సాక్షి ముంబై : మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన మహావికాస్ ఆఘాడి మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో 41 మంత్రులు కోటీశ్వరులే ఉన్నారు. తొలిసారిగా పోటీ చేసిన సహాయక మంత్రి అదితి తట్కరే మాత్రం లక్షాధికారిగానే నిలవడం గమనార్హం. ఆమె మినహా మిగతా 41 మంది మంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ. 21.9 కోట్లు ఉందని సమాచారం. ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్’ అనే సంస్థ మహారాష్ట్రలోని మంత్రుల ఆస్తులతోపాటు నేరచరిత్రకు సంబంధించిన వివరాలు ఇతర వివరాలను వెల్లడించింది. ఎన్నికల సమయంలో నామినేషన్లను ప్రకటించిన వివరాల మేరకు ఈ సంస్థ ఓ రిపోర్టును వెల్లడించింది.
ఈ సంస్థ వివరాల మేరకు 42 మంది మంత్రులలో కాంగ్రెస్‌కు చెందిన విశ్వజీత్ కదం అత్యధిక సంపన్నుడిగా తెలిసింది. ఆయన ఆస్తులు రూ. 216 కోట్లు కావడం విశేషం. 2014లో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోకంటే ఈ సారి మంత్రి మండలిలో 82 శాతం మంత్రులు కోటీశ్వరులున్నారు. వీరిలో ముగ్గురు అత్యధికంగా తమ ఆస్తులను ప్రకటించినవారిలో ఉన్నారు. విశ్వజీత్ కదం రూ. 216 కోట్లు, అనంతరం ద్వితీయ స్థానంలో ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ. 75 కోట్లు, ఆతర్వాత ఎన్సీపీ నేత రాజేష్ టోపే రూ. 53 కోట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోటీశ్వరుడా లేదా అనేది తెలియరాలేదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియరాలేదు. అదేవిధంగా తొలిసారిగా పోటీ చేసిన ఎన్సీపీ నేత సునీల్ తట్కరే కూతురు అదితి తట్కరే ఆస్తులు మాత్రం రూ. 39 లక్షలున్నాయని ప్రకటించారు.
వార్షిక ఆదాయంలో అజిత్ ప్రథమం..
రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో రూ. 3.86 కోట్ల వార్షిక ఆదాయంతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన అనంతరం దివంగత కాంగ్రెస్ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ వార్షిక ఆదాయం రూ. 2.26 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా విశ్వజీత్ కదం రూ. 2.35 కోట్లతో తృతీయ స్థానంంలో ఉన్నారు. 42 మంత్రులలో 37 మంత్రులు తమపై అప్పులున్నట్టు ప్రకటించారు. వీరిలో విశ్వజీత్ కదం అత్యధికంగా రూ. 121 కోట్లు అప్పు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ నేత జితేంద్ర అవాడ్‌పై రూ. 37 కోట్లు, కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టవార్‌పై రూ. 22 కోట్ల అప్పులున్నాయి.
27 మంత్రులపై కేసులు...
రాష్ట్ర మంత్రి మండలిలోని 27 మంత్రులపై కేసులున్నాయి. వీరిలో 18 మంది మంత్రులపై తీవ్రమైన నేరారోపనల కేసులున్నాయి. మరోవైపు విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే 42 మంత్రులలో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన 18 మంది మంత్రులుండగా 22 మంది మంత్రులు డిగ్రీ పూర్తి చేసిన వారున్నారు. వయసు ప్రకారం పరిశీలిస్తే 17 మంది మంత్రుల వయసు 25 నుంచి 50 ఏళ్ల వరకు ఉండగా 25 మంది మంత్రుల వయసు 51 నుంచి 80 ఏళ్ల వరకు ఉంది. ఈ సారి ఉద్ధవ్ నేతృత్వంలోని మంత్రి మండలిలో కేవలం ముగ్గురు మహిళా మంత్రులే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment