Association of Democratic Reforms
-
Association of Democratic Reforms: ఎంపీల్లో 46 శాతం నేర చరితులు
న్యూఢిల్లీ: లోక్‌సభకు తాజాగా ఎన్నికైన 543 మందిలో 46 శాతం అంటే 251 మంది నేరచరితులు ఉన్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) నివేదించింది. ఈ 251 మందిలో 27 మంది దోషులుగా తేలారు. నేర చరితులు ఇంత భారీ సంఖ్యలో దిగువసభకు ఎన్నికవడం ఇదే మొదటిసారి అని ఏడీఆర్ పేర్కొంది. 2014 ఎన్నికల్లో 34 శాతం అంటే 185 మంది, 2009లో 30 శాతం అంటే 162 మంది, 2004లో 23 శాతం అంటే 125 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. -
Lok sabha elections 2024: బరిలో కుబేరులు
లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్న వారిలో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీల టికెట్లు దక్కించుకునేందుకు ధనబలం కూడా ప్రాతిపదికగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తొలి విడతలో బరిలో ఉన్న 1,625 మంది అభ్యర్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రైట్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 102 లోక్‌సభ స్థానాల్లో ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచే ఎక్కువ... తొలి విడతలో మొత్తం 1,625 మంది అభ్యర్థుల్లో 450 మందికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయి. జాబితాలో బీజేపీ నుంచి అత్యధికంగా 69 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (49 మంది), అన్నాడీఎంకే (35), డీఎంకే (21), బీఎస్పీ (18), టీఎంసీ (4), ఆర్జేడీ (4 మంది) ఉన్నాయి. అభ్యర్థుల సగటు ఆస్తులపరంగా అన్నాడీఎంకే టాప్‌లో ఉంది. ఈ పార్టీ అభ్యర్థులు ఒక్కొక్కరికి సగటున రూ.35.61 కోట్ల ఆస్తులున్నాయి. తొలి దశ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. అఫిడవిట్లో వెల్లడించిన ఆయన ఆస్తుల విలువ రూ.717 కోట్లు. ఛింద్వారా సిటింగ్ ఎంపీ అయిన ఆయన ఈసారి కూడా అక్కడినుంచే కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ అభ్యర్థి అశోక్ కుమార్ ఉన్నారు. ఈ అన్నాడీఎంకే నేత తనకు రూ.662 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తులూ లేవని ప్రకటించడం విశేషం! 93 మంది నేరచరితులు తొలి విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో నేరచరిత్ర కలిగిన వారి సంఖ్య కూడా ఎక్కువే. జాబితాలో బీజేపీ నుంచి 28 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డీఎంకే (13), అన్నాడీఎంకే (13), బీఎస్పీ (11), ఆర్జేడీ (4), ఎస్పీ (3), టీఎంసీ (2) ఉన్నాయి. వీరిలో బీజేపీ నుంచి 14 మందిపై తీవ్ర నేరపూరిత కేసులున్నాయి. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (8), బీఎస్పీ (8), డీఎంకే (6), అన్నాడీఎంకే (6), ఆర్జేడీ (2), ఎస్పీ (2), టీఎంసీ (1) ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అజ్ఞాత విరాళాలతో రూ. 3,370 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలన్నీ కలిసి 2019–20 కాలంలో రూ. 3,377.41కోట్లను గుర్తుతెలియని వనరుల(అన్నౌన్ సోర్సెస్) నుంచి సమీకరించాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫా మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. పార్టీల మొత్తం ఆర్జనలో ఈ అజ్ఞాత విరాళాల ద్వారా ఆర్జించిన మొత్తం 70.98 శాతానికి అంటే ముప్పావు వంతుకు సమానమని తెలిపింది. ఈ నిధుల్లో సింహభాగం అంటే రూ. 2,642. 63కోట్లు బీజేపీ సమీకరించగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్(రూ.526కోట్లు), ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, బీఎస్పీ ఉన్నాయని తెలిపింది. మొత్తం సొమ్ములో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ద్వారా రూ. 2,993.82 కోట్లు లభించాయని ఏడీఆర్ వెల్లడించింది. 2004–05 నుంచి 2019–20 మధ్య కాలంలో ఈ అంతుచిక్కని మార్గాల్లో పార్టీలు సమీకరించిన మొత్తం రూ. 14,651. 53కోట్లని వివరించింది. 2019–20 కాలంలో పార్టీలు సేకరించిన నగదు రూపంలో సేకరించిన మొత్తం రూ.3.18లక్షలు మాత్రమే కావడం గమనార్హం. రూ.20వేలకు పైబడిన విరాళాలకు పార్టీలు రసీదులు జారీ చేయాల్సిఉంటుంది. అయితే రూ.20వేల లోపు ఇచ్చే విరాళాల దాతల వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఇలా రూ. 20వేల లోపు విరాళాన్ని ఇచ్చే వర్గాలను అజ్ఞాత వర్గాలంటారు. వీటిని ఐటీ పత్రాల్లో అన్నౌన్ సోర్సుగా పేర్కొంటారు. ఈ నిధులు ఇచ్చిన సంస్థలు, వ్యక్తుల వివరాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు, కూపన్ల విక్రయాలు, రిలీఫ్ పండ్ లాంటివన్నీ ఈ అజ్ఞాత మార్గాల కిందకు వస్తాయి. -
బీజేపీకి అత్యధికంగా రూ. 276 కోట్లు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు 2019–20లో వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం ఏడు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి అత్యధికంగా రూ. 276.45 కోట్లు విరాళంగా వచ్చాయి. ఇది మొత్తం విరాళాల్లో 76.17%. ఆ తరువాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్‌కు 15.98% (రూ. 58 కోట్లు) విరాళాలు మాత్రమే వచ్చాయని బుధవారం ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అత్యధికంగా విరాళాల ఇచ్చిన సంస్థల్లో జేఎస్‌డబ్ల్యూ, అపోలో టైర్స్, ఇండియాబుల్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డీఎల్ఎఫ్ గ్రూప్ తొలి ఐదుస్థానాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ అత్యధికంగా రూ. 39.10 కోట్లను ఇవ్వగా, అపోలో టైర్స్ రూ. 30 కోట్లను, ఇండియాబుల్స్ రూ. 25 కోట్లను విరాళంగా ఇచ్చాయి. 18 మంది వ్యక్తులు కూడా వ్యక్తిగత విరాళాలను ఈ ట్రస్ట్‌లకు అందించారు. వారిలో 10 మంది ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు మొత్తం రూ. 2.87 కోట్లను అందించారు. స్మాల్ డొనేషన్స్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఐదుగురు వ్యక్తులు రూ. 5.5 లక్షలు ఇచ్చారు. మరో నలుగురు స్వదేశీ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు రూ. 1 లక్ష ఇచ్చారు. ఇతర పార్టీల్లో ఆప్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, యువ జనజాగృతి పార్టీ, జననాయక పార్టీ, జేడీయూ, జేఎంఎం, ఎల్జేపీ, శిరోమణి అకాలీదళ్, జేకేఎన్సీ, ఐఎన్ఎల్డీ, ఆర్ఎల్డీ పార్టీలు కలిసి రూ. 25.46 కోట్లు అందుకున్నాయి. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతీ సంవత్సరం నివేదిక రూపంలో తమకు అందించాలని ఎన్నికల సంఘం ఎలక్టోరల్ ట్రస్ట్‌లను ఆదేశించిన విషయం తెలిసిందే. -
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల్లో 18% నేరచరితులే
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థుల్లో 18శాతం మంది నేరచరిత్ర ఉన్నవారేనని ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. బెంగాల్లో మూడో విడత ఎన్నికలు, మిగిలిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటివరకు 6,792 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే వారిలో 6,318 మంది దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ అధ్యయనం చేసింది. వారిలో 1,157 మంది (18%) నేర చరిత్ర ఉన్నట్టు నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో పేర్కొన్నారు. 632 మందిపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టుగా అభియోగా లున్నాయి. బెంగాల్లో మూడో విడత వరకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో 25% మంది నేరచరితులుంటే, 21% మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. తమిళనాడు లో 13%, కేరళలో 38%, అస్సాంలో 15%, పుదుచ్చేరిలో 17% మంది నేరచరితులు ఉన్నారు. -
ఇది కోటీశ్వరుల మంత్రిమండలి!
సాక్షి ముంబై : మహారాష్ట్రలో నూతనంగా ఏర్పాటైన మహావికాస్ ఆఘాడి మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో 41 మంత్రులు కోటీశ్వరులే ఉన్నారు. తొలిసారిగా పోటీ చేసిన సహాయక మంత్రి అదితి తట్కరే మాత్రం లక్షాధికారిగానే నిలవడం గమనార్హం. ఆమె మినహా మిగతా 41 మంది మంత్రుల సగటు వార్షిక ఆదాయం రూ. 21.9 కోట్లు ఉందని సమాచారం. ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్’ అనే సంస్థ మహారాష్ట్రలోని మంత్రుల ఆస్తులతోపాటు నేరచరిత్రకు సంబంధించిన వివరాలు ఇతర వివరాలను వెల్లడించింది. ఎన్నికల సమయంలో నామినేషన్లను ప్రకటించిన వివరాల మేరకు ఈ సంస్థ ఓ రిపోర్టును వెల్లడించింది. ఈ సంస్థ వివరాల మేరకు 42 మంది మంత్రులలో కాంగ్రెస్‌కు చెందిన విశ్వజీత్ కదం అత్యధిక సంపన్నుడిగా తెలిసింది. ఆయన ఆస్తులు రూ. 216 కోట్లు కావడం విశేషం. 2014లో రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోకంటే ఈ సారి మంత్రి మండలిలో 82 శాతం మంత్రులు కోటీశ్వరులున్నారు. వీరిలో ముగ్గురు అత్యధికంగా తమ ఆస్తులను ప్రకటించినవారిలో ఉన్నారు. విశ్వజీత్ కదం రూ. 216 కోట్లు, అనంతరం ద్వితీయ స్థానంలో ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ. 75 కోట్లు, ఆతర్వాత ఎన్సీపీ నేత రాజేష్ టోపే రూ. 53 కోట్లతో తృతీయ స్థానంలో ఉన్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోటీశ్వరుడా లేదా అనేది తెలియరాలేదు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియరాలేదు. అదేవిధంగా తొలిసారిగా పోటీ చేసిన ఎన్సీపీ నేత సునీల్ తట్కరే కూతురు అదితి తట్కరే ఆస్తులు మాత్రం రూ. 39 లక్షలున్నాయని ప్రకటించారు. వార్షిక ఆదాయంలో అజిత్ ప్రథమం.. రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి మండలిలోని 42 మంది మంత్రులలో రూ. 3.86 కోట్ల వార్షిక ఆదాయంతో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన అనంతరం దివంగత కాంగ్రెస్ నేత విలాస్‌రావు దేశ్‌ముఖ్ కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ వార్షిక ఆదాయం రూ. 2.26 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉండగా విశ్వజీత్ కదం రూ. 2.35 కోట్లతో తృతీయ స్థానంంలో ఉన్నారు. 42 మంత్రులలో 37 మంత్రులు తమపై అప్పులున్నట్టు ప్రకటించారు. వీరిలో విశ్వజీత్ కదం అత్యధికంగా రూ. 121 కోట్లు అప్పు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఎన్సీపీ నేత జితేంద్ర అవాడ్‌పై రూ. 37 కోట్లు, కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టవార్పై రూ. 22 కోట్ల అప్పులున్నాయి. 27 మంత్రులపై కేసులు... రాష్ట్ర మంత్రి మండలిలోని 27 మంత్రులపై కేసులున్నాయి. వీరిలో 18 మంది మంత్రులపై తీవ్రమైన నేరారోపనల కేసులున్నాయి. మరోవైపు విద్యాభ్యాసాన్ని పరిశీలిస్తే 42 మంత్రులలో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన 18 మంది మంత్రులుండగా 22 మంది మంత్రులు డిగ్రీ పూర్తి చేసిన వారున్నారు. వయసు ప్రకారం పరిశీలిస్తే 17 మంది మంత్రుల వయసు 25 నుంచి 50 ఏళ్ల వరకు ఉండగా 25 మంది మంత్రుల వయసు 51 నుంచి 80 ఏళ్ల వరకు ఉంది. ఈ సారి ఉద్ధవ్ నేతృత్వంలోని మంత్రి మండలిలో కేవలం ముగ్గురు మహిళా మంత్రులే ఉన్నారు. -
ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్ కుమార్ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి రాం సహాయ్ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్పూర్ అభ్యర్థి ధనుక్ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు. ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్(సీఎం కమల్‌నాథ్ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్పూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తన్ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది.వివేక్ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్ 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్ 29న పోలింగు జరుగుతుంది. -
యూపీ బరిలో 302 మంది కోటీశ్వరులు!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 302 మంది కోటీశ్వరులున్నారని, 168 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న 73 మందిలో 66 మంది, బీజేపీ 73 మందిలో 61 మంది, 51 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 40 మంది తమ ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ నివేదిక బహిర్గతం చేసింది. యూపీ తొలి దశ ఎన్నికల పోటీలో ఉన్న 836 అభ్యర్థుల వివరాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక ముఖ్యాంశాలు...అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు. 143 మంది అభ్యర్థులు తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఉన్నాయని తెలిపారు. 186 మంది తమ పాన్ వివరాలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 11న ఈ పోలింగ్ జరుగుతుంది. -
పార్టీల్లోని నల్లడబ్బును ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: దేశంలో 2005 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం కాగితాలకే పరిమితమైన దాదాపు 200 రాజకీయ పార్టీలను పన్ను మినహాయింపు ప్రయోజనాల జాబితాల నుంచి తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు నివేదిస్తూ సిఫార్సు చేయాలని ఇప్పుడు నిర్ణయించినట్లు తెల్సింది. నల్లడబ్బుకు, హవాల కార్యకలాపాలకు ఈ పార్టీలు నిలయాలవుతున్న సంగతి అందరికి ఎరుకే. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముందుగా రాజకీయ పార్టీలకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న నల్లడబ్బును అరికట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ అంశంపై మోదీ ప్రభుత్వం ఇంతవరకు పెదవి విప్పకపోయినా ఎన్నికల కమిషన్ కాస్త చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుతమున్న 20 వేల రూపాయల లోపు వచ్చే విరాళాలకు సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదన్న నిబంధనను రెండు వేల రూపాయలకు మాత్రమే పరిమితం చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాజకీయ పార్టీలకు ఆ చిత్తశుద్ధి ఉందా? రెండు వేల రూపాయల మాట దేవుడెరుగు. 20వేల రూపాయలకు పైగా వచ్చే విరాళాల సోర్స్‌ను వెల్లడించాలన్న నిబంధనలను పాలక, ప్రతిపక్ష పార్టీలు సహా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటికీ పాటించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు పౌరుల సమాచారా హక్కులను చిత్తశుద్ధితో గౌరవించాలంటూ కేంద్ర సమాచార కౌన్సిల్ 2013లో ఇచ్చిన తీర్పును కూడా ఏ రాజకీయ పార్టీలు ఖాతరు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. 73 శాతం విరాళాలు నల్లడబ్బే 2004 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం మధ్య దేశంలోని పలు జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 73 శాతం నల్లడబ్బేనని ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ ఓ నివేదికలో వెల్లడించింది. రాజకీయ విరాళాల్లో నల్లడబ్బును నియంత్రించేందుకు గతంలో జరిగిన పలు ప్రయత్నాలను పాలక, ప్రతిపక్షం అనే తేడా లేకుండా పలు ప్రధాన జాతీయ పార్టీలు అడ్డుకున్నాయి. 1998లో ఎన్నికల ఫండింగ్ కోసం టాటా కంపెనీ ముందుకు వచ్చింది. కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఏ పార్టీకి ఎంత ఫండింగ్ చేయాలో నిర్ణయించేందుకు పౌర ప్రముఖులతోనే ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఆ ప్రతిపాదన అప్పట్లోనే చిత్తు కాగితాల్లో కలసి పోయింది. మోదీ నోట స్టేట్ ఫండింగ్ మాట ఎన్నికల సంస్కరణలో భాగంగా స్టేట్ ఫండింగ్ (ప్రభుత్వ నిధులు) అంశంపై చర్చించాలని పెద్ద నోట్లకు రద్దుకుముందే ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం మంచిది కాదని, స్టేట్ ఫండింగ్ మంచిదని నాడు జస్టిస్ వాంచూ కమిటీ కూడా సిఫార్సు చేసింది. స్టేట్ ఫండింగ్ అని పిలవడం తప్పనేవారు కూడా ఉన్నారు. ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వానికి చెల్లించే సొమ్మును ప్రభుత్వం సొమ్ముగా ఎలా పరిగణిస్తారని, రాజీకీయ పార్టీలకు ప్రభుత్వం కేటాయించే నిధి కూడా ప్రజా నిధే అవుతుందని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే తొందరపాటు నిర్ణయంతో ప్రజాధరణ కోల్పోతున్న మోదీ, రాజకీయ పార్టీల్లోని నల్లడబ్బుపై బాణం ఎక్కు పెడతారా అన్నది ప్రశ్న. -
170 మందిపై క్రిమినల్ కేసులు
న్యూఢిల్లీ: ఈ నెల 12న జరిగే బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 583 మంది అభ్యర్థుల్లో 130 మంది తీవ్రస్థాయి క్రిమినల్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ దశలోని అభ్యర్థుల్లో 170 మందిపై క్రిమినల్ కేసులుండగా, వారిలో 130 మందిపై నాన్ బెయిలబుల్ కేసులున్నాయని, అందులో 16 మంది హత్యారోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తెలిపింది. అభ్యర్థులిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. వార్సాలిగంజ్ జేడీయూ అభ్యర్థి ప్రదీప్‌పై హత్యకు సంబంధించిన 4 కేసులున్నాయి. తొలిదశ అభ్యర్థుల్లో 146 మంది కోటీశ్వరులు. కాగా, పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల తయారీలో ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకోవాలని, మేనిఫెస్టో విడుదల తర్వాత తమకొక కాపీ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.