోటీశ్వరులైన గ్రామంగా బోంజా రికార్డులకెక్కింది. రక్షణ శాఖ కీలకస్ధావర ప్రణాళికా యూనిట్లను నెలకొల్పేందుకు ఈ భూమిని సేకరించారు. అరుణాచల్ సీఎం పెమా ఖండూ స్థానికులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. -
కొత్త ఎంపీల్లో కోటీశ్వరులు వీరే!
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 96 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇటీవల 57 మంది రాజ్యసభకు ఎన్నికైయ్యారు. వీరిలో ఎన్పీపీకి చెందిన ప్రపుల్ పటేల్ అత్యధిక ఆస్తులు కలిగిన వారిగా గుర్తించినట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) సర్వే నివేదిక వెల్లడించింది. ఆయనకు రూ. 252 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ (212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా(193 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అత్యధిక ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల్లో మీడియా మొఘల్ సుభాష్ చంద్ర టాప్-10 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఆయన ఆస్తిపాస్తులు రూ. 49 కోట్లుగా చూపించారు. అతి తక్కువ ఆస్తులు కలిగిన ఎంపీల జాబితాలో బీజేపీకి అనిల్ దవే(60 లక్షలు), రామకుమార్(86 లక్షలు), కాంగ్రెస్ కు చెందిన(1.8కోట్లు) ఉన్నారు. 57 మంది ఎంపీల్లో 13 మంది(23 శాతం)పై క్రిమినల్ కేసులు, ఏడుగురు(12 శాతం)పై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయి. -
వారిలో సగంమంది కోటీశ్వరులే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో దాదాపు సగమంది కోటీశ్వరులే. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధికంగా 83 శాతంమంది కోటీశ్వరులున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం నుంచి కొత్తగా గెలిచిన 812 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రతిపాదికగా సర్వే చేసింది. కాగా కొద్దిమంది ఎమ్మెల్యేల వివరాలు మాత్రం అందుబాటులో లేవు. పుదుచ్చేరిలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 25 మంది కోటీశ్వరులు. ఆ తర్వాతి స్థానం తమిళనాడుది. తమిళనాడులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 76 శాతం మంది కోటీశ్వరులు. 223 మంది ఎమ్మెల్యేల వివరాలను పరిశీలించగా, 170 మంది కోటీశ్వరులని సర్వేలో తేలింది. ఇక అసోంలో 57 శాతం (126 మంది ఎమ్మెల్యేలలో 76 మంది), కేరళలో 44 శాతం (140 మందిలో 61 మంది) ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. ఐదు రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో తక్కువగా 34 శాతం మంది కోటీశ్వరులున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 133 కోట్ల విలువైన ఆస్తులుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంతకుమార్ ఆస్తుల విలువ 337 కోట్ల రూపాయలు. కొత్త ఎమ్మెల్యేలలో 80 ఏళ్ల పైబడినవారు ఐదుగురు ఉండగా, 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు ఐదుగురు ఎన్నికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు 77 మంది ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి అత్యధికంగా 10 మంది ఎమ్మెల్యేలు పీహెచ్డీ చేశారు. -
ఆ ఎమ్మెల్యేలలో 97% కోటీశ్వరులే!
దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్, 10న ఫలితాల వెల్లడి ఉంటుంది. అయితే.. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే.. వాళ్లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 31 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందులో 30 మందికి సగటున 12 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. అలాగే, వాళ్లలో మొత్తం 17 మందికి నేర చరిత్ర కూడా ఉంది. ఈ విషయం వాళ్లు ఇచ్చిన అఫిడవిట్లలోనే ఉంది. 49 రోజుల పాటు అధికారంలో కూర్చున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. ఆ పార్టీకి ఉన్న 28 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీళ్ల సగటు ఆస్తి కోటి రూపాయలు. ముగ్గురి మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. వాళ్లలో ఏడుగురు.. అంటే 88 శాతం మంది కోటీశ్వరులు. వాళ్ల సగటు ఆస్తి 10కోట్ల రూపాయలకు పైనే. వీళ్లలో ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి. -
కౌన్ బనేహై కరోడ్ పతి?
పార్టీలు ఏవైనా ఈసారి మాత్రం మన రాష్ట్రంలో పోటీ చేస్తున్న రాజకీయ అభ్యర్ధుల ఆస్తులు మాత్రం 5 రెట్లు పెరిగాయి. ఒకరు కారు, ఇద్దరు కారు.... ఏకంగా 74 మంది కోటీశ్వర్లు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ జారీ చేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న మొత్తం 265 మంది రాజకీయ నాయకుల్లో 74 మంది నాయకులు కోటీశ్వరులు. అంతేకాదు, రాజకీయ నాయకుల సంపద ఏ ఏడాదికాఏడాది భారీగా పెరుగుతోంది. కోటీశ్వరులైన రాజకీయ నాయకుల సంఖ్య 2009 తో పోలిస్తే 20 శాతం నుంచి 28శాతంకు పెరిగింది. 2009లో కోటీశ్వరులుగా ఉన్న రాజకీయ నాయకులు సగటు ఆస్తులు 2.50 కోట్లుగా ఉంటే ఇపుడు అవి 8.49 కోట్లకు పెరిగాయని ఏడీఆర్ తెలిపింది. రాష్ట్రంలో ఎక్కువ మంది కోటీశ్వరులు టిడిపి లోనే ఉన్నారు. టీడీపీలో పోటీ చేస్తున్న 89 శాతం మంది కోటీశ్వరులే . ఇక రెండో స్ధానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులున్నారు. టీఆర్ ఎస్ తరఫున పోటీ దారుల్లో 82 శాతం మంది కోటీశ్వరులే . ఆ తరువాత స్ధానంలో 81శాతం కోటీశ్వరులు కాంగ్రెస్ లో ఉన్నారు. చివరకు కామన్ మ్యాన్ పోటీ చేస్తారని చెపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోనూ 50 శాతం మంది పోటీదారులు కోటికి మించి ఆదాయం ఉన్నవారే కావడం విశేషం. ఇక క్యాండెట్ల వారిగా పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కొండావిశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 528 కోట్లు. రెండో స్థానంలో టిడిపికి చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 338 కోట్లు . ఇక మూడో రిచెస్ట్ అభ్యర్ధి కాంగ్రెస్ కి చెందిన జి వివేక్. ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ 266కోట్లు. వివిధ పార్టీలకు చెందిన దాదాపుగా ఆరుగురు అభ్యర్ధుల ఆస్తుల విలువ వందేసి కోట్లు. తక్కువ ఆస్తులు ఉన్న పార్టీలలో 13 మంది వైఎస్సార్ సిపికి చెందిన వారు. వారి సరాసరి ఆస్తుల విలువ 4.29 కోట్లు. కాగా ఎనిమిది మంది బిజెపి అభ్యర్ధుల విలువ సరాసరిన 29.73 కోట్లు. ఇక ఆఫిడవిట్ సమర్పించిన వారిలో ఆన్కంటాక్స్ వివరాలు ప్రకటించని వారిశాతం 51కాగా 23శాతం మంది ప్యాన్ కార్డ్ వివరాలు అందించలేదు. -
రాష్ట్రం నుంచి ఎన్నికల బరిలో కోటీశ్వరులు
-
కేసులు, కాసులు ఉంటేనే ఎంపీ సీట్లు
గూండాయిజం, నేరచరిత్ర, దౌర్జన్యం ... ఈ మూడూ ఉంటే చాలు యూపీలో రాజకీయంలో రాణించవచ్చు. ఎన్నికల సంస్కరణలకోసం పొరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోటీశ్వరులైనా అయి ఉండాలి లేదా బోలెడన్ని క్రిమినల్ కేసులైనా ఉండాలి. యూపీలో ఏప్రిల్ 24 న 12 లోకసభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్ లో 168 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 27 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయిని పేర్కొన్నారు. 58 మంది కోటీశ్వరులు. నేర చరిత్ర ఉన్న 27 మందిలో 19 మందిపై హత్యానేరం కేసులు ఉన్నాయి. వీరిలో బిఎస్ పీ కి చెందిన వారు ఏడుగురు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు అయిదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిల అభ్యర్థుల్లో చెరి ముగ్గురు నేరచరితులు ఉన్నారు. ఇక స్వచ్ఛమైన రాజకీయాలు, నేర రహిత రాజకీయాల గురించి మాట్లాడే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక నేరచరితుడికి టికెట్ ఇచ్చింది. కోటీశ్వరుల విషయంలోనూ బిఎస్ పీ దే పై చేయి. బిఎస్ పీ తరఫున 12 మంది, బిజెపి తరఫున 11 మంది, కాంగ్రెస్ తరఫున నలుగురు, ఆమ్ ఆద్మీపార్టీ తరఫున అయిదుగురు కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మథుర నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న నటి హేమమాలిని తన ఆస్తి 178 కోట్లుగా పేర్కొన్నారు. -
ఢిల్లీ ఎన్నికల బరిలో 33 శాతం మంది కోటీశ్వరులే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 810 మంది అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులే. వీరిలో అతి సంపన్ను డైన అభ్యర్థి ఆస్తి 235 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా చూస్తే... రాజోరీ గార్డెన్ నుంచి పోటీచేస్తున్న మంజిందర్ సిర్సా అతి సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.235.5 కోట్లు. సిర్సా తరువాత స్థానంలో సుశీల్ గుప్తా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన గుప్తా ఆస్తుల విలువ రూ.164 కోట్లు. ఢిల్లీ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలను పరిశీలించిన ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థ అభ్యర్థులలో 33 శాతం మంది కోటీశ్వరులని తేల్చింది. ఐదేళ్ల కిందట అభ్యర్థి సగటు ఆస్తి 1.7 కోట్ల రూపాయలు ఉండేదని, ఇప్పుడది రూ.3.43 కోట్లకు పెరిగిందని ఏడీఆర్ ఎలక్షన్ వాచ్ నివేదిక తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఆస్తి 14 కోట్ల రూపాయలుంది. బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.8 కోట్లు. సామాన్యుల పార్టీగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.2.5 కోట్లు ఉంది. నేరారోపణలు ఎదుర్కొంటన్నవారిలో బీజేపీ ముందు.. గత ఐదేళ్లలో అభ్యర్థులపై క్రిమినల్ రికార్డుల సంఖ్య కూడా 14 నుంచి 16 శాతానికి పెరిగిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న 129 మంది అభ్యర్థులపై.. అంటే 16 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 93 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో 15 మందిపై, బీజేపీ అభ్యర్థులలో 31 మందిపై, బీఎస్పీ అభ్యర్థులలో 14 మందిపై, ఆప్ అభ్యర్థులలో ఐదుగురిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉండగా ప్రజలను పాలిస్తామని నమ్మబలుకుతూ ఎన్నికల్లో నిల్చుంటున్నవారు కోట్లు కూడబెట్టిన వారు, కేసుల్లో ఇరుకున్నవారని తెలిసినా ప్రజలకు వారికే పట్టం కడుతున్నారని, అలాంటివారిని తిరస్కరించే అవకాశం ఈసారి ఓటర్లకు ‘నోటా’ బటన్ ద్వారా వచ్చిందని నగరంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.